గుంటూరు : అసమర్థ అధికార కాంగ్రెస్, స్వార్థపూరిత టిడిపిల కుమ్మక్కు రాజకీయాలపై మహానేత రాజన్న ముద్దుబిడ్డ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలూ నిస్సిగ్గుగా చేస్తున్న రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు అనేక బాధలు పడుతున్నారని ఆరోపించారు. గుంటూరుజిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం జాస్తివారిపాలెంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు. సాయంత్రం గణపవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
చంద్రబాబు కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారని, అవిశ్వాసం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్యా బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించినప్పుడు 'అవును'... 'అవును' అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రవేశపెడితే తాము బలపరుస్తామని, లేకుంటే తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆయన మద్దతు పలుకుతారా అని శ్రీమతి షర్మిల సవాల్ విసిరినపుడు 'భేష్' .. 'భేష్' అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందే అంటూ పెద్ద పెట్టున కేకలు వేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు కరెంటు సరఫరా చేయాలనే ఇంగితజ్ఞానం లేని సిఎం కిరణ్‌కుమార్ అని అభివర్ణించారు.
పెరిగిన విద్యుత్, వంట గ్యాస్ ధరల వల్ల మహిళలు ఇంటిని నిర్వహించలేకపోతున్నారని, మంచినీటిని సైతం కొనుక్కొంటున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వైయస్ ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, చార్జీలు, ధరలు పెంచకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, దేశంలోనే రికార్డు సృష్టించిన సిఎం అని పేర్కొన్నారు. రాజన్న ఆశయాలు, పథకాలను అన్న జగనన్న కొనసాగిస్తారని ప్రజలకు శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.
అనూహ్యం జన ప్రభంజనం :
గణపవరంలో శ్రీమతి షర్మిల బహిరంగ సభకు అనూహ్య రీతిలో జనం ప్రభంజనమై తరలివచ్చారు. బహిరంగ సభకు సమీప గ్రామాల ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. తొలుత నాదెండ్ల సమీపంలోని శ్రీమతి షర్మిల బస కేంద్రం నుంచి ఉదయం ప్రారంభమైన పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యలో వ్యవసాయ కూలీలు శ్రీమతి షర్మిలను కలుసుకుని పెరిగిన సాగు ఖర్చులు, గిట్టుబాటు కాని వ్యవసాయం గురించి వివరించి వాపోయారు.
శ్రీమతి షర్మిల పాదయాత్రగా వెళుతున్న రహదారులకు ఇరువైపులా ఉన్న మహిళలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్, గ్యాస్ ధరల కారణంగా ఇంటి బడ్జెట్ తల్లకిందులౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక మధ్యలోనే తమ పిల్లల చదువుల్ని నిలిపివేస్తున్నామని చెప్పుకున్నారు. ఒకప్పుడు రెండు పంటలు సాగుచేసిన తాము ఇప్పుడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నామని కొందరు శ్రీమతి షర్మిల వద్ద విలపించారు. సాయంత్రానికి పాదయాత్ర గణపవరంలోని బొడ్రాయి సెంటర్‌కు చేరుకుంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.
ఈ కార్యక్రమాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్ ఆర్కే, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు, బీసీ, ఎస్సీ విభాగాల కన్వీనర్లు దేవెళ్ల రేవతి, బండారు సాయిబాబు, మహిళా విభాగం కన్వీనర్ దాది వెంకట లక్ష్మీరాజ్యం, పార్టీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, ఈపూరు అనూప్, లతీష్‌రెడ్డి, అల్తాఫ్, మండెపూడి పురుషోత్తం, నాదెండ్ల మాజీ ఎంపిపి కంజుల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.