కేంద్ర కమిటీ బయటపెట్టిన నిజాలు

పోలవరం రాష్ట్రానికి వరం అంటూ ఎక్కిన ప్రతివేదిక మీదా చెప్పే చంద్రబాబు దాన్ని పూర్తి చేయటంలో మాత్రం చిత్త శుద్ధి చూపించటం లేదు. ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ పంపించిన మసూద్ హుస్సేన్ నేతృత్వంలోని కమిటీ ఖరాఖండీగా తేల్చి చెప్పింది. 2018నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని ఈ కమిటీ నిర్థారించింది. పోలవంర పై చంద్రబాబు ప్రభుత్వం చెప్పేవన్నీ కట్టు కథలే అని తేల్చేసింది మసూద్ కమిటీ. 

డిస్ట్రిబ్యూటరీ పనులే మొదలు కాకుండా నీరివ్వడం ఎలా కుదురుతుందని నివేదిక ద్వారా నిజాలను బయటపెట్టింది. 50వేల కోట్ల రూపాయిల మేర అంచనాల పెంపు కూడా అభ్యంతరకరం అని కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఏప్రిల్ లో పోలవరాన్ని తనిఖీ చేసిన కేంద్ర బృందం సవివరంగా తన నివేదికను పంపించింది. అందులో ఇంత వరకూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ సత్యదూరంగా ఉన్నాయని తేల్చేసింది. ఏడాది ముందుగానే పోలవరం ఫలాలు అందుతాయని, అందుకోసం కాపర్ డ్యామ్ ఎత్తును పెంచుతున్నామని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. కాని అందుకోసం భూసేకరణగానీ, నిర్వాసితులకు పునరావాసం కానీ ఏదీ జరగలేదు. కాపర్ డ్యామ్ ఎత్తు పెంచాలంటే స్పిల్ వే నిర్మాణం జరగాలి…దానికి సంబంధించిన కాంక్రీట్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న తీరులో అయితే ఇంకో పదేళ్లైనా పోలవరం పూర్తయ్యే ప్రసక్తే లేదని మసూద్ హుస్సేన్ కమిటీ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. కుడి ఎడమ కాలవల నిర్మాణం, నీరందించేందుకు కాలువలకోసం భూసేకరణ కూడా ఏవీ పూర్తి స్థాయిగా జరగలేదని నివేదికలో తెలియజేసింది. వాస్తవాలు ఇలా ఉంటే 2018 కల్లా స్పిల్ వే పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తామంటూ టిడిపి సర్కార్ అధికారిక పత్రాల్లో వెల్లడించడం ప్రజలను, కేంద్రాన్నీ మభ్యపెట్టడమే అని జలరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.

ఇంతేకాదు కుడి ఎడమ కాలవ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, హెడ్ వర్క్స్ పనుల్లో నాణ్యత కూడా లేదని, వీటిపై తరుచూ కేంద్ర సంస్థలతో తనిఖీలు చేపట్టాలని కమిటీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భాగోతాలపై మసూద్ కమిటీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇక కాంట్రాక్టు వ్యవహారాలు కూడా నిబంధనలకు అనుగుణంగా లేవని, అంచనా వ్యవయం పెరగడంపై కూడా అభ్యంతరాలున్నాయని చెప్పింది. జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంలో కమిటీ అభిప్రాయపడింది. భూసేకరణలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని కూడా మసూద్ కమిటీ గుర్తించింది. కేంద్ర కమిటీ నివేదికతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పని చేయడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అబద్ధాలు అన్నివేళలా అందలం ఎక్కవనీ, కేంద్రం మొట్టికాయలతో బాబుకు ఇప్పటికైనా అర్థం అయి ఉంటుందేమో!


Back to Top