రెండు రోజుల పుడింగు

– ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. బాబు మాటల మార్పిడి
– అప్పటికప్పుడే ఉప్పెనవుతాడు.. అంతలోనే చల్లబడతాడు


రక్తం మరిగిపోతోంది.. 
మోడీని కలవను.. అపాయింట్‌మెంట్‌ అడగను ..
నోట్ల రద్దు చేయమని నేనే సలహా ఇచ్చా.. అదొక పనికిమాలిన నిర్ణయం
కావాలంటే వదిలేస్తాం.. కేంద్రం తీసుకున్నా అభ్యంతరం లేదు.. 
కేంద్రం మీద సుప్రీం కెళ్తా... బీజేపీకి వ్యతిరేకమని కాదు

ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. మీకిప్పటికే గుర్తొచ్చి ఉంటుంది. ఇది మన కోతలరాయుడు చంద్రబాబు గారి నోటి నుంచి జాలువారిన సుభాషితాలని. చంద్రబాబును ఇప్పుడంతా రెండు రోజుల పుడింగు అని పిల్చుకుంటున్నారు. ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకుపడిపోవడం. రెండు రోజుల్లోనే చల్లబడిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అవకాశం కోసం సందర్భం వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడటం.. అవసరం తీరాక రామ రామ.. నేనెప్పుడు అన్నాను అని నాలుక మడతేయడం బాబుకు సంకటి ముద్దతో పెట్టిన విద్య. పల్లెల్లో కోతల రాయుడి గురించి చెప్పేటప్పడు ఎగతాళిగా ఒక మాటంటారు. ఆగండ్రా వాడు లేస్తే మనిషి కాదు.. అని. చంద్రబాబు వ్యవహారం అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన లేచేదుండదు.. మనకు ఒరిగేదుండదు. రాజకీయాల్లో ఇన్ని  భిన్నస్వరాలున్న వ్యక్తి చంద్రబాబు తప్ప ఇంకొకరు ఉండరేమో. ఒకవేళ ఉన్నా వారంతా శ్రీమాన్‌ చంద్రబాబు వెనకే. 

రక్తం మరిగిపోతోంది

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో రెండు సార్లు తీర్మాణం చేశారు. రెండేళ్లు గడిచినా విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వనేలేదు. మరోపక్క ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తోంది. మరోపక్క పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువభేరీల పేరుతో రాష్ట్రమంతా తిరిగి విద్యార్థులను చైతన్యం చేస్తున్నాడు. ప్రత్యేక హోదా అవసరం రాష్ట్రానికి ఏముందో తెలియజెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు తన స్టయిల్‌లో అన్న మాటలే ‘నా రక్తం మరిగిపోతోంది..’. సరిగ్గా రెండు రోజులు కూడా గడవనేలేదు. ఒక అర్ధరాత్రి శుభగడియలు చూసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్యాకేజీ సూపర్‌.. అని వంద రోజుల సినిమా చూసిన చిరంజీవి అభిమానిలా మీడియా ముందుకొచ్చి మాట మార్చాడు. కేంద్రం నుంచి పోలవరం కాంట్రాక్టు తెచ్చుకుని ప్రత్యేక హోదాని యుమునలో నిమజ్జనం చేసేశాడు. 

మోడీని కలవను.. అపాయింట్‌ అడగను.

చంద్రబాబు నెలలకు తరబడి ప్రయత్నిస్తున్నా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. కానీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌తో మోడీ గంటకు పైగానే మాట్లాడారు. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. మీడియా వర్గాల్లో ఒకటే చర్చ. చంద్రబాబుకు చి్రరెత్తుకొచ్చింది. పబ్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన చంద్రబాబు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. మోడీయే తనను కలవాలి తప్ప.. తనకై తాను కలిసే ప్రసక్తి లేదని. చివరికి ఏడాదిన్నర తర్వాత చంద్రబాబును కరుణించాడు మోడీ. ఇంతకీ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న చంద్రబాబు ఏవైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా అంటే ఖచ్చితంగా కాదు. రాష్ట్రంలో 2014 పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. మళ్లీ జగనే గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. ఆయన్ను అడ్డుకోవాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని. 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని మోడీని వేడుకుని వచ్చాడు. కేంద్రం, రాష్ట్రంలో మిత్ర పక్షంగా ఉండి కూడా ఏపీకి ఒక్క ప్రయోజనం సాధించలేకపోవడం సరికదా కనీసం హక్కుగా దక్కాల్సిన హామీలను కూడా సాధించలేని దుర్గతిలోకి ఏపీని నడిపించిన ఘనత చంద్రబాబుది. 

నోట్ల రద్దు చేయమని నేనే చెప్పా... నోట్ల రద్దు ఒక పనికిమాలిన నిర్ణయం

నోట్ల రద్దు విషయంలోనూ చంద్రబాబు ద్వంద్వ వైఖరిని జనం అంత సామాన్యంగా మరిచిపోరు. నోట్ల రద్దు జరిగినప్పుడు... మొదటి వారం రోజులు దానిపై సానుకూల వాతావరణం ఉన్నప్పుడు చంద్రబాబు  విషయాన్ని పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. వెయ్యి, 500 నోట్లు రద్దు చేయమని తానే చెప్పానని బాకా ఊదాడు. నెల రోజులైనా పరిస్థితులు సర్దుమణగక పోవడంతో బాబు ఖంగుతిన్నాడు. నోట్ల రద్దు ఒక పనికిమాలిన నిర్ణయమని చెప్పుకొచ్చాడు. 

కావాలంటే వదిలేస్తాం.. కేంద్రం తీసుకున్నా అభ్యంతరం లేదు.

మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ఆ పోలవరం కూడా ప్రశ్నార్థకం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని.. రాసిపెట్టుకోమని అసెంబ్లీ సాక్షిగా సవాల్‌ చేసిన దేవినేని ఉమ, చంద్రబాబులు తాజా పరిణామాలతో నోరెళ్లబెట్టారు. ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న గడువులోగా పూర్తి కావడం గగనమైన పరిస్థితుల్లో చంద్రబాబు తనకు అలవాటైన మాటమార్పిడి సిద్ధాంతానికి జైకొట్టాడు. అసెంబ్లీలో అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టాడు. కానీ.. రెండు రోజులకే చల్లబట్టాడు. పుణెకు ప్రత్యేక విమానం వేసుకెళ్లి మరీ గడ్కరీని కలిసిచొచ్చాడు. 

కేంద్రం మీద సుప్రీంకెళ్తా.. బీజేపీ అవమానించలేదు

నాలుగేళ్లయినా విభజన చట్టంలో ఉన్న హామీలు అమలుచేయడం లేదని చంద్రబాబు మరోసారి కేంద్రం మీద నిప్పులు చెరిగాడు. ఏకంగా కేంద్రం ప్రభుత్వం మీద సుప్రీం కోర్టుకెళతానని బాంబు పేల్చాడు. అయితే ఈసారి మాత్రం జనం పెద్దగా పట్టించుకోలేదు. అందరూ లైట్‌ తీసుకున్నారు. అనుకున్నట్టుగానే జరిగింది. రెండు రోజులే గడిచింది. చంద్రబాబు మాట మార్చాడు. తన మాటలను మరోలా అర్థం చేసుకోవద్దని మెల్లిగా సెలవిచ్చారు.. చంద్రాలు సారు. 
Back to Top