వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ బాబు
‘ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య’ అనే సామెత చంద్రబాబుకు అతికినట్టు సరిపోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. దేశంలోకెల్లా సీనియర్ పొలిటీషియన్ కమ్ ముఖ్యమంత్రిని అని పదే పదే చెప్పుకునే బాబు రన్నింగ్ ఫార్ములా ఇదే. బాబు ఎక్కే ప్రతి మెట్టులోనూ.. వేసే ప్రతి అడుగు కిందా ఎవరిదో ఒకరి భవిష్యత్తు నలిగి సమాధి కావాల్సిందే. బాబు వాడకం ముందు ఎవరైనా దిగదుడుపే. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే నైజం బాబుది అని చిన్నపిల్లాడిని పలకరించినా చెబుతాడు. నాడు పిల్లనిచ్చిన ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు కొడుక్కి పిల్లనిచ్చిన బాలయ్య వరకు కూడా ఆయన వాడకంలో నలిగి వాడిపోయిన మహామహులెందరో. ఆఖరికి ఓడిపోతామనే భయంతో 2004 ఎన్నికలకు ముందు బీజేపీని దూరం పెట్టిన బాబు.. 2014 ఎన్నికల్లో గెలిచి తీరాలంటే బీజేపీతో స్నేహం తప్పదని మోడీ భజన చేశాడు. మోడీని హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేయిస్తా అన్న అదే నోటితో మోడీతోనే దేశం అభివృద్ధి సాధ్యం.. అని నాలుక తిప్పేసిన ఘనుడు. ఏదేమైనా గెలవడమే లక్ష్యం.. అధికారమే పరమావధి.. సీఎం కావడమే ధ్యేయం. దానికోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కుతాడు.. ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడు. గెలవడం కోసం నిరుద్యోగ భృతి ఇస్తానని చెబుతాడు... ఎన్ని అబద్ధపు హామీలైనా ఇస్తాడు... గెలిచాక నేనెప్పుడు అన్నానని నిస్సిగ్గుగా మాట్లాడతాడు.
అడ్డు తొలగించుకోవడం బాబుకే తెలుసు తనకు అధికారం దక్కాలంటే ఉన్న అడ్డంకులను ఎలా తొలగించుకోవాలో బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని రాజకీయ పండితులు చెబుతుంటారు. అందుకోసం ఎంతకైనా దిగజారుడం బాబు నైజమని ఆయన్ను దగ్గర్నుంచి చూసినవారు చెబుతారు. ఏ రోటి కాడ ఆ పాట పాడటం బాబుకే తెలుసు. బాబు చేతికి అధికారం వచ్చాక ఎంతోమంది ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్నవారు టీడీపీ నుంచి బయటికొచ్చేశారు. బాబు ఒక్కొక్కర్నీ అడ్డు తొలగించుకున్నాడు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు అరాచక పాలన సాగించాడు.
నందమూరి కుటుంబాన్ని బాగా వాడేశాడుచంద్రబాబు అధికారం చేపట్టడానికి నందమూరి కుటుంబాన్ని వాడుకున్నంతగా మరెవర్నీ వాడుకుని ఉండడు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా చంద్రబాబుకు సహకరించినవాళ్లే. అప్పట్లో లక్ష్మీపార్వతిని చూపించి ఎన్టీఆర్ కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు.. మామను దింపడంలో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావును కూడా తర్వాతి కాలంలో టీడీపీలోనే లేకుండా చేసేశాడు. 2009 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రచారం కోసం వాడుకున్న బాబు తర్వాతి కాలంలో ఆయనతో పొసగలేదని మెల్లిగా పార్టీ నుంచి దూరం జరిగేలా చేశాడు. జూనియర్ ప్రచారం చేసిన స్థానాల్లోనే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని తన భజన బృందాల చేత మోత మోగించాడు. ఇంకేముంది జాకీ పత్రికలు బాబు పాట పాడితే.. తాళం వేసినయ్. ఎవర్నయినా బయటకు పంపాలంటే బాబుకు ఒక దారుంటుంది. ముందుగా ఎవర్నయితే బయటకు పంపాలనుకుంటాడో వారి మీద లేదా వారి అనుచరుల మీద అవినీతి ప్రచారం మొదలవుతుంది. టీడీపీ ఇంటి పత్రికలు పుంఖాను పుంఖాలుగా సదరు మనిషి మీద విరుచుకు పడిపోతాయ్. చివరికి వాటినే ఆధారాలుగా చూపెట్టి వారిని పదవుల నుంచి తీసేయడమో.. భయపెట్టడమో చేయడం బాబుకు అలవాటు.
నాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబు.. ఇప్పుడు తన కొడుక్కి పిల్లనిచ్చిన బాలయ్యను కూడా పక్కనబెట్టేందుకు పథక రచన చేసేస్తున్నాడు. అప్పుడు ఎలాగైతే ఈనాడును అడ్డం పెట్టుకుని అధికారం చేజిక్కించుకున్నాడో ఇప్పుడూ అదే విధంగా బాలయ్యను కూడా పీఏ శేఖర్ అవినీతిని బూచిగా చూపించి అవినీతిపరుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రజ్యోతిలో వార్తలు రాయించి, మాజీ ఎమ్మెల్యేల చేత.. ఆఖరుకి జడ్పీటీసీలు కూడా బాలయ్యను బెదిరించేలా వెనకుండి కథ నడిపించాడు. వారి చేత రాజీనామా డ్రామా ఆడించి బాలయ్య మీద పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచాడు. బాలయ్య రాజకీయాల్లోకి రావడమే ఇష్టం లేని చంద్రబాబు ప్రత్యేక పరిస్థితుల్లో స్వాగతించక తప్పలేదు. అయితే హిందూపురం నుంచి గెలవకుండా చేద్దామని బాలయ్యను శ్రీకాకుళం ఎన్నికల ప్రచారానికి కూడా పంపాడు. కానీ అప్పుడు ఎలాగూ ఆయన గెలుపును అడ్డుకోలేకపోయాడు. రాబోయే ఎన్నికల నాటికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేయాలని బాలయ్య కలలు కంటున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకే.. బాలయ్య ప్రతిష్టను పలుచన చేసేందుకే ఇలాంటి డ్రామా ఆడుతున్నాడని అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. లేదంటే చంద్రబాబు ముందు ఎమ్మెల్యేలే మాట్లాడటానికి భయపడే పరిస్థితులు ఉంటే మామూలు జడ్పీటీసీ స్థాయి వ్యక్తులు ఏకంగా అధిష్టానానికి అల్టిమేటం ఇవ్వడం విడ్డూరం కాకపోతే మరేంటి. గతంలో నందమూరి హరికృష్ణను కూడా ఎలా పక్కన పెట్టేశాడో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు.