ఏపీలో యూపీ

ఏపీలో పరిస్థితులు యూపీని తలపిస్తున్నాయి. రౌడీయిజానికి, దౌర్జన్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఏ రాష్ట్రం అనడిగితే టక్కున చెప్పే పేరు బీహార్, ఉత్తరప్రదేశ్‌ అని. బీహార్‌లో పరిస్థితులు చాలా మారాయి. కానీ యూపీలో అలాగే ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా దాదాపు అలాంటి స్థితి కనిపిస్తుంది. బాబు రాజ్యంలో పచ్చ దొరలు చెలరేగిపోతూ మహిళల మీద పశుత్వం చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు పెద్దన్నలా ఉండి ఆదుకుంటానని నమ్మబలికిన ముఖ్యమంత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలను దేశం మీదకు వదిలి అరాచకాలు సృష్టిస్తున్నాడు. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీ మొదలుకుని ముఖ్యమంత్రి వరకు ఆడవారిపై జరుగుతున్న దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 

మహిళా గర్జనలో మాయమాటలు...
మార్చి, 2014... మాడు అదిరిపోయే ఎండలు ఒకవైపు. గుక్కతిప్పుకోని చంద్రబాబు ఎన్నికల ప్రచార ఆర్భాటం మరోవైపు. 
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంగ్రామంలో అట్టుడికిపోతోంది. అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని కంకణ బద్ధుడయ్యాడు. ఎక్కడ చూసినా ఫ్రీ ఫ్రీ.. నన్ను గెలిపిస్తే చాలు.. ఫుడ్డు ఫ్రీ..బెడ్డు ఫ్రీ.. ఆఖరికి నిద్ర కూడా ఫ్రీ.. ఇది స్థూలంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రచారం. అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను.. అన్నట్టు.. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పరిపాలన చూస్తుంటే అక్షరాలా నిజం అనిపించకమానదు. ముఖ్యంగా మహిళల మీద గత మూడేళ్లుగా జరుగుతున్న దాడులు చూస్తుంటే చంద్రబాబు చెప్పిన ఎన్నికల హామీకి చేస్తున్న పాలనకు పూర్తి విరుద్ధంగా ఉంది. 

మూడేళ్లలో ఎన్నో దాడులు
ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక ఘనటల్లో మహిళలు సమిధలయ్యారు. కొంతమంది మరణిచంగా మరికొంత మంది సభ్య సమాజం చూస్తుండగానే పచ్చ కామందుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. ఆత్మగౌరవ నినాదంతో ముందుకు పోతాం అనిచెప్పుకునే టీడీపీ పాలనలో మహిళలపై నిప్పులు కురిపించేస్తున్నారు. ఈ మూడేళ్ల కాలన్ని ఒక సారి పరిశీలిస్తే ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నా పెద్దా తేడా లేదు. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఇందులో స్వపార్టీ పక్క పార్టీ అనే తారతమ్యం అనేది అసలే లేదు. తహసీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి మొదలుకుని నిన్న చిత్తూరులో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కుమార్తె మాధవీలత వరకు వారి ఆగడాలకు హద్దు లేదు. ఆడదైతే చాలు దాడి చేయడానికి అన్నట్టు అధికార అహంకారంతో ఎవర్నీ వదలడం లేదు. 

వనజాక్షి నుంచి మాధవీలత వరకు...
ఇసుక అక్రమ దందాను అడ్డుకున్న తహసీల్దార్‌పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల ర్యాగింగ్‌ భూతానికి విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య.. అనకాపల్లిలో గుడికి వెళ్లి వస్తుండగా లావణ్య అనే వివాహిత తన భర్త, మరదలు దివ్యతో కలిసి వస్తుండగా స్థానిక టీడీపీ నాయకుడొకడు కారుతో గుద్దించి చంపేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును మాఫీ చేయడానికి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతర కాలంలో గుంటూరు జీజీహెచ్‌లో చదువుకుంటున్న మెడికో సంధ్యారాణి ఫ్రొఫెసర్‌ లక్ష్మి వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ కల్పించుకుంటే కానీ మరుసటి రోజు పోలీసులు ఆమెను అరెస్టు చేయలేదంటే ప్రభుత్వం నిందితులకు ఎంత అండగా నిలిచిందన్నది తెలుస్తుంది. ఈ సంఘటన మరువక ముందే కర్నూలులో ఇంజినీరింగ్‌ చదువుతున్న ఉషారాణి అనే విద్యార్థిని లెక్చరర్‌ వేధింపులకు తాళలేక తనువు చాలించింది. వేధింపులపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. వారు స్పందించి ఉంటే ఈమె ప్రాణం మిగిలి ఉండేది. చనిపోయిన ఉషారాణి సాక్షాత్తు టీడీపీ జడ్పీటీసీ చెల్లెలు కావడం గమనించాల్సిన విషయం. తూర్పు గోదావరి జిల్లా తుందు్రరులో ఏర్పాటు చేస్తున్న గోదావరి మెగా ఆక్వాపుడ్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన సత్యవతి అనే వివాహితను పోలీసులు వేధించారు. మహిళ అని కూడా చూడకుండా హత్యాయత్నం కేసులు బనాయించి జైళ్లో పెట్టారు. హైదరాబాద్‌లో టీడీపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు ఓ ముస్లిం మహిళను కారులోకి లాగబోయి తన్నులు తింటే.. గుంటూరులోనే టీడీపీకే చెందిన జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ తనను వేధిస్తున్నాడంటూ మంత్రి రావెల కిషోర్‌బాబు నుంచి రక్షణ కల్పించాలని రెండు సార్లు మీడియా సమావేశం నిర్వహించింది. మాచర్ల జడ్పీ చైర్మన్‌ పదవి నుంచి దిగిపోవాలని స్థానిక టీడీపీ నాయకులు వేధించడంతో శ్రీదేవి అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పలుమార్లు భర్తతో కలిసి లోకేష్‌కు ఫిర్యాదు కూడా చేసింది. అయినా ఆయన కూడా నిందితులకే వత్తాసు పలకడంతో మనస్థాపంతో శ్రీదేవి భర్త గుండెపోటుతో మరణించాడు. మరికొద్ది రోజులకే శ్రీదేవి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతర కాలంలో ఇదే సంఘటన బాపట్లలోనూ జరిగింది. ఈ ఘటనలో విజేతమ్మను స్థానిక టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేశారు. ఆమె కూడా మీడియా ముందుకొచ్చి తన ఆవేదన వెలిబుచ్చింది. ఇదంతా జనం మర్చిపోతున్న తరుణంలో అనంతపురంలోని కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరులు నల్లా కనెక్షన్‌ విషయంలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా చితకబాదారు. తాజాగా అదే అనంతపురం జిల్లాలో పయ్యావుల అనుచరులు సమస్యపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళను దారుణంగా కాళ్లతో తన్ని పశుత్వం ప్రదర్శించారు. ఇది జరిగి కనీసం రెండు రోజులైనా గడవకముందే చిత్తూరు జిల్లాలో మాధవీలత అనే డాక్టర్‌ను పార్కింగ్‌ విషయమై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరులు బెదిరించారు. అయితే ఈమె టీడీపీకే చెందిన స్థానిక చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ కూతురు కావడం మరో ముఖ్య విషయం. దాదాపు నాలుగు గంటలపాటు ఆమె రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసినా పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం జరగలేదు. 

మహిళా గర్జనలో చంద్రబాబు ఏమన్నాడు
అది మార్చి 27, 2014. విజయవాడలో జరిగిన మహిళా గర్జన సభ. చంద్రబాబు ఎన్నికల ప్రచార  సభ. గెలవాలంటే మహిళల ఓట్లు ఎంత ముఖ్యమో చంద్రబాబుకు తెలియంది కాదు. ఇంకేముంది ఆడంబరంగా హామీలు గుప్పించేశాడు. 

ఆయన ఏం చెప్పాడంటే..
ఈ ఏడాదిని మహిళ నామ సంవత్సరంగా మారుస్తా. కుటుంబాలను బలి తీసుకుంటున్న బెల్ట్‌ షాపులను రద్దు చేస్తా. ప్రతి మహిళకు సెల్‌ఫోన్‌ ఇప్పిస్తా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. మహిళల రక్షణకు టోల్‌ ప్రీ నంబర్‌. ఫోన్‌ చేసిన ఐదు నిమిషాల్లో పోలీసులు అందుబాటులో ఉండేలా రక్షణ. స్వయంగా సీఎం ఫోన్‌కే కాల్‌ చేసి ఫిర్యాదు చేసే సౌకర్యం. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుట్టగానే ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 25వేలు జమ చేస్తా. మహిళలకు వడ్డీ లేని రుణాలు. నిజానికి ఈ మూడేళ్ల కాలంలో ఒక్క హామీ అమలు జరగకపోగా ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు మారిపోవడం శోఛనీయం. 


Back to Top