అగ్రిగోల్డు బాధితులకు బాసటగా వైయ‌స్ఆర్‌సీపీ


అగ్రిగోల్డు బాధితులు. వీరేమీ ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారు కాదు. అనుకోని ప్రమాదంలో నష్టపోయిన వారు కారు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును నమ్మి ఓ సంస్థ చేతిలో పెట్టి అన్యాయం అయిన వారు. ఒకరో ఇద్దరో వందో రెండొందల మందో కాదు 19 లక్షల మంది. 30లక్షల మందికి పైగా ఇందులో ఖాతాదారులున్నారు. ఈ సంస్థ ఏజెంట్లు గా పనిచేసిన వారు సైతం డిపాజిటర్ల ఒత్తిడి తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. తమకు న్యాయం చేయమంటూ ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎదురు చూపులతో తీవ్ర మానసిక క్షోభకు గురౌతున్నారు. ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వారి సమస్యలు తీరడం లేదు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కార్ అగ్రిగోల్డు ఆస్తులను వేగంగా అమ్మి బాధితులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యింది. 
బాధితుల తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పోరాటం
ఎన్నో ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేసారు. నిరాహారదీక్షలు చేసారు. అయితే ప్రభుత్వం వీరి గోడును పట్టించుకోలేదు. బాధితుల తరుఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆందోళనలు చేసేందుకు ముందుకు వచ్చింది. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలను జరుపుతున్నది. ప్రతి జిల్లాలోని మండల కేంద్రాల్లో బాధితులతో సమావేశాలు జరుపుతోంది. భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చర్చించి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సమాయత్తం అవుతోంది. ప్రభుత్వం దిగివచ్చి అగ్రిగోల్డు బాధితులకు కచ్చితమైన హామీ ఇచ్చేలా సాయం అందించనుంది. 
అగ్రిగోల్డ్ కథ
అగ్రిగోల్డు యాజమాన్యం పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు సేకరించి, ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మించి చివరకు బోర్డు తిప్పేసింది. వేల రూపాయిల నుంచి లక్షల రూపాయిలవరకూ పెట్టుబడి పెట్టిన కస్టమర్లంతా  ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కొందరు బాధితులు ఆ బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు మనోవ్యధతో మరణించారు. రాష్ట్ర కేబినేట్ లోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. అగ్రిగోల్డు కంపెనీ డైరెక్టర్లను అరెస్టు చేసినా కొద్ది రోజుల్లోనే బెయిలుపై బయటపడ్డ వారు కులాసాగా ఉన్నారు. కానీ సొమ్ములు నష్టపోయిన బాధితులకు ఇంత వరకూ రికవరీ జరగనే లేదు.  అగ్రిగోల్డు ఆస్తులను జప్తు చేసి, వేలం వేసి ఆ సొమ్మును బాధితులకు తిరిగి చెల్లిస్తామని  చెప్పిన ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప కార్యాచరణ మాత్రం చేయలేదు. వేల కోట్లు విలువ చేసే అగ్రిగోల్డు ఆస్తులను ప్రభుత్వంలోని కొందరు పెద్దలే చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఏళ్ల తరబడి ఈ వ్యవహారాన్ని నాన్చి చివరకు ఆస్తి విలువ వందల కోట్లలోనే ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు. కేంద్రం 75శాతం ఇస్తే రాష్ట్రం 25 శాతం ఖర్చు చేసి అగ్రిగోల్డు బాధితులను ఆదుకుంటుందని మంత్రి మండలి పెట్టిన ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. 
వాస్తవాలు
నిజానికి అగ్రిగోల్డు ఆస్తుల విలువ 20,000 కోట్లకు పైనే ఉంటుందని ఓ అంచనా. ఇందులో డిపాజిట్ దారులకు చెల్లించాల్సిన మొత్తం 6,800 కోట్లు మాత్రమే. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం ఎటాచ్ చేసుకుని మూడేళ్లు గడించిపోయాయి. కానీ ఇంత వరకూ ఆ ఆస్తులను వేలం వేసి బాధితుల సొమ్ము తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రభుత్వంలోనే పెద్దలే అగ్రిగోల్డు ఆస్తులపై కన్నేయడంతో కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆ ఆస్తులను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎస్సెల్ గ్రూప్ లాంటి పెద్ద సంస్థలే వేలం పాటకు వచ్చి ప్రభుత్వం సహకారం అందించడం లేదంటూ వెనక్కి తగ్గాయి. అగ్రిగోల్డు యాజమాన్యంతో లాలూచి పడి ప్రభుత్వం, కొందరు టిడిపి నేతలే ఆస్తుల వేలం జరగనీయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వేల కోట్ల ఆస్తుల విలువను తగ్గించి చెబుతున్నారని ఆగ్రహిస్తున్నారు. స్థిరాస్థుల విలువ ఏటికేడాది పెరుగుతుంటే కేవలం అగ్రిగోల్డు ఆస్తుల విలువ మాత్రం తగ‌్గడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నిస్తున్నారు. 
అగ్రిగోల్డు వ్యవహారంలో బాధితులకు న్యాయం జరిగేవరకూ చివరిదాకా పోరాడతామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలోనూ, ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ అగ్రిగోల్డు బాధితుల సంఘాలు ప్రతిపక్ష నేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. దానిపై స్పందించిన యువనేత వారి పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తం చేసేందుకు మద్దతిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే బాధితుల తరఫున వైయస్సార్ పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని కదిలించి, బాధితులకు సరైన న్యాయం దక్కేలా పోరాడుతున్నాయి.  

తాజా వీడియోలు

Back to Top