అదనపు కరెంటు.. ఓ పెద్ద మాయ !

సర్కారు మహా నాటకం

గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారాది గారడీ విద్యలన్నిటీనీ మించిపోయాయి అదనపు విద్యుత్‌ సరఫరా విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రకటనలు. మన విద్యుత్‌నే మనకు అందిస్తూ.. ఎంతో శ్రమపడిపోయినట్లుగా, ఏదో ఘనకార్యం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నాయి.

హైదరాబాద్, 28 ఆగస్టు 2012: విద్యుత్ సరఫరాలో తీవ్రంగా విఫలమైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.. అసత్య ప్రకటనలతో సరికొత్త నాటకమాడుతున్నాయి. అబద్ధపు ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) నుంచి అదనంగా ఆంధ్రప్రదేశ్‌కు 335 మెగావాట్ల విద్యుత్ వస్తోందని అటు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా లీకులిస్తున్నాయి. మన విద్యుత్ మనకే వస్తే... దానినే అదనపు కరెంటుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే అసలది మన విద్యుత్తేనని నిపుణులు చెప్తుండటంతో సర్కారు ఆడుతున్న నాటకం అపహాస్యం పాలవుతోంది.

'అదనపు' అసలు కథ...

విశాఖపట్నం వద్ద గల ఎన్‌టీపీసీ కేంద్రంలో మూడు విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 500 మెగావాట్లు. మొత్తం వెయ్యి మెగావాట్ల విద్యుత్ పూర్తిగా రాష్ట్రానికే వస్తుంది. అయితే మూడో యూనిట్ నుంచి మాత్రం 135 మెగావాట్లే రాష్ట్రానికి అందుతుంది. ఈ యూనిట్లకు అవసరమయ్యే బొగ్గు ఒడిశాలోని తాల్చేరు గని నుంచి సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఈ గని నుంచి తగినంత బొగ్గు సరఫరా కావడం లేదు. వస్తున్న బొగ్గు కూడా వర్షాల కారణంగా తడిసి వస్తోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌లో కేవలం 350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అంటే వెయ్యి మెగావాట్లకుగానూ కేవలం 700 మెగావాట్లు, మూడో యూనిట్ నుంచి 100 మెగావాట్లు మాత్రమే వస్తోంది.

అంటే, 335 మెగావాట్ల విద్యుత్ సరఫరా తగ్గిపోయిందన్నమాట. అవసరమైన మేరకు బొగ్గును సరఫరా చేస్తే, పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని ఎన్‌టీపీసీ చెబుతోంది. దీంతో సింగరేణి నుంచి బొగ్గును సరఫరా చేయడం ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సింగరేణి కూడా అంగీకరించింది. ఫలితంగా బొగ్గు సరఫరా జరిగి.. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే మనకు వచ్చే విద్యుత్ మొత్తం రావాల్సి ఉంటుంది.

అయితే, దీనినే అదనపు విద్యుత్‌గా అటు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలసికట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిని చూసి విద్యుత్‌రంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రకటననలన్నీ అసత్యాలే...

ఈ విధంగా ఉత్తుత్తి ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వానికి కొత్త కాదు. గతంలోనూ గెయిల్ నుంచి రోజుకు రెండు మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జీ) వస్తోందని సీఎం కార్యాలయం ప్రకటించింది. తద్వారా 500 మెగావాట్ల అదనపు విద్యుత్ రానుందని గత నెలలో పేర్కొంది. అయితే ఆర్-ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేసేందుకు అయ్యే అదనపు వ్యయాన్ని పరిశ్రమలు చెల్లిస్తేనే కొనుగోలు చేస్తామంటూ.. సీఎం కిరణ్ చావు కబురు చల్లగా ప్రకటించారు. ఇంకేముంది, విద్యుత్ కష్టాలు తీరనున్నాయని ఆశించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. ఇప్పుడు చెబుతున్న అదనపు విద్యుత్ కథ కూడా అంతే. మనమే బొగ్గు ఇస్తే.. దానినుంచి ఉత్పత్తి చేసిన మన వాటా విద్యుత్ మనకే ఇస్తే.. అది కూడా అదనపు విద్యుత్‌గా ప్రచారం చేసుకునేందుకు ప్రభుత్వం సమకట్ట డం బాధాకరం .

 

Back to Top