అభిమానానికి లేదు హద్దు

కర్నూలు:

తనతో పాటు పాదయాత్ర చేస్తున్న వారి అభిప్రాయాలను వైయస్ షర్మిల తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని నాగులాపురం వద్ద చెట్టుకింద రాళ్లపై కూర్చొని తనతో ఎందుకు రావాలనిపించిందో వారిని అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు అనేక మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రమీల అనే మహిళ వైయస్ సీఎం అయిన తర్వాత సొంతిల్లు కట్టుకున్నారు. రూ.60 వేల రుణం మాఫీ అయింది. ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు తన కొడుకుతో కలిసి పాదయాత్ర చేస్తోంది. ప్రకాశం జిల్లా గురువారెడ్డి పాలెంకు చెందిన 55 ఏళ్ల రమణమ్మ రాజన్నపై అభిమానంతో మరో ఏడుగురు తన ఊరి వాళ్లను తీసుకొచ్చి మరీ పాదయాత్రలో ఇడుపుల పాయ నుంచి నడిచి వస్తున్నారు.
     ఇక ప్రకాశం జిల్లాకు చెందిన చెన్ను విజయ అనే గృహిణి తన కుమారుడిని రెసిడె న్షియల్ స్కూల్‌లో చేర్పించి షర్మిలతో పాదయాత్ర చేస్తుంటే.. వైజాగ్‌కు చెందిన పేరిచర్ల ఝాన్సీ జగన్ కుటుంబంపై అభిమానంతో ప్రతి జిల్లాలో రెండ్రోజులు షర్మిల వెంట నడుస్తున్నారు. జగన్ మీద అభిమానం పెంచుకున్నందుకు మహిళా బృందం నుంచి తన తల్లిపేరు తీసివేయడంతో అక్కతో కలిసి నడవాలని వచ్చినట్లు రాఘవేంద్ర అనే యువకుడు చెప్పాడు. గుంటూరుకు చెందిన చింతా సుబ్బారెడ్డి, కోడూరు వాసి కృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాసి జ్యోతుల నవీన్ ఆయన స్నేహితులు, కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి, కడప నుంచి రాజగోపాల రెడ్డి, మాచవరానికి చెందిన గజ్జెల వెంకట కృష్ణారెడ్డి, అనంతపురానికి చెందిన వన్నూరమ్మ, కడప నుంచి షఫీ, ధర్మవరం నుంచి నారాయణ, కోడుమూరు నుంచి శ్రీనివాస యాదవ్, కడప నుంచి సరస్వతి... ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా వైఎస్ కుటుంబానికి అభిమానులుగా మారారు. అదే అభిమానంతో జగన్‌ను సీఎంగా చూడాలన్న లక్ష్యంతో అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసుకుంటూ కర్నూలుకు వచ్చారు. షర్మిలతో కలిసి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామని, జగన్‌ను సీఎంగా చూస్తామని వారు ధీమాగా చెబుతున్నారు.

Back to Top