హైదరాబాద్)) దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, జన నేత వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల నిర్వహించిన మరో ప్రజా ప్రస్థానం యాత్రకు నేటితో మూడేళ్లు. జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె గర్జిస్తూ ఈ యాత్రను చేపట్టారు. తెలుగు నాట ప్రజలందరినీ పలకరిస్తూ, తండ్రి వైయస్సార్ నిర్వహించిన ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో ఆమె ఈ యాత్ర నిర్వహించారు. రాజన్న కుమార్తె తమ గ్రామానికి వస్తోందని తెలుసుకొని ఊరూరా జనం రోడ్ల మీదకు వచ్చి నీరాజనాలు పలికారు. 2012వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన ఆమె ఇడుపుల పాయలో ఈ యాత్రను ప్రారంభించారు. ఎండ, వాన లెక్క చేయకుండా ప్రజల్ని అడుగడుగునా పలకరిస్తూ ముందుకు సాగారు. 14 జిల్లాల్లోని 116 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. 230 రోజుల్లో ఆమె 2,250 గ్రామాల్ని కలుపుకొంటూ యాత్ర సాగించారు. దాదాపుగా కోటి మందికి పైగా ప్రజల్ని వైయస్ షర్మిల కలిసి కష్ట సుఖాలు తెలుసుకొంటూ ముందుకు సాగారు.తెలుగు నాట అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన యాత్ర. రాజన్న బిడ్డ, జగనన్న సోదరి ని చూసేందుకు ఊరూరా జనం తండోపతండాలుగా తరలి వచ్చేవారు. అభిమానులు, కార్యకర్తల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె యాత్ర సాగించారు. చివరగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకొని ఆమె యాత్రను విరమించారు. 2013 వ సంవత్సరం లో ఆగస్టు 4వ తేదీన యాత్రను ముగించారు. ప్రజలతో నిరంతరాయంగా మమేకం అవుతూ సాగించిన యాత్రే మరో ప్రజా ప్రస్థానం.