శుక్ర, శనివారాల్లో పార్టీ సమావేశాలు: వాసిరెడ్డి

హైదరాబాద్, 19 సెప్టెంబర్ 2013:

రాష్ట్రాన్ని విభజించటం లేదని కేంద్ర బేషరతుగా ప్రకటించాలన్న డిమాండ్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చే‌సేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనే అంశంపై సమాలోచనలు చేసేందుకు శుక్రవారం సాయంత్రం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ సమావేశం పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన జరుగుతుందన్నారు. కింది స్థాయిలోని పార్టీ కార్యకర్తలను కూడా సమైక్య ఉద్యమంలో మరింతగా భాగస్వాములను చేసేందుకు, గ్రామస్థాయి వరకూ ఉద్యమాన్ని తీసుకువెళ్ళేందుకు కార్యాచరణను రూపొందించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ తెలిపారు పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

అలాగే.. శనివారం 21వ తేదీన పార్టీ సీజిసి సభ్యులతో పాటు పార్టీ కేంద్ర కార్యనిర్వాహకవర్గం (సీఈసీ), ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ కన్వీనర్లు, పార్టీ పరిశీలకులు, అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులతో పాటు ముఖ్య నేతలందరితో కలిపి రాష్ట్ర స్థాయి సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు పద్మ వివరించారు. రాష్ట్ర విభజన ప్రకటనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఒక భరోసా కల్పించడానికి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి ఈ రెండు రోజుల సమావేశాల్లో చర్చించనున్నట్లు ఆమె చెప్పారు. భవిష్యత్‌లో పార్టీ నిర్వహించబోయే కార్యక్రమాలను ఈ చర్చల అనంతరం ప్రకటిస్తామని తెలిపారు.

ముందుగా శుక్రవారం ఉదయం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో ధర్నా చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, రాష్ట్రాన్ని విభజించుకోండి అనే ఒకే ఒక్క లైన్‌తో చంద్రబాబు ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని, చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేయాలనే రెండు డిమాండ్లతో పార్టీ ఎమ్మెల్యేలు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారని వివరించారు.

తాజా వీడియోలు

Back to Top