అవనిగడ్డలో పోటీకి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ దూరం

విజయవాడ, 3 ఆగస్టు 2013 :

కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయడంలేదని పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, సామినేని ఉదయభాను, వంగవీటి రాధా స్పష్టంచేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉంటూ.. మరణించిన అంబటి బ్రాహ్మణయ్య కుటుంబానికి తోడుగా నిలబడట కోసం, మానవత్వం ఉన్న పార్టీగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ దివంగత ఎమ్మెల్యే కుటుంబానికి గౌరవం ఇచ్చి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు వారు ముగ్గురూ శనివారంనాడు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో 40 అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో టిడిపి ఒక్క చోట కూడా గెలవని స్థితిని తమ ప్రకటనలో నాని, ఉదయభాను, రాధా గుర్తుచేశారు. అంతేకాక రెండు పార్లమెంటరీ, 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా టిడిపి దక్కించుకోలేకపోయిన వైనాన్ని ప్రస్తావించారు. దానితో పాటు టిడిపికి రాజీనామా చేసిన 6 సిటింగ్‌ స్థానాల్లో కూడా ఓడిపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు ఏ విధంగా అసహ్యించుకుంటున్నారో ఈ ఫలితాలే నిదర్శనం అని అభివర్ణించారు.

2009 మే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొర్ల రేవతీపతి మూడు నెలలకే గుండెపోటుతో మరణించారు. రేవతీపతి సతీమణి భారతిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెడితే.. రేవతీపతి గెలిచిన మూడు నెలలకే మరణించారన్న కనికరం కూడా చూపించకుండా చంద్రబాబు నాయుడు తన పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలో నిలబెట్టిన వైనాన్ని వారు గుర్తచేశారు. ఇలాంటి చంద్రబాబుగారి మీద ఏ మాత్రం గౌరవం లేకపోయినా... ఆయన కుమ్మక్కు రాజకీయాలను, ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా మరణించిన అంబటి బ్రాహ్మణయ్య కుటుంబానికి తోడుగా నిలిచేందుకే తమ పార్టీ తరఫున పోటీ పెట్టడంలేదని తమ ప్రకటనలో నాని, ఉదయభాను, రాధా వివరించారు.

Back to Top