సిబిఐ పక్షపాత ధోరణి దుర్మార్గం

హైదరాబాద్‌ : శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుల విషయంలో సిబిఐ సుప్రీంకోర్టు ధర్మాసనాన్నే తప్పుదోవ పట్టిస్తోందని, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకే వక్రభాష్యం చెబుతోందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌కు బెయిల్ రాకుండా జాప్యం చేసేందుకే సిబిఐ ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సిబిఐ తీరుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మైసూరారెడ్డి సమాధానం ఇస్తూ... ‘గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టులో బెయిల్‌పై వాదనలు జరిగినపుడు ఏడు అంశాలపై దర్యాప్తు చేయడానికి ఎంత సమయం పడుతుందో సిబిఐ లిఖితపూర్వకంగా తెలిపింది. ఒక్కో అంశంపై రెండు, మూడు మాసాలు సమయం పడుతుందని వారు సమర్పించిన అఫిడవిట్లలో స్పష్టంగా పేర్కొన్నారు. అవేమీ రహస్య డాక్యుమెంట్లు కాదు కూడా.. శ్రీ జగన్ కేసుల దర్యాప్తులో ‌సిబిఐ ఏమాత్రం సమయం వృథా చేయడం లేదని, దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఫైనల్ చార్జిషీటు వేస్తుందని అత్యున్నత న్యాయస్థానం ముందు ‌సిబిఐ తరఫున వాదించిన పరాశరన్ చెప్పారు. పరాశర‌న్ చెప్పిన విషయాలను, ‌సిబిఐ అఫిడవిట్‌లో లిఖితపూర్వకంగా పేర్కొన్న వాటినే సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. మార్చి 31లోగా పూర్తి చేయాలనేది దీనర్థం.. కానీ సిబిఐ ఈ పదజాలాన్ని తప్పుదోవ పట్టించి చార్జిషీటు వేయడం లేదు. ఇదంతా శ్రీ జగన్‌కు బెయిల్ రాకుండా జాప్యం చేయడానికే...’ అని అన్నారు.

‘ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా బెయి‌ల్ ప్రక్రియను అడ్డుకోకూడదు.. కేవలం రాజకీయ పక్షపాతంతో, ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై ‌సిబిఐ అక్రమాలకు పాల్పడడం దుర్మార్గం... తన తీరుకు సిబిఐ భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందన్నారు. మాది దర్యాప్తు సంస్థ కనుక తమను ఎవరూ ప్రశ్నించకూడదనే అహంకారంతో వ్యవహరిస్తే జవాబు చెప్పక తప్పదు...’ అని మైసూరా అన్నారు.
సుప్రీంకోర్టును సిబిఐ తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని న్యాయస్థానం ముందు ఉంచుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా మైసూరారెడ్డి చెప్పారు.

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ నిందితురాలిగా చేర్చిన విషయంపై స్పందిస్తూ.. ‘ఇది ప్రభుత్వం తప్పుడు పనుల వల్ల జరుగుతోంది. సిబిఐ చేస్తున్నది తప్పు అనీ, జిఓలన్నీ ప్రభుత్వ విధానంలో భాగంగా జారీ అయినవేనని, విధానంలో భాగంగా తీసుకున్న చర్యల వల్లే జిఓలు వచ్చాయని ఎపుడో సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఉండాల్సింది. కానీ కేవలం‌ శ్రీ జగన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయనను ఇబ్బందుల పాలు చేసేందుకు దొంగాటలు ఆడింది. ఇప్పుడు అది వారి మెడకే చుట్టుకుంది. మంత్రులకూ చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం ఉంది. జిఓల జారీ ప్రభుత్వ విధానాల ప్రకారమే జరిగిందని ఆనాడు చెప్పకపోవడం దుర్మార్గం. దుర్మార్గపు ఆలోచనల వల్లే వారే ఇరుక్కుపోయారు.’ అని మైసూరా అన్నారు. సబిత రాజీనామా, నైతికత గురించి ఆమె, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు.
Back to Top