హాస్టళ్లపై శ్వేతపత్రం ప్రకటించాలి : వైయస్ఆర్ సీపీ

హైదరాబాద్

3 నవంబర్ 2012 : సాంఘిక సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై శ్వేతపత్రం ప్రకటించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు డిమాండ్ చేశారు. 2012-13 విద్యా సంవత్సరంలో సుమారు వంద (కళాశాల) హాస్టళ్లు మూసివేతకు గురయ్యే స్థితిలో ఉన్నాయని ఆయన విమర్శించారు. ఉపకార వేతనాలు అందక  ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకోవలసి వస్తోందని, ఇది ప్రభుత్వ దౌర్భాగ్యస్థితిని సూచిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్ల విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. బలహీనవర్గాల అండతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వైయస్ దూరమయ్యాక ఇప్పుడు ఆ వర్గాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
గ్యాస్ సిలిండర్ల ధర పెంపు, అరకొర ఉపకారవేతనాల వంటి సమస్యలతో హాస్టళ్లు సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు. వైయస్ ఉన్నప్పుడు విద్య , వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు సుమారు పది లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బలహీనవర్గాల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. బలహీనవర్గాల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటిని వారి నుంచి దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 300 బాలికలు, 300 బాలుర హాస్టళ్లను వైయస్ మంజూరు చేశారనీ, ముప్పై హాస్టళ్లను ప్రారంభించకపోగా, ప్రారంభమైన వాటిలో కూడా 18 బాలికల హాస్టళ్లు, 56 బాలుర హాస్టళ్లు మూసివేసే దశలో ఉన్నాయని రామచంద్ర రావు వివరించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థికి రూ. 520 ఉపకారవేతనంగా ఇస్తున్నారనీ, దీనిని రూ. 960 కి పెంచాలంటూ వైయస్ నోట్‌పై రాసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదనీ ఆయన విమర్శించారు. దీనిని కనీసం రూ. 1500 చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైయస్.విజయమ్మ, వైయస్.భారతి రహస్యంగా ఢిల్లీకి వెళ్లివచ్చారన్నప్రచారాన్ని గాలివార్తగా రామచంద్ర రావు కొట్టిపారేశారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవడం కోసం ఒక చానెల్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ప్రసారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Back to Top