'సహనం కోల్పోయిన చంద్రబాబు'

హైదరాబాద్‌, 19 ఫిబ్రవరి 2013: రెండుసార్లు అధికారానికి దూరమై, ఇకపైన కూడా అది అందే అవకాశం లేదని సహనం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్‌లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని సోమయజులు ఎద్దేవా చేశారు. తనకు అధికారం అప్పగిస్తే రుణాలు మాఫీ చేస్తానంటూ ఇంతవరకూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని సోమయాజులు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 ఎంపి స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులను గెలిపిస్తేనే రుణ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు మెలిక పెడుతున్న వైనాన్ని ఆయన ఉటంకించారు. అసలు రాష్ట్రం పరిధిలో లేని రుణ మాఫీని చంద్రబాబు ఎలా అమలు చేస్తారని సోమయాజలు నిలదీశారు. దేశం మొత్తంలో ఇప్పటికి మూడు సార్లు మాత్రమే రుణ మాఫీ జరిగిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎక్కడ ఎలాంటి కుంభకోణం జరిగినా దానితో‌ శ్రీమతి షర్మిల భర్త బ్రదర్‌ అనిల్ కుమార్‌తో లింకు పెట్టి ఆరోపణలు చేయడం దారుణం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు తీవ్రంగా ఖండించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై బ్రదర్‌ అనిల్‌ పరువునష్టం దావా వేయనున్నారని ఆయన పేర్కొన్నారు. న్యాయపోరాటం చేసే యోచనలో అనిల్ ఉన్నారని సోమయాజులు వెల్లడించారు. బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు సంబంధించి అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సహకార సంఘాల ఎన్నికలు ఇంత దారుణంగా జరిగిన తీరు గతంలో ఎన్నడూ చూడలేదని సోమయాజులు వ్యాఖ్యానించారు.
Back to Top