సాన్వి హత్య పట్ల వైయస్ఆర్ సీపీ దిగ్భ్రాంతి

హైదరాబాద్

27 అక్టోబర్ 2012 : అమెరికాలో చిన్నారి సాన్వి దారుణ హత్యను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. హృదయ విదారకమైన ఈ ఘటన పట్ల వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ వెంకట్ మేడపాటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసి పసిపాపను చిదిమేసిన తీరు అత్యంత దారుణం, పాశవికమని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. సాన్వి హత్య పట్ల ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో కుమార్తె సాన్వితో పాటు తల్లి సత్యవతిని కూడా కోల్పోయిన  వెన్నా శివప్రసాదరెడ్డి, చెంచులత దంపతులకు వైయస్ఆర్ సీపీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికే మాయని మచ్చ తెస్తాయన్నారు.
  సూట్‌కేసులో పాపను కుక్కేసి రాక్షసంగా హతమార్చిన ఈ ఘటన తెలుగువారినందరినీ కలచివేస్తోందని, మరో తెలుగువాడు యండమూరి రఘు హంతకుడిగా నిందితుడు కావడం విచారకరమని వెంకట్ వ్యాఖ్యానించారు. ఈనెల 23న పెన్సిల్వేనియాలో సాన్వి నాయనమ్మ సత్యవతిని హత్యచేసి, చిన్నారి సాన్విని కిడ్నాప్ చేసిన సంగతీ, దరిమిలా సాన్వి మృతదేహం లభించడంతో అమెరికా పోలీసులు దారుణహత్యను ధ్రువీకరించిన విషయమూ తెలిసిందే.

Back to Top