రుణాలు మాఫీ చేయాలి!

హైదరాబాద్

9 నవంబర్ 2012 : నీలం తుఫాను బాధిత ప్రాంతాలలో పంట రుణాలు మాఫీ చేయాలని, కౌలురైతులతో సహా కులవృత్తులవారందరికీ రుణ మాఫీతో పాటు కొత్త రుణాలను మంజూరు చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలపై వడ్డీని మాఫీ చేసి రీ షెడ్యూలు చేయాలని పార్టీ కోరింది. తుఫాను తీవ్రతను అంచనా వేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శుక్రవారం జరిగిన పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం అభిప్రాయపడింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం జాప్యంతో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సమావేశం నిరసించింది. వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్. విజయమ్మ అధ్యక్షతన లోటస్‌పాండ్‌లోజరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్‌సీలు సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. సమావేశం తీర్మానాల వివరాలను పార్టీ కేంద్ర పాలక మండలి కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ మీడియాకు వివరించారు. ముందస్తు జాగ్రత్తల విషయంలోనే కాక తుఫాను అనంతర సహాయ, పునరావాస చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని సమావేశం అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు.
"నీలం తుఫాను నేపథ్యంలో బాధ్యత కలిగిన రాష్ట్రప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలూ తీసుకోలేదు. ప్రజలను చైతన్య పరచకపోవడం, అధికార యంత్రాం గాన్నిసమాయత్తం, అప్రమత్తం చేయకపోవడం వల్ల తుఫాను నష్ట ప్రభావం పెరిగింది. సాధారణంగా సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ప్రతి ఏడాదీ తుఫానులు వస్తుంటాయి. కనుక ప్రతి ప్రభుత్వమూ ముందస్తు చర్యలు తీసుకోవడం పరిపాటి. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బోట్లు అందుబాటులో ఉంచడం, పునరావాస కేంద్రాల ఏర్పాటు జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ ఏడాది ఆ పని చేసిన దాఖలాలు లేవు. మంత్రులేమో నీలం ప్రభావం ఉండదు, వాతావరణశాఖ ముందస్తుగా తెలియపరచలేదు కాబట్టి మేం చెప్పలేకపోయాం, పరిస్థితి తీవ్రంగా లేదు కాబట్టి సోనియాగాంధీని తీసుకురాలేకపోయా మని కప్పదాటు సమాధానాలు చెప్పడం తప్ప, ఇప్పటికైనా జరిగిన తప్పిదాలను కూడా సరిదిద్దుకోవడం లేదు. కనీసం తుఫాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేసి ఆదుకునే చర్య విషయంలోనూ ఈ ప్రభుత్వం చాలా జాప్యంతో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఈ తీరును సమావేశం తీవ్రంగా ఖండించింది." అని ఆయన తెలిపారు.
"నష్టపోయిన రైతుల ప్రస్తుత పంటకాలం రుణాలను పూర్తిగా వడ్డీతో సహా మాఫీ చేయాలి. పార్టీ గౌరవాధ్యక్షురాల విజయమ్మ నాలుగైదు జిల్లాలలో పర్యటించినప్పుడు రైతులు, రైతుకూలీలు, చేనేత కార్మికులు, ఇతర వృత్తిపనివాళ్లు తాము చాలా నష్టపోయామని చెప్పారు. కౌలు రైతులైతే మరీ నష్టపోయారు. కనుక వారికందరికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. వారి రుణాలు రద్దు చేయడమే కాకుండా కొత్త రుణాలివ్వాలి. రైతులకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి. తడిసిన వరి, పత్తి, మిరప వంటి పంటలకు తగు రీతిన నష్టపరిహారం ఇవ్వాలి. ఇలాంటి ప్రాకృతిక విపత్తులు సంభవించినప్పుడు సెంట్రల్ కలామిటీ రిలీఫ్ ఫండ్ నుండి  హెక్టారుకు రూ. 25 వేలు ఇవ్వాలన్న భూపేందర్ సింగ్ సిఫారసు మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. దీని ప్రకారం ఎకరాకు పదివేల రూపాయల పరిహారం వస్తుంది. అలాగే చనిపోయినవారి కుటుంబాలకు మూడులక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. తుఫాను వల్ల పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ధ్వంసమైన ఇళ్ల స్థానే ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. లోతట్టు ప్రాంతాలలో కూడా సురక్షిత నివాసాలు ఏర్పాటు చేయాలి. పశుసంపదకు కూడా చాలా నష్టం వాటిల్లిన దృష్ట్యా వారికి గేదెలు, గొర్రెలు, కోళ్లు కొనుక్కోవడానికి కొత్తగా రుణాలివ్వాలి" అని సమావేశం డిమాండ్లను రామకృష్ణ వివరించారు.

Back to Top