వెన్నుపోటులో బాబుకు తమ్ముడు కిరణ్

హైదరాబాద్, 4 నవంబర్ 2013:

రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా ఆరోపించారు. సమైక్యం ముసుగు వేసుకుని కిరణ్‌కుమార్‌రెడ్డి, ఒక విధానం అంటూ లేకుండా చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలుగువారి ఆత్మగౌరవ జెండాను ఢిల్లీలో ఎగరేయడానికి కృషి చేసిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అన్న అయితే.. ఆయనకు ఏమాత్రం తీసిపోనంటూ తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ.. చంద్రబాబుకు తమ్ముడిలా కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన వేగంగా జరిగేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారంనాడు రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రాన్ని విభజించాలని ప్రకటన వచ్చిన తరువాత తమ జీవితాలను నాశనం చేయవద్దంటూ సీమాంధ్రలోని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రజలంతా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని రోజా తెలిపారు. వారి ఆందోళనను కనీసం పట్టించుకోకుండా రోజుకో కమిటీ వేస్తూ.. తొందరగా విభజించాలని తొందరపడుతున్న కాంగ్రెస్‌ పార్టీని టీడీపీ మద్దతు ఇస్తోందని విమర్శించారు. ముందుగా ఆంటోనీ కమిటీ, తరువాత మంత్రుల బృందం, రాష్ట్రాన్ని ఎలా విభజించాలనే దాని మీద ఇప్పుడు రాష్ట్రంలోని 8 పార్టీలకు లేఖలు రాసిందన్నారు.

రాష్ట్ర విభజనను కాంగ్రెస్‌ పార్టీ కోరుకోవడం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టంగా చెప్పిందని రోజా అన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్. సురేష్‌ కుమార్‌కు పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తాను వేసుకున్న కమిటీకి ఇంతవరకూ తన అభిప్రాయాన్ని తెలియజేయలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. టిడిపి కూడా ఏమి చెప్పాలో తెలియక తచ్చాడుతోందని వ్యాఖ్యానించారు. అంటే సోనియా ఆదేశాల కోసం కాంగ్రెస్‌, టీడీపీలు వేచిచూస్తున్నాయా? అని రోజా ప్రశ్నించారు. టీడీపీకి ఒక విధానం అంటూ లేదని, సోనియా చేయమంటే చంద్రబాబు చేయడం లేదంటే మౌనంగా ఉంటున్న వైనాన్ని చూస్తున్నామన్నారు. కేవలం శ్రీ వైయస్‌ జగన్‌ను దూషించడం తప్ప రాష్ట్ర సమస్యలు, విభజన గురించి, సమైక్యాంధ్ర గురించి చంద్రబాబు ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా? అని రోజా ప్రశ్నించారు.

టీ టీడీపీ నాయకులు సీమాంధ్ర టిడిపి నాయకులను, టీ టీడీపీ నాయకులను సీమాంధ్ర నాయకులు విమర్శించడం, దూషించడం చూస్తుంటే.. ప్రజలకు మోసం చేయడానికి ఆడుతున్న డ్రామా అని రోజా అభివర్ణించారు. ఇప్పటికీ జీఓఎంను బహిష్కరిస్తున్నారే తప్ప తెలంగాణకు మద్దతుగా ఇచ్చిన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవడంలేదని చంద్రబాబును ఆమె నిలదీశారు. రాష్ట్రాన్ని విభజిస్తే.. ఏ రకంగా బాగుపడుతుందని తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భావించారని సూటిగా ప్రశ్నించారు. తెలుగువాడివై ఉండీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన చంద్రబాబు మళ్ళీ ఆత్మగౌరవం పేరుతో ప్రజల్లోకి వెళ్ళడమేమిటని అన్నారు. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారా? అని నిలదీశారు.

రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని రోజా ఆరోపించారు. సర్పంచ్‌ ఎన్నికలు మొదలు ఇప్పటి జీఓఎం వరకూ కాంగ్రెస్‌ అధిష్టానం ఆడించినట్టే చంద్రబాబు ఆడుతున్నారన్నారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఒక విధానం అంటూ లేదా? అని ప్రశ్నించారు. సీమలో పుట్టిన సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడులకు అక్కడి ప్రజల కన్నీళ్ళు చూసైనా మనసు కరగడం లేదంటే అంత బండరాయిలుగా మారిపోయారా? అని అన్నారు. 'తెలుగువాడి కష్టాన్ని చూడొద్దు.. తెలుగువాడి కష్టం గురించి మాట్లాడవద్దు.. తెలుగువాడి  కష్టాల్ని వినొద్దు' అన్న చందంగా మనసులేనివారిగా నిలిచిపోయారని విమర్శించారు. దాదాపుగా 95 రోజులుగా జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమాన్ని ఎందుకు చూడలేకపోతున్నారని అన్నారు.

చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి :
ప్రజలను మోసం చేయడానికో.. వారిని తప్పుదారి పట్టించడానికో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం కాదని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉందని పయ్యావుల కేశవ్‌కు రోజా సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడే... టిడిపి పుట్టినప్పటి నుంచీ పార్టీలో ఉన్న పయ్యావుల కేశవ్‌ లాంటి వాళ్ళు చంద్రబాబును నిలదీయాల్సిందన్నారు. ఢిల్లీలో కొరడాలతో కొట్టుకుంటున్న టిడిపి ఎంపీలు చంద్రబాబును నిలదీయకపోవడం డ్రామా కాదా.. ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిలా స్వయం ప్రకాశుడు కాదు కాబట్టే.. సోనియా ఎలా చెబితే అలా తలాడిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. అయితే.. సోనియానే ఎదిరిస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారని అన్నారు. సీమాంధ్రకు అనుకూలంగా ముందే అసెంబ్లీ తీర్మానం చేసి ఉంటే విభజన నిర్ణయం జరిగేది కాదన్నారు. మెజారిటీగా 175 మంది ఉన్న సీమాంధ్ర సభ్యులతో తీర్మానం సులువుగా నెగ్గేదన్నారు. కానీ అలా చేయకుండా కిరణ్‌ తప్పుదారి పట్టిస్తే.. అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని అడగాల్సిన చంద్రబాబు కూడా మౌనంగా ఉన్నారంటే.. విభజనను వేగవంతం చేయడానికి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆరోపించారు.

సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యమాన్ని పైకి తీసుకువచ్చి.. దాన్నెలా కిందపడేశారో మనందరం  కళ్ళారా చూశామని రోజా అన్నారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జీఓఎంకు ప్రభుత్వం ఎందుకు లేఖ ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ బొత్స సత్యనారాయణ ఎందుకు లేఖ ఇవ్వడంలేదని నిలదీశారు. సోనియా నచ్చినట్టు మాట్లాడడమే తప్ప విభజనకు లిఖిత పూర్వకంగా అభ్యంతరం ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. సమైక్యాంధ్ర ముసుగులో వీళ్ళంతా ప్రజల సెంటిమెంటుతో ఆటాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మొదటి నుంచి ఇప్పటి వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకే విధానంతో కొనసాగుతున్నదని రోజా స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేసే వారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదామంటూ మొన్నటి సమైక్య శంఖారావం సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజల నుంచి ప్రతిజ్ఞ తీసుకున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేసేందుకే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలుస్తున్నారన్నారు. అడుగడుగునా ప్రజలకు అండగా ఉండేది ఒక్క శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు.

విభజన ఎందుకో కాంగ్రెస్, టీడీపీ చెప్పాలి :
విడిపోయి... మధ్యన గోడ కూడా కట్టేసిన చాలా ఏళ్ళ తరువాత తూర్పు, పశ్చిమ జర్మనీ ప్రజలు విసిగిపోయి.. కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతామని భావించి ఆ గోడను కూల్చి ఏకమయ్యారని రోజా గుర్తుచేశారు. అలాగే ఉత్తర, దక్షిణ కొరియాలు కూడా కలిసిపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలు క్షేమంగా ఉండాలని వారి ఆకాంక్షల మేరకు దేశాలే కలిసిపోతున్నాయన్నారు. 70 శాతం ఉన్న ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే ఎందుకు విడదీయాలని కాంగ్రెస్, టీడీపీలు కంకణం కట్టుకున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీలు బుద్ధి తెచ్చుకుని సమైక్యవాదం వైపునకు రావాలని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకుని, ప్రజల ముందు చెంపలేసుకునే రోజు వస్తుందన్నారు.

Back to Top