సీమాంధ్ర కేంద్ర మంత్రులు వాజమ్మలు

దరాబాద్, 27 నవంబర్ 2013:

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ ధోరణిపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిరసన వ్యక్తంచేశారు. ప్రజల ఆగ్రహాగ్నికి భస్మమైపోతామనే భయంతో మాత్రమే రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని సీఎం కిరణ్, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు అన్నారని.. నిజానికి వారంతా విభజన విషయంలో కేంద్రానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేకపాటి మాట్లాడారు. సీఎం కిరణ్, సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా నిర్వీర్యమైపోయి, వాజమ్మల్లాగా మారిపోయారని తూర్పారపట్టారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి గాని, జీఓఎంకు గాని, ప్రధానికి, సోనియాకు వారు చెప్పడంలేదని దుయ్యబట్టారు. విభజనను అడ్డుకుంటామని మాటలు చెప్పడం కాదని, చేసి చూపించాలని కోరారు.
కొందరు సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్‌ను ఆరేళ్ళు, మరి కొందరు పదేళ్ళు యూటీగా చేయాలని అంటున్నారని మేకపాటి ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడైతే మొదటే ప్యాకేజ్‌ అడిగారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మెజారిటీతో అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీ పంపిద్దామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందు నుంచీ చెబుతూనే ఉన్నారని అయన గుర్తుచేశారు. ఆయన సూచనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని మేకపాటి విమర్శించారు. రేపో మాపో కేంద్ర కేబినెట్‌కు నోట్‌ వస్తుందని, దానిని రాష్ట్రపతికి పంపిస్తారని, అనంతరం అసెంబ్లీకి వస్తుందన్నారు. సాధారణంగా అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు అభిప్రాయాలు చెప్పడానికి రెండు నెలల సమయం ఇస్తారని అయితే.. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లుకు మాత్రం 15 రోజులో లేకపోతే అంతకన్నా హడావుడిగా తిప్పి పంపడానికి 10 రోజులో సమయం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. డిసెంబర్‌ 20వ తేదీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే లోగానే అసెంబ్లీ అభిప్రాయాన్ని తూతూ మంత్రంగా తీసుకొని, పార్లమెంటులో పెట్టి బిల్లును ఆమోదించాలని కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తోందని అన్నారు.

దేశాన్ని పరిపాలించే వారు ప్రజలు, రాష్ట్రాల క్షేమాన్ని కోరాలని మేకపాటి అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించమని అసెంబ్లీ తీర్మానం చేసినా, విదర్భపైనా ఎప్పుడో తీర్మానించినా‌ కేంద్రం పట్టించుకోలేదని రాజమోహన్‌రెడ్డి ప్రస్తావించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మాత్రమే అసెంబ్లీలో చర్చించకుండానే తీర్మానం లేకుండానే, 75 శాతానికి పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఉన్నపళంగా కేంద్రం నిర్ణయం తీసుకుని విభజిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో కూడా చాలా మంది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. అత్యధిక శాతం ప్రజలు సమైక్యాంధ్రను కోరుతున్నా పట్టించుకోకుండా ముక్కలు చేయడం తగదని మేకపాటి అన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఐదేళ్ళ వైయస్ఆర్‌ పరిపాలనలో ఒక్క పైసా కూడా ఏ పన్నూ పెంచకుండా సుపరిపాలన అందించిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన అనంతరం ఇప్పటికి ఈ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలను, ఎరువులు, డీజిల్‌ తదితర ధరలను ఎన్నోసార్లు పెంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చార్జీలు పెంచినప్పటికీ అసలు విద్యుత్‌ సరఫరాయే లేక పరిశ్రమలెన్నో మూతపడిపోయాయని, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని మేకపాటి ఆవేదన వ్యక్తంచేశారు. అస్తవ్యస్థ పరిపాలనతో రాష్ట్రం అతలాకుతలమైందని, ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయిందన్నారు.

వీలైనంత తొందరగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని మేకపాటి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విభజించమని చంద్రబాబు నాయుడు 1998లోనే కేంద్రానికి లేఖ ఇచ్చారని అన్నారు. ఆ లేఖను ధ్రువీకరిస్తున్నామని, విభజించమని టీడీపీ వారు కేంద్రానికి చెబుతున్నారని ప్రస్తావించారు. అధిక శాతం ప్రజల అభిమతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విభజించాలని చేస్తున్న యత్నాలను చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా లేక నియంత పాలనలోనా అని అర్థం కావడలేదన్నారు. తెలుగు ప్రజలకు ఇంత దీనావస్థ వచ్చిందా అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ అస్తవ్యస్థ పాలనలో కాంగ్రెస్‌ పార్టీకి సీమాంధ్ర, తెలంగాణల్లో ఒక్క పార్లమెంటు సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో విభజించి అయినా పది స్థానాలన్నా సాధించాలన్న రాజకీయ స్వార్థంతోనే ఇంతటి దురాగతానికి కేంద్రం పాల్పుడుతోందని మేకపాటి దుయ్యబట్టారు. పార్లమెంటులో కనీసం ఉండాల్సిన 272 మంది సభ్యుల మెజారిటీ లేని కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన నిర్ణయం చేయడమేమిటని ప్రశ్నించారు.

ఆర్టికల్‌ 3ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలను తమ పార్టీ ప్రతినిధుల బృందం కలిసి వివరంగా చెప్పినట్లు మేకపాటి తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకపోతే ప్రజల అభిప్రాయం ఎలా తెలుస్తుందని ఆయన నిలదీశారు. ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ఏకగ్రీవ తీర్మానం ఉండాలని, కనీసం అసెంబ్లీ, పార్లమెంటులో 2/3 వ వంతు మెజారిటీతో తీర్మానం తప్పనిసరి చేయాలన్న పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ వాదనను అన్ని పార్టీల నాయకులూ సమ్మతించారని తెలిపారు.

అది ఇది అని కాకుండా అన్ని పార్టీల నేతలకూ కలిసి శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేస్తున్న కృషి, పడుతున్న తపన ప్రశంసనీయంగా ఉందని మేకపాటి అన్నారు. అధికారం ఉందని రాష్ట్రాన్ని అడ్డగోలుగా, నిర్దయగా విభజించడాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని మేకపాటి విజ్ఞప్తిచేశారు.

తెలంగాణ బిల్లు మెజారిటీ ఆమోదం లభించదన్న భయంతోనే సీమాంధ్రలోని కర్నూలు, కడప జిల్లాలను విడగొట్టి రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నదని మేకపాటి ఆరోపించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు వేస్తున్నదన్నారు. అలా జరిగితే ప్రజా ప్రతినిధులను సీమాంధ్ర ప్రజలు క్షమించరని హెచ్చరించారు. వారి రాజకీయ జీవితం సమాధి అవుతుందన్నారు.

Back to Top