జగన్‌ను ఇంకా జైలులో ఉంచే యత్నం

హైదరాబాద్, 24 మార్చి 2013 :‌ జననేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని విచారణ నెపంతో మరి కొంత కాలం జైలులో నిర్బంధించాలని సిబిఐ జె.డి. లక్ష్మీనారాయణ ప్రయత్నం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేతిలో పావుగా మారిన సిబిఐ కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు ఉందని ఆయన ఆరోపించారు. శ్రీ జగన్‌ విషయంలో సిబిఐకి వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా? అని అంబటి నిలదీశారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తీరుపైన అంబటి ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో పెట్టి ఈ నెల 27కు పది నెలలు పూర్తవుతుందని అంబటి తెలిపారు. ఇప్పటికైనా శ్రీ జగన్‌ విడుదల అవుతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైయస్‌ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నారు. కానీ సిబిఐ జె.డి. లక్ష్మీనారాయణ శనివారంనాడు మీడియాతో మాట్లాడిన తీరు చూస్తుంటే శ్రీ జగన్‌ను మరికొంతకాలం జైలులోనే నిర్బంధించాలన్న ధోరణి కనిపించిందని దుయ్యబట్టారు.‌ శ్రీ జగన్‌ కేసు విషయంలో మార్చి నెలాఖరులోగా చార్జిషీట్ వేస్తారా అని మీడియా అడిగినప్పుడు 'అలాగని మీడియానే రాసింది' అని బదులిచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు 'ఆ వి‌వరాలు వెబ్‌సైట్‌లో చూసుకోండి' అంటూ సమాధానం చెప్పిన తీరు సరిగా లేదని అంబటి విమర్శించారు. అంటే శ్రీ జగన్‌ను ఇంకా జైలులోనే నిర్బంధించాలన్న ధోరణి లక్ష్మీనారాయణ తీరులో కనిపిస్తోందన్నారు. ఎవరైనా తప్పుడు రాతలు రాసినా, వక్రీకరించినా, సిబిఐకి అపవాదు వచ్చేలా చేసినా సిబిఐ ప్రతినిధి తప్పకుండా ఖండించాలన్న బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. నిజానికి మీడియాకు సిబిఐ అధికారులే లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

గడచిన ఆరు నెలలుగా శ్రీ జగన్‌ కేసుపై దర్యాప్తు పూర్తిచేయకుండా సిబిఐ నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్నదని జె.డి. లక్ష్మీనారాయణ మాటల ద్వారా తెలుస్తోందన్నారు. గత ఏడాది 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీ జగన్‌ను గత ఏడాది మే 27న సిబిఐ అరెస్టు చేసిందని అంబటి గుర్తుచేశారు. అప్పటి నుంచీ దర్యాప్తు పూర్తిచేయకపోవడం అంటే చట్టం ప్రకారం వ్యవహరిస్తోందా? లేక పైనుంచి ఎవరైనా చెబితే పనిచేస్తోందా అన్నది సిబిఐ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి ఒక విధానం అంటూ లేదా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఎవరినైనా జైలులో పెట్టి 90 రోజులలో చార్జిషీట్‌ వేయకపోతే బెయిలు ఇవ్వకుండా ఉంచకూడదన్న ధర్మాన్ని కూడా సిబిఐ ధిక్కరిస్తోందని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

ములాయంసింగ్‌, జయలలిత, మాయావతిపైన కూడా సిబిఐ కేసులు ఉన్నాయని వారినెవరినీ అరెస్టు చేయలేదని, విచారణ పేరుతో వేధించలేదని, అలాంటిది కేవలం శ్రీ జగన్‌ విషయంలోనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నిలదీశారు. శ్రీ జగన్‌పై ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న సిబిఐ భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి అగత్యం వస్తుందని అంబటి హెచ్చరించారు. ఆరుగురు మంత్రులు, 8 మంది ప్రభుత్వ కార్యదర్శులు సంతకాలు చేసి విడుదల చేసిన 26 జి.ఓ. ల విషయంలో ఒక్క మంత్రిని మాత్రమే ఎందుకు జైలులో పెట్టారని నిలదీశారు. మిగతా ఐదుగురు మంత్రులు, కార్యదర్శులను స్వేచ్ఛగా ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు. ఆ 26 జి.ఓ.లు సక్రమమే అని వీరంతా సుప్రీంకోర్టలో అఫిడవిట్‌ దాఖలు చేశారని, అవి సక్రమమైతే శ్రీ ‌జగన్‌ను దోషిగా ఎలా పరిగణిస్తారని అంబటి నిప్పులు చెరిగారు. పది నెలలుగా శ్రీ జగన్‌ను జైలులో నిర్బంధించి రాక్షస క్రీడకు తెరలేపారని ఆయన దుయ్యబట్టారు.

జననేత శ్రీ వైయస్‌ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్రకు జనం జేజేలు పలుకుతున్నారని అంబటి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Back to Top