యు టర్ను తీసుకున్నది కాంగ్రెస్సే

హైదరాబాద్, 11 అక్టోబర్ 2013:

కాంగ్రెస్‌ పార్టీయే పలుమార్లు యు టర్ను తీసుకున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పారపట్టింది. అయితే.. ఇతర పార్టీలు యు టర్ను తీసుకున్నాయంటూ ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టింది. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనే కాంగ్రెస్‌ పార్టీ విభజన ప్రక్రియను ముందుకు తీసుకువచ్చిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ ఆరోపించారు. రెండవ ఎస్సార్సీ పెట్టాలని 2006లో సిడబ్ల్యుసి తీర్మానం చేసిన విషయాన్ని దిగ్విజయ్‌ సింగ్‌ తెలుసుకోవాలన్నారు. 2009 డిసెంబర్‌లో చిదంబరం ఒకేసారి యు టర్ను తీసుకుని రాష్ట్ర విభజన ప్రకటన చేశారని గుర్తుచేశారు. జూలై 30న కాంగ్రెస్‌ పార్టీ మళ్ళీ యు టర్ను తీసుకుని సిడబ్ల్యుసి తీర్మానం ద్వారా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విభజన విషయంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు స్పష్టత లేదని దిగ్విజయ్‌ సింగ్‌ గాని ఇతర ప్రతిపక్షాల వారు గాని చేస్తున్న వ్యాఖ్యలను కొణతాల తీవ్రంగా ఖండించారు. విభజన వల్ల రాష్ట్రంలో సమస్యలు వస్తాయని చెప్పామని, సమైక్యంగా ఉంచాలని అన్నామని, అందుకు అనుకూలంగా పార్టీ చేసిన తీర్మానాల్లో స్పష్టం చేశామన్నారు. 2009లో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తీర్మానం పెట్టి, రోశయ్య కమిటీని వేశారని, దానిలో 9 అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన జరగాలని పేర్కొన్నారని కొణతాల గుర్తుచేశారు. వాటిని పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలన్నారని తెలిపారు. ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి? ఏ రకంగా ఏకాభిప్రాయం తీసుకురావాలి? అనే విషయాలపై రోశయ్య కమిటీ వేశారన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా సమస్యల గురించి స్పష్టంగా తన నివేదికలో పేర్కొందన్నారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా కాంగ్రెస్‌ పార్టీ యు టర్ను తీసుకుందని కొణతాల ఆరోపించారు.

ఈ రోజు ఢిల్లీలో జరిగిన గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్సు‌ (జిఒఎం) సమావేశంతో రాష్ట్ర విభజన ప్రక్రి మొదలైందని కొణతాల అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియను జిఒఎం ఖరారు చేసిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఏయే అంశాలను ఏ మంత్రి చూడాలనే కేటాయింపులు కూడా జరిగాయని తెలిపారు. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, రావణకాష్టంలా మారిపోయినా, ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేంద్రప్రభుత్వం ఏమాత్రం చలించకపోవడం దురదృష్టకరం అన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వత్తాసు పలకడం వల్లే విభజన ప్రక్రియ మరింత ముందుకు వెళుతోందని కొణతాల ఆవేదన వ్యక్తంచేశారు.

అయోమయపెడుతున్న కాంగ్రెస్ నాయకులు :
ఒక పక్కన రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతుంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు మరింత అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 3న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తామని దిగ్విజయ్‌ సింగ్‌ చెబుతుంటే, అలాంటిదేమీ లేదు.. జిఒఎం సిఫార్సులు వచ్చాక, ఒక డ్రాఫ్టు బిల్లు తయారుచేసి, కేబినెట్‌లో పెట్టాక రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవడానికి పంపిస్తామని సుశీల్‌కుమార్‌ షిండే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మరో పక్కన దీనికి కాలపరిమితి లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి పి.సి. చాకో అంటున్నారని కొణతాల విమర్శించారు. ఎన్నికల ముందు కావచ్చు, లేదా ఆ తరువాత కావచ్చు రాష్ట్ర విభజన ఎప్పటికి అవుతుందో చెప్పలేమంటారన్నారు. ఇంకో పక్కన‌ తీర్మానాన్ని తిరస్కరిద్దాం, తీర్మానం వచ్చే వరకూ ఎవరూ రాజీనామాలు చేయవద్దంటూ సిఎం కిరణ్ కుమార్‌ అంటున్నారని విమర్శించారు. 2014 ఆఖరి నిమిషం వరకూ మనమే పదవుల్లో ఉండాలనే విధంగా ఆయన మాట్లాడుతున్నారన్నారు.

భయాందోళనల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏదో భరోసా ఇస్తున్నట్లుగా కిరణ్‌రెడ్డి వారానికి ఒకసారి ప్రెస్‌మీట్‌లో చెబుతుంటే.. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టిన ప్రతిసారీ కేంద్రం ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తోందని కొణతాల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియా తరఫున పనిచేస్తారని అందరికీ తెలిసిందే అన్నారు. దానికి ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. లోపల ఒక ఎజెండా పెట్టుకుని ప్రజలను మోసగించే విధంగా వ్యవహరించడం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. ఇప్పటికీ ప్రజలను ఎందుకు మభ్యపెడతారన్నారు. అసెంబ్లీకి తీర్మానం రాదని, ఓటింగూ జరిగే అవకాశం లేదన్నారు. అందుకే కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోకముందే.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి, రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి నుంచో ఎన్నోమార్లుగా చెబుతున్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విభజన తీర్మానంపై ఓటింగ్‌ ఏమీ ఉండదబోదని వాళ్ళ మంత్రే చెబుతున్నారన్నారు.

విభజన తీర్మానం విషయంలో రాష్ట్రంలో అయోమయం సృష్టించవద్దని కేంద్రానికి ముఖ్యమంత్రి అంటున్నారని అన్నారు. తీర్మానం విషయంలో ఉద్యోగ సంఘాలకు తాను హామీ ఇచ్చానని సిఎం చెబుతున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలకు ఆయన ఏమి హామీ ఇచ్చారని కొణతాల నిలదీశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఇప్పటికింకా మోసం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ ఆరోపించారు.

రాష్ట్రం త్వరగా విడిపోవాలనే బాబు ప్రయత్నం :
రాష్ట్రం ఎంత త్వరగా విడిపోవాలన్న దాని మీదే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో ఆయన దీక్ష విజయవంతమైనట్టు, ఆయన దీక్ష వల్లే కేంద్రం దిగివచ్చి జిఒఎం ఏర్పాటు చేసిందని టిడిపి నాయకులు చెప్పుకుంటున్నారన్నారు. టిడిపి లేఖ ఇచ్చిన విధంగానే రాష్ట్రం విడిపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించడానికే జిఒఎం పనిచేస్తుందని చెబుతున్నారన్నారు. ఒక వ్యక్తిని కత్తితోనా లేక ఉరి వేసి చంపాలా అనే విధంగా జిఒఎంను వేస్తే.. అది తమ ప్రతిభే అని టిటిపి నాయకులు చెప్పడాన్ని కొణతాల ఎద్దేవా చేశారు. చంద్రబాబు సహకారంతోనే కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతంగా మందుకు వెళుతోందన్నారు. రాష్ట్రానికి వచ్చే గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్సును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. మరో సైమన్‌ కమిషన్‌ లాంటి జిఒఎంను గో‌ బ్యాక్ అనాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రటిష్‌వారు ఉక్కుపాదాలతో అణచివేయాలని ఆనాడు ప్రయత్నించారో ఇప్పడు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను నిలువుగా చీల్చే కార్యక్రమం చేస్తోందని విమర్శించారు.

సిఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం :

ప్రజల కోసం తన పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి గడచిన నాలుగేళ్ళుగా ఎంత దారుణంగా పరిపాలన కొనసాగించారో అందరికీ తెలిసిందే అని కొణతాల విమర్శించారు. సుమారు రూ. 32 వేల కోట్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం వేశారని, ఆర్టీసీ చార్జీలు పెంచారని, ఫీజు రీయింబర్సుమెంట్‌, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నీరుగార్చారని ఆయన దుయ్యబట్టారు. రెండు గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వలేని పరిస్థితి ఉందని అయినప్పటికీ కిరణ్‌ తాను ప్రజల గురించే ఉన్నాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే కృషిలో ముందుకు రావాలని కొణతాల పిలుపునిచ్చారు. ద్వంద్వనీతిని వదిలిపెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాలన్నారు.

మొదటి ఎస్సార్సీ సమయంలో వచ్చిన విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఇప్పటికీ చేయని వైనాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలను విభజించినప్పుడు కూడా ఆయా రాష్ట్రాల ఉభయపక్షాలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా మన రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధపడిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేబినెట్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి, అన్ని పక్షాల వారితో మాట్లాడి, విభజనతో ఏయే సమస్యలు వస్తాయో వాటిని పరిష్కరించాలన్నది చర్చించాలని సూచించారు.

సహాయ కార్యక్రమాలలో పాల్గొనండి :
ఫైలిన్‌ తుపాను వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేయాలని పార్టీ తరఫున కొణతాల రామకృష్ణ విజ్ఙప్తి చేశారు. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ కోరుతోందన్నారు.

Back to Top