చంద్రబాబును ఎందుకు నిలదీయరు? : సురేఖ

హైదరాబాద్, 4 ఫిబ్రవరి 2013: మరో రెండు రోజుల్లో శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతోందనే భయంతో మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురద చల్లుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సిపి సిజిసి సభ్యురాలు కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న నాయకులకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా అని ఆమె ఒక ప్రకటనలో ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడు మరోకరు లేరని స్వయంగా ఎన్టీఆర్‌ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా సురేఖ గుర్తుచేశారు.

రాజకీయాల్లోకి వచ్చే నాటికి చంద్రబాబు కుటుంబానికి ఉన్న ఆస్తి కేవలం రెండే ఎకరాలని, ఇప్పుడు లక్షలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆయన ఎలా సంపాదించారన్న అంశం విమర్శకులకు తెలియదా? అని ఆమె నిలదీశారు. మన రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు ఆధ్వర్యంలోని హెరిటేజ్‌ ఫ్రెష్‌ దుకాణాలు పుట్టగొడుగుల్లా పెట్టడానికి నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించాలనిపించలేదా? అని సురేఖ అన్నారు. 'బాబు జమానా- అవినీతి ఖజానా' పేరుతో సిపిఎం పార్టీ పుస్తకాలు ముద్రించిందని, ఎమ్మార్‌ కు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కారు చౌకగా ధారాదత్తం చేసింది చంద్రబాబే అన్న విషయాన్ని కొండా సురేఖ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మార్‌, ఐఎంజీ కేసుల్లో విచారణ జరగకుండా చిదంబరాన్ని చంద్రబాబు చీకట్లో కలిసిన వైనాన్ని సురేఖ ప్రస్తావించారు.

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న భూములను ధనవంతుల కోసం విలాసవంతమైన ఇళ్ళు కట్టి, అమ్ముకోవడానికి, వారి గోల్ఫు ఆడుకోవడానికి అనుమతించినప్పుడు, 535 ఎకరాలను దాని కోసం పప్పుబెల్లాల్లా ధారాదత్తం చేసినప్పుడు సిబిఐ చేత విచారణ చేయించాలని విమర్శకులకు ఎందుకు అనిపించలేదని కొండా సురేఖ నిలదీశారు. నిబంధనలను చంద్రబాబు అడ్డగోలుగా అతిక్రమించినా, ఒకే టెండర్‌కు భూములు కేటాయించినా ఆయనను ఎందుకు విచారణ చేయడంలేదని ఈ రోజు మహానేత వైయస్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేస్తున్న నాయకులు అడగడంలేదని ఆమె ప్రశ్నించారు.

ఆపద్ధర్మ సిఎంగా ఉన్న చంద్రబాబు ఐఎంజీ కేసులో తనకు లేని అధికారం చెలాయించి, నిబంధనలను తుంగలో తొక్కి, ముందుగా మంత్రివర్గం ఆమోదం లేకపోయినా, హైదరాబాద్ నడిబొడ్డున ఒక బోగస్ సంస్థకు ఏకంగా 850 ఎకరాలు కేటాయించినా ఎందుకు విచారణ జరగడంలేదని ఆ నాయకులు ఎందుకు అడగడంలేదని సురేఖ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కైన చంద్రబాబు చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)ల బిల్లు కోసం ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారన్నారు. అవిశ్వాసం పెట్టకుండా మైనార్టీలో పడిన కిరణ్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజంపై మోస్తున్నారని సురేఖ ఆరోపించారు. కేసుల్లో విచారణ జరగకుండా ఉండేందుకే చంద్రబాబు ఎత్తుగడ పన్నారని కొండాసురేఖ ఆరోపించారు.

అసెంబ్లీలో తగినంత మంది సభ్యుల బలం ఉన్న చంద్రబాబు ఈ ప్రజా వ్యతిరేక, మైనార్టీలో పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్‌ చేశారు. తాము మద్దతు ఇస్తామని సురేఖ తెలిపారు. అన్నదాతను, రాష్ట్రంలోని నిరుపేదలను గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో కూలదోద్దామని పిలుపునిచ్చారు.
Back to Top