సీమాంధ్ర ఉద్యమాన్ని కించపరిచిన బాబు

హైదరాబాద్, 7 అక్టోబర్ 2013:‌

టిడిపి అధ్యక్షుడు ‌చంద్రబాబు నాయుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్‌ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరుస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. చంద్రబాబు అడిగిన విధంగా సీమాంధ్రకు ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు దిగ్విజయ్‌ సింగ్‌ వ్యవహారం ఉందని ఎద్దేవా చేసింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన మరుసటి రోజునే సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు ప్యాకేజ్‌ కావాలని చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి డిమాండ్‌ చేసిన వైనాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు చంద్రబాబు నిరాహార దీక్ష ఆ నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజ్‌ కోసమే చేస్తున్నారా? అని ప్రశ్నించింది. ఇరు ప్రాంతాల జెఎసిలతో మాట్లాడండి.. విభజనను వేగంగా పూర్తి చేయండి అని చంద్రబాబు చెప్పడాన్ని చూస్తే.. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ఆయన, దిగ్విజయ్‌ సింగ్‌ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, చంద్రబాబు తీరుపై విమర్శిలు సంధించారు.

చంద్రబాబు నాయుడు దీక్ష ఎందుకు చేపడుతున్నారు? వారు ఏమి డిమాండ్‌ చేస్తున్నారు? ఇంతవరకూ చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సీమాంధ్రలోని కోడెల శివప్రసాద్‌ లాంటి టిడిపి నాయకులంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటారన్నారు. తెలంగాణలోని నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు కేక్‌లు కట్‌చేసుకుని సంబరాలు జరుపుకుంటారని అంబటి ప్రస్తావించారు. ఇక చంద్రబాబు నాయుడేమో ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేస్తారన్నారు. ప్రణబ్‌ ముఖర్జీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండానే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేస్తున్నారంటే... రాష్ట్రాన్ని త్వరితగతిన విభజించండి.. ఇప్పటికే విభజన ఆలస్యమవుతున్నది.. అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థం అవుతున్నదన్నారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నామని, 24 గంటల్లో కేబినెట్‌ నోట్‌ ప్రవేశపెట్టబోతున్నామంటూ జూలై 30వ తారీఖున సిడబ్ల్యుసి ప్రకటన చేసిందని అంబటి గుర్తుచేశారు. సుమారు 63 రోజుల తరువాత అక్టోబర్‌ 3 తారీఖున ప్రవేశపెట్టిందన్నారు. కేబినెట్‌ నోట్‌నే ఇంత ఆలస్యంగా పెడితే ఎన్నికల లోపు విభజన సాధ్యమవుతుందా?.. ఈ ప్రక్రియను వేగవంతం చేయండి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారని స్పష్టంగా అందరికీ అర్థమవుతోందన్నారు.

నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజే కేబినెట్‌ ప్రవేశపెడతామన్న కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్‌ పార్టీ 63 రోజుల వరకూ ఆ పని చేయలేకపోవడానికి సీమాంధ్ర ఉద్యమమే కారణం అని అంబటి అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న మహోద్యమాన్ని చూసి నోట్‌ పెడితే ప్రమాదం అన్న భయంతోనే తాత్సారం చేసి ఇప్పటికి నోట్‌ పెట్టిందన్నారు. ఈ నోట్‌ కూడా ఆమోదం పొంది, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్సు వచ్చి, తరువాత శాసనసభకు వచ్చి, తరువాత బిల్లు ఎప్పుడు అవుతుందో తెలియకుండా ఉన్నది.. కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం ఎన్నికల లోపు సాధ్యం కాదని.. ఆ తరువాత మాత్రమే కుదురుతుందన్నారు. ఎన్నికల తరువాత ఈ రాష్ట్రాన్ని విభజించడం ఎవరి తరమూ కాదన్న భావన అందరిలోనూ ఉన్నదన్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర చేసిన తరువాత సెప్టెంబర్ 21న ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని, కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలను, ఇంకా చాలా మంది నాయకులను కలిసి.. సీమాంధ్ర విభజన జరగాలని తాను లేఖ ఇచ్చిన తరువాత.. విభజన ప్రకటన కాంగ్రెస్‌ చేసిన తరువాత..  సీమాంధ్ర ప్రాంతమంతా తాను తిరిగానని.. సీమాంధ్రలొ ఎవరూ తనను ఆపలేదని, సీమాంధ్రలో అసలు ఉద్యమమే లేదని వారికి చంద్రబాబు చెప్పారని అన్నారు. ఉద్యమం లేకపోకా తాను వెళ్ళిన ప్రతిచోటా తనకు జేజేలు పలికారని చెప్పుకున్నారని చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమమే లేదని చెప్పిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అవునా? కాదా? టిడిపి వారు చెప్పాలని అంబటి నిలదీశారు.

సీమాంధ్రలో ఉద్యమమే లేదు.. కేవలం ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని పెద్దలకు చెప్పినందువల్లే కేబినెట్‌ నోట్‌ వచ్చిందని అంబటి ఆరోపించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఢిల్లీలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్కడ నిరాహార దీక్ష చేయడం అంటే కాంగ్రెస్, చంద్రబాబు మధ్య కుదిరిన ఒప్పందం వల్ల కాదా? అని ఆయన ప్రశ్నించారు. విభజన ప్రకటన తప్పు.. వెనక్కి తీసుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేస్తుంటే.. చంద్రబాబేమో ప్యాకేజ్‌ ఇవ్వండి, విభజన ప్రక్రియను త్వరగా చేసేయండి అంటున్నారంటే.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు చంద్రబాబూ అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై, ఆ పార్టీ చెప్పినట్టల్లా చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారా? లేదా? అని అంబటి ప్రశ్నించారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇల్లు, ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయని, దాడులను అరికట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరానని దిగ్విజయ్‌ సింగ్‌ ఈ రోజు చెప్పడంపై అంబటి స్పందించారు. దాడులకు తాము అనుకూలం కాదన్నారు. దాడు చేయడం తప్పు అన్నారు. సీమాంధ్ర మీద టిడిపి, కాంగ్రెస్‌ కలిసి పెనుదాడి చేస్తే.. సీమాంధ్ర అల్లకల్లోలమైపోయి.. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి.. ఆర్తనాదాలు చేస్తుంటే.. పట్టించుకోని కేంద్రం కేవలం మంత్రులు, ఎంపిల ఆస్తులు కాపాడేందుకే ఉందా? అని అంబటి తూర్పారపట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి గెలిపించిన సీమాంధ్రులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారు.. విద్యార్థులకు తీవ్రంగా కొడుతున్నారని.. టియర్‌ గ్యాస్‌ పెట్టి పడగొడుతున్నారని, ఇంత ఘోరంగా, దారుణంగా వారు వ్యవహరిస్తుంటే.. దాని గురించి మాట్లాడరేమిటని అంబటి ప్రశ్నించారు.

సీమాంధ్రులను ఇంతలా హింసిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని అంబటి హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేని కారణంగానే కేబినెట్‌ నోట్‌ ఇంత ఆలస్యం అయిందని, సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరుగుతాయని తాము విశ్వసిస్తున్నామని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు అంబటి జవాబిచ్చారు.‌ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కనిపెట్టి బయటికి తీసిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, కేంద్రానికి పార్టీ రాసిన లేఖను పూర్తిగా చదవకుండా నలుగురు గ్రుడ్డివాళ్ళు ఏనుగు ఎలా ఉందో చెప్పిన విధంగా తమకు ఇష్టం వచ్చినట్లు భాష్యం చెబుతున్నారని మరో ప్రశ్నపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే.. తండ్రి స్థానంలో ఉండి సమన్యాయం చేయమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ చెబితే నిరంకుశంగా విభజన చేయడమా కాంగ్రెస్‌ చేసేది? అని ప్రశ్నించారు. తండ్రిలా వ్యవహరించని వ్యక్తులు ఆర్టికల్‌ 3ను తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఉభయులూ అంగీకరించేలా నిర్ణయం చేయనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాము చెబుతున్నామన్నారు.

Back to Top