ఉండవల్లి నిజంగా ఊసరవెల్లే!

హైదరాబాద్, 11 జూలై 2013:

కాంగ్రెస్‌ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాజమండ్రిలో బుధవారం నిర్వహించిన వార్షిక నివేదిక సమావేశంలో అసందర్భం ప్రేలాపనలు చేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆ సమావేశంలో ఆయన రామాయణంలో పిడకల వేటలా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని ఆయన తప్పుపట్టారు. క్షణానికో మాట మార్చే ఉండవల్లి నిజంగా ఊసరవెల్లే అని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వద్ద చట్ట విరుద్ధమైన డబ్బు లేదని ఉండవల్లి గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శ్రీ జగన్‌ పార్టీ పెట్టిన తరువాత ఉండవల్లి ఎందుకు మాట మార్చారని నిలదీశారు. ఉండవల్లి రెండు నాల్కల ధోరణిని మానుకోవాలని సలహా ఇచ్చారు. శ్రీ జగన్‌పై విచారణ జరుగుతున్నది.. అలాంటప్పుడు ఆరోపణలు ఎందుకు అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఉండవల్లి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉండవల్లిలో ఓ కామెడీ యాక్టర్ ఉన్నాడేమో అని వ్యాఖ్యానించారు.

రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండకూడదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.  కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపిలు లగడపాటి రాజగోపాల్, వివేక్‌లు వ్యాపారాలు చేయడంలేదా? వారికి వేల కోట్ల రూపాయలు లేవా? అని అడిగారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వ్యాపారాలు చేయకూడదా? ఆయన ఆస్తులు సంపాదించుకోకూడదా? అని ప్రశ్నించారు. శ్రీ జగన్‌పై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సభలో సమయం లేనందున మరోసారి చంద్రబాబు, నరేంద్ర మోడి గురించి చెబుతానన్న ఉండవల్లి మాటలను అంబటి ఎద్దేవా చేశారు. బహుశా అవిశ్వాసం సమయంలో టిడిపి ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడినందుకు ఆయన జేజేలు పలికేవారో... ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు చెప్పేవారో.. ఎఫ్.డి.ఐ. బిల్లు సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరువు కాపాడినందుకు ధన్యవాదాలు, థ్యాంక్సు చెప్పేవారో అని వ్యాఖ్యానించారు. మొన్నటి ఉప ఎన్నికల్లో రెండు చోట్ల టిడిపి ఓట్లను బదలాయించి కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించినందుకు చంద్రబాబును ఉండవల్లి అభినందించేవారో తనకు అర్థం కావడంలేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని విమర్శించలేని స్థానికి ఉండవల్లి దిగజారిపోయారన్నారు.

రామోజీపై పోరాటం ఎందుకు ఆపారు? :
ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావుపై ఉండవల్లి పోరాటాన్ని ఎందుకు ఆపేశారని అంబటి రాంబాబు ప్రశ్నించారు? రామోజీ విషయంలో ఉండవల్లి అస్త్ర సన్యాసం చేశారా? రామోజీరావుకు క్షమాపణ చెప్పారా? ఉండవల్లి దిగజారుడుతనం చూస్తే బాధేస్తోందన్నారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తరువాత ఆయన పాపులర్‌ అయ్యారని తెలిపారు. ఉండవల్లికి ఇదే చివరి వార్షిక సమావేశం కాబట్టి రామోజీపైన, చంద్రబాబు పైన విమర్శిలు చేయలేకపోయారా? అని ప్రశ్నించారు. ఉండవల్లికి మళ్ళీ టిక్కెట్టు రాకపోవచ్చని, వచ్చినా గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి, రాజకీయంగా అంతిమదశలో ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడే సమయం లేకపోయిందా? అని నిలదీశారు. రామోజీ విషయంలో ఉండవల్లి అస్త్ర సన్యాసం చేశారా? అని అడిగారు. లేకపోతే ఉండవల్లిని రామోజీ బెదిరించారా అన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. రామోజీరావును ఉండవల్లి క్షమాపణలు కోరారా? అని అన్నారు. లేదా రామోజీరావును దూషించినా.. విమర్శించినా నీ నాలుక కోస్తానని కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరించిందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. రామోజీరావుపై కేసు పురోగతి గురించి ఉండవల్లి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ప్రజల మధ్య ఉద్భవించిన మహా సూర్యుడు లాంటి శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెలుగు కిరణాలు చూసి అసూయ, బాధతో ఉండవల్లి కుళ్ళిపోతున్న తీరు కనిపిస్తున్నదని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రాజకీయంగా మహానేత రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యతిరేకులుగా ముంద్రపడిన మధు యాష్కీ, వి.హనుమంతరావు లాంటి చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించినా తమకు అంతగా బాధ అనిపించలేదన్నారు. కాని, వైయస్‌ ప్రాపకం పొంది, ఆయన మన్ననలు పొందిన వ్యక్తిగా, వైయస్‌ వల్లే రెండు సార్లు ఎంపిగా ఎన్నికైన వ్యక్తిగా శ్రీ జగన్‌ గురించి అన్యాయంగా, అక్రమంగా మాట్లాడడం నమ్మక ద్రోహం అని అంబటి విరుచుకుపడ్డారు.

వైయస్‌ మరణానికి సోనియా కారణమని ఎవరన్నారో ఉండవల్లి బయట పెట్టాలని అంబటి డిమాండ్‌ చేశారు. రాజశేఖరరెడ్డి మరణానికి సోనియాయే కారణం అన్న వ్యక్తి మాటల క్లిప్పింగ్‌ను చూపించకుండా ఎందుకు పారిపోయావని ఉండవల్లిని అంబటి నిలదీశారు. నిజానికి వైయస్‌ మరణంపై రాష్ట్ర ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. అది హత్యేమో అనే భయం కూడా వారిలో ఉన్నదన్నారు. బహుశా తన అభిప్రాయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై రుద్దేందుకు ఉండవల్లి ప్రయత్నించారేమో అన్నారు. వార్షిక సమావేశంలో తాను చేసిన అభివృద్ధి గురించి కాకుండా శ్రీ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం అంటే అంతకన్నా నీచం మరొకటి లేదన్నారు.

మహానేత వైయస్‌కు తనకు అనుబంధం ఉందని, ఆయన ఒక బంగారు బాతు లాంటివారని, ఆయన నీతిగా, నిజాయితీగా సక్రమంగా పరిపాలన అందించారని అభివర్ణించిన ఉండవల్లి తన సహచర కాంగ్రెస్‌ నాయకులు అనుచితంగా విమర్శలు చేసినప్పుడు ఎందుకు నోరు విప్పలేదని అంబటి ప్రశ్నించారు. తన అర్హతకు మించి ఉన్నత స్థానానికి తెచ్చిన వైయస్‌పై కాంగ్రెస్‌ ఎంపీలు వి.హనుమంతరావు, మధుయాష్కీ, సర్వే సత్యనారాయణ, జెడి శీలం, హర్షకుమార్‌ విమర్శించినప్పుడు, నీచంగా మాట్లాడినప్పుడు ఉండవల్లీ ఎక్కడ దాక్కున్నావు అని నిలదీశారు. చివరికి రాజశేఖరరెడ్డి మరణం గురించి ఇటీవల కొందరు నీచంగా మాట్లాడినప్పుడు ఉండవల్లీ నీకు బాధ అనిపించలేదా అని ప్రశ్నించారు. ఉండవల్లి నమ్మక ద్రోహిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజశేఖరరెడ్డిని విమర్శించినప్పుడు ఎందుకు ప్రతివిమర్శ చేయలేదని నిలదీశారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆస్తులు అర్ధంతరంగా పెరిగిపోయాయని, ఈ దేశంలో అత్యంత ధనవంతుడైన ఎంపి ఆయనే అని ఉండవల్లి చెప్పడాన్ని అంబటి తప్పుపట్టారు. శ్రీ జగన్‌ ఆస్తుల గురించి ఇంతకు ముందు ఉండవల్లి టివి ఇంటర్వ్యూల్లో మాట్లాడిందేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమిటో తాను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని టివి ఇంటర్వ్యూ క్లిప్పింగ్‌లను మీడియాకు ప్రదర్శించారు. ఒకప్పుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి వ్యాపార సంబంధ, భూమి సంబంధ సలహాలు ఇవ్వడానికి కడప జిల్లాకు వెళ్ళిన వ్యక్తి ఉండవల్లి కాదా అని ప్రశ్నించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉండగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి వద్ద చట్ట వ్యతిరేక సొమ్ము లేదని మీడియాలో బహిరంగంగా చెప్పిన ఉండవల్లికి ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి, పార్టీ పెట్టేటప్పటికి అవినీతి సొమ్ముగా మారిపోయిందా? అని నిలదీశారు. ఇలా మాటలు మార్చే వ్యక్తిని ఊసరవెల్లి అంటారన్నారు.

గాంధీ వారసులమని చెప్పుకునే ఉండవల్లికి ‌కాంగ్రెస్‌ పార్టీని గాంధీ మధ్యలోనే విడిచిపెట్టిన విషయాన్ని మరిచారా? అన్నారు. వ్యాపారాలు చేయకూడదన్నది కేవలం శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే వర్తిస్తుందా? అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ఎంపిలు, ఎమ్మెల్యేలకు వర్తించదా? అని నిలదీశారు. సోనియా అల్లుడు రాబర్టు వాద్రా ఆస్తులపై చర్చకు వచ్చే దమ్మూ, ధైర్యం ఉండవల్లికి ఉన్నాయా? అని అంబటి సవాల్‌ చేశారు. సిబిఐపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. సిబిఐ గురించి వైయస్‌ ఎప్పుడో అన్నది కాదు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాలని అన్నారు.

రాజశేఖరరెడ్డి ఉప్పు తిన్న ఉండవల్లి‌ చౌకబారు ఎత్తుగడలతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అని అంబటి విచారం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలు, వైయస్‌ఆర్‌ అభిమానులు, న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లు ఉండవల్లిని క్షమించరని ఆయన హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యర్థి చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అలాంటి వారంతా ఉండవల్లికి చాలా సన్నిహితులైపోయారని, సన్నిహితుడి కుమారుడు మాత్రం చాలా దూరమైపోయారు, దుర్మార్గుడైపోయారా? అని ఉండవల్లిని ప్రశ్నించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ నాయకులు కొంత బురదను‌ శ్రీ వైయస్‌ జగన్‌పై చల్లితే ప్రజలు విశ్వసిస్తారనుకోవద్దని అంబటి హితవు పలికారు. నీతి, న్యాయం మీద నమ్మకం ఉంటే, రాజశేఖరరెడ్డి మీద ప్రేమ ఉంటే నిజాలు మాట్లాడాలని ఉండవల్లికి ఆయన సూచించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై బురద జల్లితే రాష్ట్ర ప్రజలు సహించబోరని ఉండవల్లి గ్రహించాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పక్షాన చేరి ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్న ఉండవల్లి నీచస్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోతారని అంబటి వ్యాఖ్యానించారు. పార్లమెంటు టిక్కెట్టు తెచ్చుకోగలిగినా ఉండవల్లికి డిపాజిట్టు కూడా దక్కకుండా రాజమండ్రిలో వైయస్‌ అభిమానులు చవిచూపిస్తారని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top