ఆ జిఓలతో జగన్‌కు ఏం సంబంధం?

హైదరాబాద్, 26 మే 2013:

‌రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జిఓలతో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, ఎం.పి. శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డికి సంబంధం ఏమిటని పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడు, సలహాదారు డి.ఎ. సోమయాజులు సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో జరుగుతున్న కోల్‌గేట్‌, రైల్వేగేట్‌, క్రీడల కుంభకోణాలతో ప్రధాని డాక్టర్ మన్మోహ‌న్ సింగ్కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారన్నారు. ఆ 26 జిఓలు జారీ అయిన సమయంలో శ్రీ జగన్ ఎంపి కా‌దు, మంత్రి కాదు, ఐఎఎస్‌ అధికారి కానీ కాదని, అలాంటి ఆయనను దోషి అని ఎలా అంటారని ఆయన నిలదీశారు. శ్రీ జగన్‌తో ఒక్కసారి కూడా మాట్లాడకుండానే సిబిఐ అధికారులు మూడు ఛార్జిషీట్లు ఏ విధంగా వేశారని అన్నారు? ఏ 1 నిందితుడిగా ఎలా చేర్చారని ఆయన అడిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్, జయప్రకా‌ష్ నారాయ‌ణ్‌ లాంటి వారినే జైల్లో పెట్టిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ను‌, సోనియా గాంధీని వ్యతిరేకించినందుకే శ్రీ జగన్ను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ అరెస్టు చేసి ఆదివారానికి ఏడాది పూర్తయిందని సోమయాజులు గుర్తుచేశారు. బెయిల్‌ కోసం శ్రీ జగన్మోహన్‌రెడ్డి దరఖాస్తు చేసిన ప్రతిసారీ ఇదేదో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అని, వదిలిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తారని సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ కోర్టుల్లో సిబిఐ వాదిస్తూ అడ్డు తగులుతూనే ఉందన్నారు. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ముందు చెప్పి ఆ తరువాత రూ 43 వేల కోట్ల అని చెప్పారని, తీరా సుప్రీంకోర్టు సిబిఐని నిలదీసే సరికి దాని విలువ వెయ్యి కోట్లు అని చెప్పిందన్నారు. ఆ లక్ష కోట్లెక్కడ? 43 వేల కోట్లు అన్న సంగతి ఏమిటి ఇప్పుడు వెయ్యి కోట్లు కుంభకోణం జరిగిందనడంలో ఔచిత్యం ఏమిటని సోమయాజులు ప్రశ్నించారు.

దర్యాప్తు పూర్తి కాకపోయినా సిఆర్‌పిసి 167 ప్రకారం 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలన్న నిబంధన చట్టంలో ఉందని సోమయాజులు తెలిపారు. సంవత్సరమైనా బెయిల్ ఇవ్వ‌కపోతే ఇంక ఆ నిబంధన ఎందుకు ఉన్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ సెక్షన్‌ను ఉంచారా? లేక తీసేశారా? అని ప్రశ్నించారు. లేదా కొంతమందికి చట్టంలో ఉండి కొంత మందికి లేదా అనే విషయం తమకు అర్థం కావడంలేదన్నారు. శ్రీ జగన్‌ను అత్యంత కుట్రపూరితంగా, అన్యాయంగా సంవత్సర కాలంగా జైలులో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని జడ్చర్లలో ఎకరం లక్ష, రెండు లక్షల రూపాయల విలువ ఉన్న భూమిని అరవిందో, హెటిరో డ్రగ్సు లాంటి సంస్థలకు రూ.7 లక్షలకు కేటాయించినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారని, శ్రీ జగన్‌ను నిందితునిగా పెట్టారని సోమయాజులు చెప్పారు. ఆ కంపెనీలకు ఇచ్చిన రాయితీ రూ. 16 కోట్లు అయితే ఆ సంస్థలు శ్రీ జగన్‌ సంస్థల్లో రూ. 32 కోట్లు లంచం ఇచ్చారని అభియోగం మోపారన్నారు. తక్కువ లబ్ధి పొందిన వారు ఎక్కడైనా ఎక్కువ మొత్తాన్ని ప్రతిఫలంగా ఇస్తారా? అని సోమయాజులు ప్రశ్నించారు. ఐటి రంగంలో పెద్ద కంపెనీలైన విప్రో, టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలకు రూ.3 నుంచి 5 కోట్ల విలువైన భూములను రూ. 20 లక్షలకే ఇచ్చిన సంవత్సరంలోనే అరవిందో, హెటిరో సంస్థలకు భూమి ఇచ్చారన్నారు.‌ రెండో చార్జిషీట్‌లో శ్రీ జగన్ సంస్థల్లోని పది రూపాయల విలువైన షేర్‌ను రూ. 350కి కొనుక్కున్నాని మరో అభియోగం వేశారన్నారన్నారు. పది రూపాయల షేర్‌ను రూ.350కి రూ. 3,500 కు కూడా కొనుక్కున్న దాఖలాలా మనకు తెలుసన్నారు. షేర్ల విక్రయం ద్వారా వచ్చే ప్రీమియం శ్రీ జగన్‌ జేబులోకి వెళ్ళదని సోమయాజలు స్పష్టంచేశారు. భారతీ సిమెంటులో ప్రీమియం చెల్లించి వాటాలు కొనుక్కున్నవారు మూడు నాలుగు రెట్లు లాభాలు సంపాదించారన్నారు.
ప్రీమియం పెట్టి వాటాలు కొనుక్కున్నవారెవరూ ఫిర్యాదు చేయకపోయినా సిబిఐ బాధపడిపోవడంలోని ఔచిత్యాన్ని సోమయాజులు ప్రశ్నించారు.

2006, 07, 08 సంవత్సరాలకు వస్తే ఈనాడు గ్రూప్‌ మొత్తానికి రూ. 18 వందల కోట్ల నష్టాన్ని ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిందన్నారు. అంత నష్టాల్లో ఉన్న ఈనాడు వాటాలను అధిక మొత్తానికి జెఎం ఫైనానాన్షియర్సు ఏ విధంగా కొనుక్కున్నారని ప్రశ్నించారు. ఈనాడు వాటాల విషయంలో లేని నిబంధనలు శ్రీ జగన్‌ సంస్థల వాటాలకు వచ్చేసరికి ఎలా వచ్చాయని సోమయాజులు ప్రశ్నించారు. శ్రీ జగన్‌ను జైలులో పెట్టడం కోసం న్యాయ వ్యవస్థనే దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు.

ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లక్ష కోట్ల అవినీతి అన్నారని, ఆ లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి కదా అన్నారు. నియంత్రణ లేదా అని సోమయాజులు ప్రశ్నించారు. ఆనం రామనారాయణరెడ్డి పది లక్షల కోట్లు అవినీతి చేశారని నేను ఆరోపిస్తే దానికి ఆధారం అక్కర్లేదా? అన్నారు. ఎవరికి వారు నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. దానికి అంతెక్కడ అన్నారు. వెయ్యి కోట్లు మాత్రమే కుంభకోణం విలువ ఉందని ఎంతో లోతుగా దర్యాప్తు చేసిన సిబిఐ పేర్కొందని, అది కూడా జగన్‌కు సంబంధం ఉందని స్పష్టం చేయలేదన్నారు. అయితే, ప్రతి రోజూ చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకులు లక్ష కోట్ల కుంభకోణం అని ఆరోపణ చేస్తున్న తీరును సోమయాజులు తప్పుపట్టారు. ఇలాగే జరుగుతూ పోతే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుందనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సోమయాజులు అన్నారు.

Back to Top