వైయ‌స్ జగన్‌ పాదయాత్ర పున:ప్రారంభం

 
 
 
విజయనగరం : అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విశ్రాంతి అనంతరం వైయ‌స్‌ జగన్‌ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు.

వజ్రసంకల్పమే ఊపిరిగా ముందుకుసాగుతున్న జననేత వైయ‌స్‌ జగన్‌ను కలిసేందుకు పాయకపాడుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జననేతకు తమ సమస్యలు విన్నవించేందుకు, తమ కష్టాలు చెప్పేందుకు మహిళలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలను పలుకరిస్తూ.. జనంతో మమేకమవుతూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు‌, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.


11 జిల్లాలో పాదయాత్ర పూర్తి..
వైయ‌స్‌ జగన్‌ ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో  ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి సాలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరి జిల్లాగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తారు. ఏడాదిగా మొత్తం మీద ఇప్పటి వరకు జగన్‌ 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు.
 

 

Back to Top