తిత్లీ పరిహారం చెక్కులు చెల్లకపోవడం మీకు సిగ్గుగా అనిపించడంలేదా బాబూ?

337వ రోజు పాదయాత్ర డైరీ

  
05–01–2019, శనివారం,  
లక్కవరం క్రాస్, శ్రీకాకుళం జిల్లా ,  

ఈరోజు సోంపేట మండలంలో తురకశాసనం నుంచి, పాలవలస, కొర్లాం, బారువ జంక్షన్, లక్కవరం క్రాస్‌ వరకు పాదయాత్ర సాగింది. అన్నీ బాగా వెనుకబడిన ప్రాంతాలే. పైగా వరుస తుపానులకు బాగా నష్టపోయాయి. ఎన్నో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎంతోమంది పంటలు కోల్పోయారు. అయినా పట్టించుకున్నవారే లేరు. వారికి తుపాను పరిహారం ఇవ్వలేదు సరికదా.. కనీసం సంక్షేమ పథకాలు అందించలేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

పాలవలస కాలనీకి చెందిన దున్నశేషమ్మ ఛాతిలో గడ్డతో బాధ పడుతోంది. జరాబందకు చెందిన కొండ రాముకు గుండెలో రంధ్రం ఉంది. ఆస్పత్రికెళితే ఆరోగ్యశ్రీ లేదని వెనక్కి పంపించేశారట. సుంకిడి గ్రామానికి చెందిన బొండాడ రాజమ్మ, మడ్డు దాలమ్మ, పాలవలసకు చెందిన గోకర్ల ధర్మావతి నిరుపేద వితంతువులు. కూలిపనులు చేసి పొట్టపోసుకుంటున్నారు.  మూడేళ్లుగా వితంతు పింఛన్‌ల కోసం అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏడు పదులు నిండిన కర్రి ఎండమ్మ, బదకల కొసరాజులు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం లేదని కంటతడిపెట్టారు. బారువా కొత్తూరులో మత్స్యకార కుటుంబానికి చెందిన స్వాతి పుట్టుకతోనే మూగ,చెవుడు బాధితురాలు. వందశాతం వైకల్యం ఉన్న ఆ పాప చనిపోయినట్లు రికార్డుల్లో పెట్టి మరీ పింఛను ఆపేశారట. అదే ఊరికి చెందిన వలిశెట్టి రుషికి నాన్నగారి హయాం నుంచి వస్తున్న పింఛన్‌ను.. ఈ ప్రభుత్వం వచ్చాక తీసేసింది.  సుంకిడి గ్రామానికి చెందిన మహాలక్ష్మి, ఇప్పిలి లక్ష్మి, గీతాంజలికి ఒక్కొక్కరికి ఇద్దరేసి ఆడబిడ్డలున్నారు. బంగారుతల్లి పథకం కింద పేర్లు నమోదు చేయించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పథకం కింద దశల వారీగా రావాల్సిన సొమ్ము జమ అయిందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో తర్వాత రావాల్సినది ఒక్క పైసా కూడా జమ కాలేదని చెప్పారు.  బలహీనవర్గాలకు చెందిన స్వాతి, సాయికిరణ్‌లు అర్హత ఉన్నా.. తమకు స్కాలర్‌షిప్పులు రావడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు తిరిగినా ఇల్లు ఇవ్వడంలేదని దాలమ్మ అనే అవ్వ కన్నీరు పెట్టుకుంది. ఆ దిక్కులేని అవ్వ.. పూటకో పంచన చేరి కాలం వెళ్లదీస్తోందట. ఇవన్నీ చూస్తుంటే.. అసలు ప్రభుత్వం అనేది ఉందా? సంక్షేమాన్ని పట్టించుకుంటోందా? అని
అనిపించింది.   

తొండిపూడి గ్రామానికి చెందిన ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులు కలిశారు. ఈ ఊరిలో జిల్లా పరిషత్‌ హైస్కూలు తుపానుకు దెబ్బతిందని చెప్పారు. తరగతి గదుల పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయట. బడికెళ్లాలంటేనే భయమేస్తోందని బాధపడ్డారు. ఆరుబయట చెట్ల కిందే చదువుకోవాల్సి వస్తోందన్నారు. అధికారులనేవారెవ్వరూ ఈ పాఠశాల దుస్థితిని పట్టించుకున్నపాపానే పోలేదట. కార్పొరేట్‌ స్కూళ్లకు లబ్ధి్ద చేకూర్చడానికి.. బాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఏదో వంక పెట్టి మూసేస్తున్న బాబుగారు.. ఇక దెబ్బతిన్న స్కూళ్ల మరమ్మతుల గురించి ఏం పట్టించుకుంటారు?  

సోంపేటకు చెందిన వినోద్, మేనకాప్రధాన్‌ అనే దంపతులు కలిశారు. వాళ్ల పాప నదియా ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో సెకండ్‌ర్యాంక్‌ సాధించింది. మూడేళ్ల కిందట తిరుపతిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇద్దరూ ఆ పాపకు సన్మానం చేసి, మెడల్‌ ఇచ్చి, ప్రతిభ అవార్డునిచ్చారు. ఆ అవార్డు పారితోషికం కింద రూ. 20 వేలు అకౌంట్లో పడతాయని చెప్పారు. బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి, మూడేళ్లుగా ఆ పారితోషికం కోసం ఎదురుచూస్తూ బీకాం కూడా పూర్తి చేసింది. కానీ, ఆ సొమ్ము ఇప్పటికీ ఒక్క పైసా కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విద్యార్థికీ ఇట్లాంటి మోసం జరగకూడదని కోరుకున్నారు. అవార్డులిచ్చే పేరుతో ప్రచారం చేసుకుని పేద విద్యార్థులను మోసం చేయడానికి మనసెలా ఒప్పుతుంది? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న... ఈ ఒక్కరోజే ఎంతో మంది ప్రజలు నన్ను కలిసి, సంక్షేమ పథకాలు అందడం లేదని, కనీసం తిత్లీ పరిహారమైనా ఇవ్వలేదని చెప్పారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. మీరేమో ‘‘ప్రతి కుటుంబ వికాసం.. వంద శాతం సంక్షేమం.. వందశాతం సంతృప్తి’’ అంటూ పత్రికలన్నింటిలో భారీ ప్రకటనలు ఇచ్చారు. ఇది మోసం కాదా? ఒకవైపు ప్రతిభా అవార్డులిస్తూ మీరే స్వయంగా ప్రకటించిన పారితోషికమే అందడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మీరిచ్చిన చెక్కులే బౌన్స్‌ అయిన సందర్భాలు కోకొల్లలు. తిత్లీ తుపాను పరిహారం కింద మీరిచ్చిన చెక్కులు చెల్లడం లేదని జనం మొర పెట్టుకుంటున్నారు. మీకు కాస్తయినా సిగ్గుగా అనిపించడం లేదా? వాస్తవాలు ఈ విధంగా ఉండగా.. అన్నీ అద్భుతంగా ఉన్నాయంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రజలను
వంచించడం కాదా?
-వైఎస్‌ జగన్‌

 

Back to Top