తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రైతుల పరిస్థితిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వర్షాభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ఇప్పటికే రాష్ట్రం సరాసరి వర్ష పాతం మైనస్ 26.89% లోటులో ఉంది. 12 జిల్లాలు మైనస్ 20% పైన లోటు వర్షపాతంలోనూ, 7 జిల్లాలు మైనస్ 10% పైన లోటు వర్షపాతంతో నీటి ఎద్దడిలో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 9 వారాలు పూర్తయ్యాయి. నడి వర్షాకాలంలో వర్షాలు లేక ఈ ఖరీఫ్‌లో రైతులు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రాష్ట్రంలో వర్షపాత స్థితి జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 7, 2025 (మ.12.30 గం) వరకు చూస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కురవాల్సిన సరాసరి సాధారణ వర్షపాతం 287.03 మి.మీ. కానీ గురువారం మధ్యాహ్నం (ఆగస్టు 7వ తేదీ) వరకు కురిసిన సరాసరి వర్షం 209.84 మి.మీ. అంటే లోటు వర్షం. మైనస్ 26.89 శాతం. అదే జిల్లాల వారీగా తగ్గిన వర్షపాతం చూస్తే.. శ్రీకాకుళం. మైనస్ 24.02% అల్లూరి సీతారామరాజు. మైనస్ 30.67% అనకాపల్లి. మైనస్ 21.14% కాకినాడ. మైనస్ 22.19% డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ. మైనస్ 32.75% తూర్పు గోదావరి. మైనస్ 22.65% పశ్చిమ గోదావరి. మైనస్ 36.11% శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. మైనస్ 50.99% శ్రీ సత్యసాయి. మైనస్ 29.49% వైయస్సార్ కడప. మైనస్ 42.19% అన్నమయ్య. మైనస్ 21.61% తిరుపతి. మైనస్ 23.73% అలా మొత్తం 12 జిల్లాల్లో మైనస్ 20 శాతానికి పైన. మిగిలిన జిల్లాలు సాధారణ వర్షపాతం (మైనస్ 19 నుంచి ప్లస్ 19 వరకు)లో ఉన్నప్పటికీ, జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే.. పార్వతీపురం మన్యం. మైనస్ 16.66% విశాఖపట్నం. మైనస్ 13.65% కృష్ణా. మైనస్ 18.64% గుంటూరు. మైనస్ 11.87% పల్నాడు. మైనస్ 12.18% నంద్యాల. మైనస్ 17.83% చిత్తూరు. మైనస్ 12.07% అలా 7 జిల్లాలు మైనస్ 10 శాతానికి పైగా లోటు వర్షపాతంలో ఉన్నాయి. జిల్లాల వారీగా పంటలు. వాటి సాగు వివరాలు: రాష్ట్రం మొత్తం మీద ఈ ఖరీఫ్‌లో మొత్తం సాగు అంచనా 31.15 లక్షల హెక్టార్లు కాగా, గత బుధవారం (ఆగస్టు 6వ తేదీ) వరకు 16.18 లక్షల హెకార్లు.. అంటే 52% మాత్రమే సాగు జరిగింది. కాగా, వర్షాధార సాగు ప్రాంతాల్లో కూడా వర్షాభావం వల్ల వేరుశనగ, పప్పు ధాన్యాలు, ప్రత్తి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో, కొన్ని జిల్లాల్లో ఆ రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రధానమైన సాగు నీటి ప్రాజెక్ట్‌ల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కాలువ చివరి భూములకు నీరందించలేని పరిస్థితి ఉండగా, వర్షాభావంతో చిన్న సాగు నీటి ప్రాజెక్ట్‌ల క్రింద నీరు అందని గడ్డు స్థితి నెలకొంది. అది ఆయా ప్రాంతాల్లో సాగు విస్తీర్ణంపైనా ప్రభావం చూపింది. గత బుధవారం (ఆగస్టు 6వ తేదీ) నాటికి జిల్లాల్లో సాగు పరిస్థితి చూస్తే.. విజయనగరంలో 38%, అల్లూరి సీతారామరాజులో 41%, అనకాపల్లిలో 7%, గుంటూరులో 42%, బాపట్లలో 21%, పల్నాడులో 21%, ప్రకాశంలో 14%, చిత్తూరులో 12%, వైయస్సార్ కడపలో 19%, అన్నమయ్యలో 10%, అనంతపురంలో 42%, శ్రీ సత్యసాయిలో 29% సాగు జరిగింది. అంటే 12 జిల్లాలలో రాష్ట్ర సరాసరి సాగు 52% కంటే చాలా తక్కువ సాగు జరిగింది. పంటలవారీగా సాగు చూస్తే.. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో మొత్తం సాగు అంచనా 31.15 లక్షల హెక్టార్లు అయితే, అందులో ప్రధానంగా వరి 14.78 లక్షల హెక్టార్లు, వేరుశనగ 4.97 లక్షల హెక్టార్లు, ప్రత్తి 5.28 లక్షల హెక్టార్లు. అంటే, ఈ మూడు పంటలే మొత్తం సాగులో 80%. అందులో వరి, ప్రత్తికి సంబంధించి సాధారణ సాగు జరిగినా, వర్షభావంతో నీటి ఎద్దడి వల్ల కొన్ని ప్రాంతాల్లో ఆ పంటలు దెబ్బ తింటున్నాయి. రాయలసీమలో వేరుశనగ సాధారణ సాగు కంటే చాలా తక్కువ జరిగింది. ఈ ఖరీఫ్‌లో వేరుశనగ సాగు అంచనా 4.97 లక్షల హెక్టార్లు అయితే, ఈనెల 6వ తేదీ నాటికి 1.32 లక్షల హెక్టార్లలో మాత్రమే (27%) సాగు జరిగింది. అయితే ఆ పంటకు ఇప్పుడు సాగు సమయం కూడా దాటిపోయింది. వేరుశనగ సాగు సక్రమంగా జరక్కపోతే, ఆ ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. దాంతో చిన్న, సన్నకారు రైతులు తమ పశువులు తెగ నమ్ముకోవలసిన దుస్థితి వస్తుంది. అందుకే ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృషి పెట్టాలి. ఆయా పంటల విత్తనాలు 90% సబ్సిడీపై ఆ రైతులకు వెంటనే అందించాలి. ఇంకా పశు సంవర్ధక శాఖ కూడా సబ్సిడీపై పశుగ్రాసం, దాణా అందించడంపై దృషి పెట్టాలి. వ్యవసాయానికి అదును, పొదును ప్రధానం: వరి పంటకు నాట్లు వేసిన 10 రోజుల్లోపు మొదటి దఫా రసాయనిక ఎరువు వేయాలి. అయితే ఇప్పుడు పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. మరోవైపు అదునుకి ఎరువు వేయడానికి యూరియా సకాలంలో దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వరి సాగు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. యూరియా సరఫరాలో ఏ సమస్య లేదని వ్యవసాయ శాఖ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. నిజంగా యూరియా కొరత లేనప్పుడు రైతుకు 2 కట్టలే ఇస్తామని ఎందుకు చెబుతున్నారు? యూరియా కావాలంటే కాంప్లెక్స్ ఎరువు కూడా కొనాలి. లేకపోతే లిక్విడ్ నానో యూరియా కొనాలని ఎందుకు లింక్ పెడుతున్నారు? ఒక్కో కట్టకు రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా చెల్లిస్తే, బ్లాక్‌లో యూరియా దొరుకుతోందని రైతులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికైనా వ్యవసాయ శాఖ ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. తగిన చర్యలు తీసుకోవాలి ఉచిత పంటల బీమా: గత ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రయోజనం కల్పిస్తూ, అమలు చేసిన ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో, రైతులు తమ వాటా ప్రీమియమ్‌గా వరికి ఎకరానికి రూ.867, ప్రత్తికి రూ.1939, వేరుశనగకు రూ.571, మిర్చికి రూ.1837 చెల్లించాల్సి వస్తోంది. అయితే చాలా మంది రైతులు ఆ ప్రీమియం చెల్లించక పోవడంతో, ఇన్సూరెన్స్ కవరేజ్‌లో వారి సంఖ్య చాలా తగ్గింది. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ తరహాలో కూటమి ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమాను అమలు చేయాలని కోరుతున్నాం.