విద్యా‘వనమాలి’

పేదలకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలని, పేదరికాన్ని పారదోలడానికి అదొక్కటే మేలిమైన మార్గమని గ్రహించి, అందుకు అనుగుణంగా ఆచరణయోగ్యమైన పథకాలను రూపొందించి వివిధ స్థాయిల్లో చిత్తశుద్ధితో అమలు జరిపిన ఖ్యాతి వైయస్‌కే దక్కుతుంది. గ్రామాల్లో ఉపాధి కరువై అల్లాడుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు తమకున్న చదువుతో ఉన్నచోటే సాంకేతిక విద్య అభ్యసించగలిగితే ఉపయుక్తంగా ఉంటుందని వైయస్‌కు తెలుసు కాబట్టే ఐఐటీకి బదులు ట్రిపుల్ ఐటీలను గ్రామ సీమలకు తెచ్చాడు.

యావత్ దేశంలోనే ట్రిపుల్ ఐటీలను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన మొట్టమొదటి నేత వైయస్. ట్రిపుల్ ఐటీ, విద్యారంగాన్ని ఓ వెలుగు వెలిగించింది. కొత్త ఆశలు రేపింది. జిల్లాకొక విశ్వవిద్యాలయ ప్రతిపాదనతో మొదట కడపలో వేమన విశ్వవిద్యాలయం స్థాపించారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయం కంటే ఎక్కువ వసతులు ఏర్పాటు చేసి వేమన విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాడు. రాజమండ్రిలో నన్నయ్య, నల్లగొండలో మహాత్మాగాంధీ, నిజామాబాద్‌లో తెలంగాణ, కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేరనే చేదు నిజం వైయస్‌కు తెలుసు. అందుకే కనీవినీ ఎరుగని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టాడు. ఏ సంక్షేమ కార్యక్రమానికి రానటువంటి స్పందన ఈ పథకానికి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అతని కీర్తిని దేశం నలుచెరగులా వ్యాపింపచేసింది.

మరోవైపు ఎస్సీ, ఎస్టీ స్కూళ్లలో చదివే పిల్లలకు స్కాలర్‌పిప్పులు, వసతులు పెంచటం, వాటిపై అజమాయిషీ పెంచటం ఆ వర్గాలలో ఉత్తేజాన్ని నింపింది. ఒక కొత్త ఆశల వనాన్ని వైయస్ సృష్టించాడు. అతడు వేసిన బాటను విడనాడి ఎవరైనా పక్కదారి పడితే వారు చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పనిస్థితి కల్పించాడు.

-చుక్కా రామయ్య విద్యావేత్త, ఎమ్మెల్సీ

Back to Top