ఇరవై సార్లు అర్జీలిచ్చాం...
అనంతపురం(ధర్మవరం): ఈ రెండేళ్ల కాలంలో ఇరవై సార్లు అర్జీలు ఇచ్చాం. పింఛన్ మాత్రం రాలేదు. చంద్రబాబు సర్కార్ మాలాంటి పేదలను పట్టించుకోవడం లేదని పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రామాంజినమ్మ, సుజాత, బాలాజీ, రాముడు, గిరిధర్ తదితరులు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువకులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు తప్పుడు హామీలతో నిలువునా ముంచారని విమర్శించారు.
ఒక్క హామీ నెరవేర్చలేదు
అనంతపురం(విడపనకల్లు): ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఎదుట వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విడపనకల్లులోని పోలీస్‌స్టేషన్ కాలనీ, సుంకలమ్మకాలనీ, కురుబగేరి, గౌరమ్మదేవి కాలనీల్లో పర్యటించి, ప్రజాబ్యాలెట్‌ను అందించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ప్రజలతో ప్రజాబ్యాలెట్‌లో మార్కులు వేయించారు.
తాగునీరు రావడం లేదు
ఈస్ట్ గోదావరి(దానవాయిపేట): తాగునీరు సక్రమంగా రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పట్టణానికి చెందిన 30వ డివిజన్ ప్రజలు వైయస్సార్‌సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఎదుట వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఎన్నికలకు ముందు అమలు కానీ హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలను నట్టేటా ముంచారన్నారు. బాబు పాలనపై మార్కులు వేయాలని ప్రజాబ్యాలెట్‌ను అందించారు.