మంచినీటి సమస్యను తీర్చండి

నెల్లూరు(దర్గామిట్ట) : మున్సిపాల్టీ నీరు కలుషితమై నల్లగా  అధ్వానంగా వస్తున్నాయని, వాడుకునేందుకు కూడా పనికిరాదని 45వ డివిజన్‌ ప్రజలు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ ఎదుట వాపోయారు. మంగళవారం డివిజన్‌లోని జేమ్స్‌గార్డెన్, శ్రీనివాస అగ్రహారం ప్రాంతాలలో గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమంలో భాగంగా నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ పర్యటించారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ మంచినీరు వస్తున్న పాతపైపులైన్లను మార్చి కొత్త పైపులైన్లు వేయాలని మున్సిపల్‌ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. ఈ ప్రాంతంలో వచ్చే నీరు దుర్వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే అనిల్‌ మాట్లాడుతూ... ఈ ప్రాంతంలోని ప్రజలు పన్నులు అత్యధికంగా కడుతున్నారని పేర్కొన్నారు. దుర్వాసన వస్తున్న కలుషిత నీటిని పంపిణీ చేయడం ఎంతవరకు సబబమని అన్నారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రత్యేక  చొరవ తీసుకొని రెండు, మూడు రోజులలోపే మంచినీటి పైపులైన్లను మార్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు తాగే మంచినీరు కూడా సరిగా ఇవ్వలేనప్పుడు కార్పొరేషన్‌ ఎందుకని, ఎందుకు పన్నులు కట్టాలని ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి స్పందించి  ఈ ప్రాంత సమస్యలపై చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాగుంట శ్రీకాంత్‌రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, ఇంగిలాల వెంకటరత్నం, ఇంగిలాల సుధాకర్, కోటా శ్రీనివాసులు, గూడూరు వాసుదేవరెడ్డి, దేవిశెట్టి రాజగోపాల్, పి.శ్రీకాంత్, ఎన్‌.బాలయ్య, కొప్పోలు చంద్రశేఖర్, కారంపూడి సుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాస అగ్రహారం ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, పి.హర్ష, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Back to Top