రాజకీయంగా ఎదుర్కోలేని సందర్భంలో సీబీఐ ద్వారా కాగల కార్యం నెరవేర్చుకోవడమనేది కాంగ్రెస్‌కు అలవాటయిన విద్యే.వచ్చే ఎన్నికల్లో మెరుగయిన ఫలితాలు రాబట్టుకునేందుకు తమ దగ్గిర ఏవో అస్త్రాలూ ఆయుధాలూ ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ. ‘ఏమిటా అస్త్రం, ఆయుధం? సీబీఐయేనా?’ అని సూటిగా ప్రశ్నించారు, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి. మధ్యంతర ఎన్నికలపై ఎన్డీటీవీ నీల్సన్ గ్రూప్ నిర్వహించిన సర్వే ఫలితాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ ఆమె ఈ ప్రశ్నాస్త్రం సంధించారు. సహజంగానే, కాంగ్రెస్ పెద్దల నుంచి ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానమూ రాలేదు. ఈ ప్రశ్నకు సమాధానమేమిటో మొయిలీకి తెలుసో లేదోగానీ, దేశ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు.సీబీఐకి ఎవరో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ‘బిరుదు’ ప్రసాదించారు. రాజకీయ శత్రువులను రాజకీయంగా ఎదుర్కోలేని సందర్భంలో సీబీఐ ద్వారా కాగల కార్యం నెరవేర్చుకోవడమనేది కాంగ్రెస్‌కు అలవాటయిన విద్యే. అందులో భాగంగానే గతంలో భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తదితర ప్రత్యర్థి పక్షాలపై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లోనే సీబీఐకి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేసన్ అన్న పేరు స్థిరపడిపోయింది. వైఎస్ జగన్ కేసు విషయంలో ఇది ధ్రువపడింది.వైఎస్ జగన్ కేసు విషయంలోనే, సీబీఐ లక్షణం మరొకటి వెల్లడయింది. ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని సంస్థకు చంద్రబాబు నాయుడు హయాంలో 850 ఎకరాల భూమిని -నగరం నడిబొడ్డున- కేటాయించిన వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని మహానేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐని కోరిన సంగతి అందరికీ తెలుసు.అయితే, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తమ వద్ద ‘తగినన్ని వనరులు లే’వని సాకు చెప్పి అందుకు సిద్ధపడలేదు. అయితే, జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఇతర రాష్ట్రాలనుంచి 80 టీమ్‌లను రప్పించి రంగంలోకి దిగిపోయారు. వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే ఈ వాస్తవాన్ని ప్రస్తావించి, ‘చంద్రబాబుపై విచారణ జరపాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే కోరినా వెనకడుగు వెయ్యడమేమిటి? కోర్టు ప్రకటన వెలువడడం పాపం ఉరుకులు పరుగులపై విచారణ ప్రాంబించడమేమిటి? ఏమిటి సీబీఐ జేడీ ద్వంద్వ నీతి? బాబుకూ లక్ష్మీనారాయణకూ మధ్య జాయింటేమిటి?’ అని నిలదీశారు.సీబీఐ జేడీ ప్రవర్తన సరళి కూడా అభ్యంతరకరంగా ఉందని ఎమ్మెల్యే శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ‘ఆయన వ్యవహార శైలి బాధ్యతగల ఉన్నతాధికారికి తగినట్లు లేదు. టీడీపీ చిల్లరమల్లర నాయకుల ధోరణిలోనే జేడీ లక్ష్మీనారాయణ ప్రవర్తించడం గర్మనీయ’మని శ్రీనివాసులు విమర్శించారు. అంతగా సీబీఐ జేడీకి చంద్రబాబంటే ప్రేమ కారిపోతున్నట్లయితే, తిన్నగా వెళ్లి టీడీపీలో చేరడం మంచిదనీ, అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగదెబ్బ తియ్యడం తగదనీ శ్రీనివాసులు సూచించారు.ఇప్పటికయినా, కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాతయినా, సీబీఐ జేడీ తన వైఖరి మార్చుకోవాలని శ్రీనివాసులు సూచించారు. తాడూ బొంగరం లేని ఐఎంజీ భారత సంస్థకు వందలకొద్దీ ఎకరాలు ధారపోసిన చంద్రబాబు బాగోతాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ మొత్తం వ్యవహారంలో, ఒక విషయం స్పష్టమవుతోంది. సీబీఐ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుతప్పి పక్షపాత బుద్ధితో వ్యవహరించడం ఒకెత్తు. సీబీఐ ఉన్నతాధికారులు సొంత ఎజెండాలతో, విచ్చలవిడిగా వ్యవహరించడం మరో ఎత్తు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నిటినీ గమనిస్తున్నారు. అందువల్లనే, ఎన్డీటీవీ - నీల్సన్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో అత్యధికులు కాబోయే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నారు.ఇద్దరు కాంగ్రెస్ నేతలకూ, వారితో లోపాయికారీ ఒడంబడిక చేసుకుని రచ్చకెక్కిన టీడీపీ నాయకుడికీ వచ్చిన ఓట్లన్నీ కలిపినా వైఎస్ జగన్‌కు వచ్చిన ఓట్ల కన్నా చాలా తక్కువ ఉండడం యాదృచ్చికం కాదు. అది ప్రజల ఆలోచన సరళినీ, వారి బుద్ధి పరిపక్వతనూ సూచిస్తోంది. ద్వంద్వ నీతినీ, దొంగదెబ్బలనూ జనం మెచ్చరనడానికి ఇంతకుమించిన రుజువేముంది?