కొలువుల కోసం వికలాంగులు కమిషనరేట్ ముట్టడి హైదరాబాద్, ఆగస్టు 23 : మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనుమరుగైపోయాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు గురువారంనాడు హైదరాబాద్లోని వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ ముట్టడి సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేతగాని దద్దమ్మలా మారిపోయిందని నిప్పులు చెరిగారు. వికలాంగుల సంక్షేమానికి రూ.200 కోట్ల బడ్జెట్ అవసరముందన్నారు. అయితే ప్రభుత్వం నామమాత్రంగా రూ.63 కోట్లు కేటాయించిందని, అందులో కూడా రూ.36 కోట్లే ఖర్చు చేయడం బాధాకరమన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా వికలాంగులకు రూ.75కు మించి పెన్షన్ పెంచలేకపోయిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రూ.2 వేలు చేస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జననేత వైయస్ బాటలోనే నడుస్తామని బాజిరెడ్డి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ, వికలాంగుల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.