యువ‌త ఉద్య‌మించాలి



శ్రీకాకుళం:   యువ‌త ఉద్య‌మించాల‌ని, యువ చైతన్యంతోనే టీడీపీ పతనం ప్రారంభమవుతుందని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌ అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ‘వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి విభాగం బలోపేతం’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి విభాగంలో సభ్యత్వం తీసుకునేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నుంచి 500 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా 500 ఓట్లు చేర్పించేందుకు హామీ ఇచ్చి ధర్మాన ఆధ్వర్యంలో ఫారం– 6 దరఖాస్తులు అందించారు. యూనివర్సిటీలోని 20 బ్రాంచ్‌లకు గాను ఒక్కో బ్రాంచి నుంచి ఒక అధ్యక్షుడు, కార్యదర్శులను ఎన్నుకుని వైయ‌స్ఆర్‌ సీపీ విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘బాబు వస్తే జాబు.. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి’ అంటూ గత ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో యువత నుంచి ఓట్లు దండుకున్న చంద్రబాబు అధికారం చేపట్టాక హామీలను విస్మరించారని దుయ్యబట్టారు. బాబుపాలనకు చరమగీతం పాడేందుకు యువత సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

విద్యార్థుల్లో ప్రశ్నించే సత్తా ఉన్నప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడుకు మాత్రం ప్రశ్నించేవాడిపై కేసులు పెట్టడం.. తోలుతీస్తా, తొక్క తీస్తానని బెదిరించడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ చట్టాలను చుట్టాలుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్లు పాలిస్తున్న విషయం విద్యార్థులందరికీ తెలుసునన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసలైన నాయకుడని చెప్పారు. జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహోన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేసి నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువు నుంచి దూరం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యార్థి విభాగం యూనియన్‌ జిల్లాలో  ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని కాలేజీలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వానికి ఎల్లోమీడియా కొమ్ముకాస్తోందని.. అన్యాయాలను, అక్రమాలను, మోసాలను కప్పిపుచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా వాస్తవాలను వీలైనంత ఎక్కువ మందికి చేరవేయాలని సూచించారు.

పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు స్వరూప్, పార్టీ యువ నాయుకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆలోచనచేసి  వైయ‌స్‌ రాజశేఖరరెడ్డికి సలహా ఇచ్చినది ధర్మానే అని గుర్తు చేశారు. విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి టీడీపీ అరాచకాలను ప్రజలందరికి తెలియజేసి 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేసేందుకు, ధర్మాన ప్రసాదరావుని గెలిపిచేందుకు కృషి చేస్తామన్నారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీ విద్యార్థులు నారాయణ, జాన్, వై.సంతోష్, జి.సునీల్‌కుమార్, కోదండరావు, కోటి, హర్షవర్దన్, రాంబాబు, కిరణ్‌కుమార్, సూర్యలతోపాటు 200 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, హనుమంతు కిరణ్‌కుమార్, పైడి మహేశ్వరరావు, శిమ్మ రాజశేఖర్, కోణార్క్‌ శ్రీను, అంబటి శ్రీనివాసరావు, కోరాడ రమేష్, యజ్జల గురుమూర్తి, తంగుడు నాగేశ్వరరావు, కె.వి.వి.సత్యనారాయణ, పి.జీవరత్నం, కె.సిజు, జెఎమ్‌.శ్రీనివాస్, ఎమ్‌ఎ రఫీ, మండవల్లి రవి, ఆర్‌ఆర్‌ మూర్తి, హాజీ ఆలీఖాన్, గిడుతురి శ్రీనివాస్‌ స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.


Back to Top