స్పీకర్‌ పదవికి కోడెల అనర్హుడు

దుష్ట సంప్రదాయాలకు తెర తీసుస్తున్నారు
పదవికి రాజీనామా చేసి చంద్రబాబు పాదాభిషేకం చేసుకో
టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తూ స్పీకర్‌ స్థానాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు
ఫిరాయింపుదారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపానపోలేదు
బాండ్ల పేరుతో భవిష్యత్తు తరాలను అన్యాయం చేస్తున్న చంద్రబాబు
హైదరాబాద్‌: దుష్ట సంప్రదాయాలకు తెరతీస్తున్న కోడెల శివప్రసాద్‌ అత్యంత గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్‌ పదవికి అనర్హుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన స్థానంలో ఉండి రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నారా చంద్రబాబు నాయుడి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. సభ విలువలను మంటగలిపే రీతిలో ప్రవర్తించడం ధర్మమేనా అని నిలదీశారు. స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకం కాదు.. డైరెక్ట్‌గా ఆయనకు పాదాభిషేకం చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. 

గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు, పిడతల రంగారెడ్డి, దివి కొండయ్యచౌదరి, కోన ప్రభాకర్‌రావు స్పీకర్‌లుగా పనిచేసి ఆ పదవికి గౌరవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అధికార పార్టీ సభ్యుడు స్పీకర్‌గా ఎన్నికైనా సభను నిస్పక్షపాతంగా నడిపించాలని ప్రతిపక్షనేత, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిని స్పీకర్‌ స్థానంలో కూర్చబెడతారన్నారు. స్పీకర్‌ సభకు వచ్చినప్పుడు సభ్యులంతా లేచి నిలబడి నమస్కారం పెడతారన్నారు. ఆ గౌరవాన్ని స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తులు కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరిస్తున్న కోడెల సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేబినెట్‌ సమావేశానికి హాజరైన ఏకైక వ్యక్తి అన్నారు. అధికార పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో, విదేశాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు పచ్చ కండువా కప్పుకొని పాల్గొంటున్నారన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీకి సంతలో పశువుల్లా అమ్ముడుపోయిన 23 మంది ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు పంపించండి అని ఫిర్యాదు చేసినా కోడెల శివప్రసాద్‌ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా తొలగించిన పాపాన పోలేదన్నారు. స్పీకర్‌ స్థానాన్ని భ్రష్టుపట్టించే విధంగా కోడెల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కోడెల అక్రమాల చిట్టా చాలా ఉందని, అవసరం వచ్చినప్పుడు అవన్నీ బయటపెడతానన్నారు. 

బాండ్ల పేరుతో చేస్తున్న అప్పును కూడా చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అంబటి అన్నారు. బాండ్ల విషయం గొప్పదనే పద్ధతిలో పచ్చపత్రికలు పుంకాలు పుంకాలుగా వార్తలు రాస్తున్నాయని, అత్యధిక వడ్డీరేటు 10.32 శాతానికి, అత్యధిక కమీషన్‌ ఇచ్చి రూ. 2 వేల కోట్లు అప్పు తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమైందని ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పుగా తెచ్చిన డబ్బును దుబారాకు ఖర్చు చేస్తూ భవిష్యత్తు తరాల నెత్తిన అప్పుభారం మోపుతున్నాడని మండిపడ్డారు. యనమల పంటి వైద్యం కోసం రూ. లక్షలు కేటాయించడం, బిల్డింగ్‌ల రిపేర్ల కోసం రూ. వందల కోట్లు దుబారా ఖర్చులు చేస్తూ మరోవైపు నుంచి వేల కోట్లు అత్యధిక వడ్డీకి తీసుకువస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్నాడన్నారు. అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోనే ఎక్కడా లేని పట్టణాన్ని నిర్మిస్తున్నానని, శాసనసభ, హైకోర్టు, సచివాలయం నిర్మాణం బ్రహ్మాండం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాసనసభ సంప్రదాయాలకు విలువ ఉంటుందని, భవనాన్ని చూసి గొప్ప అనుకుంటే పొరబాటన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందనుకోవడం పొరబాటేనన్నారు. 
Back to Top