నోటిలో మట్టిపెట్టుకున్నావా చంద్రబాబూ?

హైదరాబాద్, 3 అక్టోబర్ 2013:

తెలంగాణపై కేబినెట్‌ నోట్ సిద్ధం చేయటం అంటే సీమాంధ్ర ప్రజలను అవమానించినట్లే‌ అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ సీమాంధ్రలో 65 రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్రం కనీసం స్పందించలేదని ఆమె మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన కనిపించటం లేదా అని పద్మ ప్రశ్నించారు. జైలుశిక్ష పడిన చట్టసభ సభ్యుల సభ్యత్వాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సునే చించేశారని, అలాంటిది తెలంగాణపై కేబినెట్ నో‌ట్ను చించలేరా అని కేంద్ర మంత్రులను వాసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‌పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ నోట్‌ సిద్ధమైపోయినా.. మాట్లాడకుండా.. నోటిలో మట్టిపెట్టుకుని కూర్చున్నారా? అని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు.

సిఎం కిరణ్ కుమా‌ర్‌రెడ్డి కనీసం టి నోట్ను ఆపలేకపోయార‌ని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. పైగా సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడినంటూ చెప్పుకోవడం ఏమిటని కిరణ్‌ను ఆమె నిలదీశారు. కేబినెట్‌ నోట్‌ రాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చివరి బంతి వరకు పోరాడతామన్న సిఎం బంతి తగిలి తల పగిలిపోయేలా ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు.

తెలంగాణపై కేబినెట్‌ నోట్‌ రాత్రికి రాత్రే సిద్ధమైందని, దానిని ఈ రోజు కేంద్ర మంత్రులకు పంపిణీ చేస్తారని, సాయంత్రం కేంద్ర కేబినెట్‌ భేటి జరగబోతోందని సమాచారం తెలుస్తోందని పద్మ అన్నారు. కేంద్రం ఇంత దూకుడుగా, ఏకపక్షంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేబినెట్‌ నోట్‌లో ఏమున్నదో కూడా లీకులిస్తూ.. పది జిల్లాలతో కూడి, హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ నోట్‌ సిద్ధమైందని కేంద్రం చెప్పడం పట్ల ఆమె నిరసన వ్యక్తంచేశారు. సీమాంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ ఇవ్వడానికే సిద్ధమైతే రాష్ట్రంలో జరిగే తీవ్ర పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాలని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. కేబినెట్ ముందు తెలంగాణ నో‌ట్ పెడితే‌ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను అడ్డుకోకుండా ప్రధాన ప్రతిపక్షం టిడిపి మద్దతు ఇస్తూ.. ప్రజలకు ద్రోహం చేస్తోందని పద్మ విమర్శించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానాన్ని పంపించి ఉంటే కేంద్రం ఇంత దూకుడుగా వ్యవహరించి ఉండేది కాదన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను తక్షణమే నిలిపివేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోకుండా మా దారిన మేం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే సీమాంధ్రులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేబినెట్‌ నోట్‌ను తక్షణమే నిలిపివేయాలని పద్మ డిమాండ్‌ చేశారు. కేంద్ర కేబినెట్‌ నోట్‌ను చింపేస్తారా? లేక ప్రజల ముందు దోషులుగా నిలబడతారా? అని కేంద్ర మంత్రులను ఆమె ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన వల్ల చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయని, తెలంగాణకు అనుకూలంగా ముందుగా ఇచ్చిన వెనక్కి తీసుకుంటున్నాం అని చంద్రబాబు చెబితే కేబినెట్‌ నోట్‌ ఇంత ముందుకు రాకుండా ఉండేదన్నారు.

సాయంత్రం జరిగే కేబినెట్‌ సమావేశంలో నోట్‌పై చర్చిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పద్మ హెచ్చరించారు.

Back to Top