విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ ఎన్నికల దిశగా సన్నాహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ తెరతీసింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేపట్టింది. అందుకోసం ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర పా లకమండలి సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఎన్నికలకు సంబంధించినంతవరకు ఈ కమిటీకి స్పష్టమైన విధివిధానాలను అధిష్టానం నిర్దేశించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, నేతలు-కార్యకర్తలతో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల వ్యూహాన్ని ఈ ద్విసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. త్వరలో వీరిద్దరూ నగరంలో పర్యటించి కార్యాచరణకు ఉపక్రమిస్తారు.
సంస్థాగత బలోపేతం : జీవీఎంసీ పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ కమిటీ మొదటగా దృష్టిసారిస్తుంది. ఇప్పటికే నియమించిన నగర కమిటీతోపాటు డివిజన్, అనుబంధ సంఘాల కమిటీల నియామకాలపై కసరత్తు చేస్తుంది. పార్టీలోకి అవసరమైన కొత్త నేతల చేరికలు, పార్టీ బలోపేతం కోసం ఇతరత్రా చర్యలపై చర్చించి నిర్ణయిస్తుంది. ప్రాథమిక సమాచారంపై ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించింది.
ప్రజాసమస్యలపై పార్టీని పోరుబాటు పట్టించాలని కమిటీ నిర్ణయించింది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, హుద్‌హుద్ బాధితులకు పునరావాసంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఇప్పటికే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తూనే ఉంది. గాజువాక నియోజకవర్గ సమస్యల పరిష్కారించాలన్న డిమాండుతో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిం చారు. దీంతోపాటు మరింత విసృ్తతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు జరపాలని పార్టీ భావిస్తోంది.
మరింత సమన్వయం: విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు పార్టీలో సమన్వయాన్ని మరింత పెంపొందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కమిటీల సభ్యులు, కార్యకర్తలు అందరి మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా పార్టీని బలోపేతం చేస్తారు. అందరికి అందుబాటులో ఉంటూ అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఎన్నికల వ్యూహ రచన చేస్తారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడం ద్వారా పార్టీని ఎన్నికల దిశగా సమరసన్నద్ధం చేయడంపై దృష్టిసారిస్తారు.
అభ్యర్థుల ఎంపిక: కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి చేపడతారు. మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేస్తారు.సున్నితమైన వ్యవహారమైనందున అత్యంత జాగురకతతో వ్యవహరిస్తారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం, పార్టీ కోసం కష్టించినవారికి గుర్తింపునకు పెద్దపీట వేస్తూ అంతిమంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారు. అందుకు సన్నాహకంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విసృ్తతంగా సంప్రదింపులు జరుపి అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు.
ప్రచారం- ఎన్నికల వ్యూహం: సంస్థాగత బలోపేతం, సమన్వయం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలకు సమాంతరంగా విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి జీవీఎంసీ ఎన్నికల వ్యూహం, ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఓ ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తారు. దాంతోపాటు నియోజకవర్గాలు, డివిజన్లవారీగా స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ కూడా ఎన్నికల కసరత్తు జరుపుతారు. స్థూలంగా చెప్పాలంటే జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆద్యంతం అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిల కమిటీ పర్యవేక్షించి కార్యాచరణ రూపొందిస్తుంది.