ఏపీ ప్రజలతో చంద్రబాబు డేంజర్‌ గేమ్‌

ఎల్లో మీడియాతో ఐటీ సోదాలను తీవ్రవాదుల దాడిగా చిత్రీకరిస్తున్నాడు
చంద్రబాబు డైరెక్షన్, లోకేష్‌ మానెటరింగ్, పచ్చమీడియా యాక్షన్‌
నిప్పుకు తనిఖీలు అంటే ఎందుకు భయం
రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి
ఎన్ని పాపాలు చేస్తే ఇంత భయం ఉంటుంది చంద్రబాబూ?
తనపై జరుగుతున్నట్లు తప్పుడు ప్రచారాలతో సానుభూతి పొందాలనే దురాలోచన
వైయస్‌ జగన్‌పై ఐటీ సోదాలప్పుడు ఏరకంగా చూపించారో ప్రజలు మర్చిపోలేదు
దేశంలో సంపన్నుల జాబితాలో నారా భువనేశ్వరి ఎలా చేరారు
పవన్‌ కల్యాణ్‌ మాటలు ఆధారంగా ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టాలి
ప్రతి నియోజకవర్గంలో రూ. 20 కోట్లు ఎక్కడ దాచారో బయటకు తీయాలి
హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో డేంజర్‌ గేమ్‌ ఆడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఐటీ దాడుల విషయంలో ఏదో గందరగోళం జరిగిపోతున్నట్లుగా చిత్రీకరిస్తున్నాడని, పచ్చ మీడియాను ఉసిగొల్పి కుట్ర సిద్ధాంతం అల్లి నానా యాగి చేస్తున్నాడని మండిపడ్డారు. ఉదయం నుంచి గ్రహాంతర వాసులు, పాకిస్తాన్‌ తీవ్రవాదుల్లాంటి వ్యక్తులు దాడులు చేస్తున్నారనే పద్థతిలో ఎప్పుడూ ఎవరిపై ఐటీ రైడ్స్‌ జరగనట్లుగా పచ్చమీడియా ప్రసారాలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోకేష్‌ స్వయంగా ఎల్లో మీడియాతో మాట్లాడి తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయని విపరీతంగా ప్రచారం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు ఉదయం నుంచి కుట్రపూర్వకంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని, పలానా మంత్రుల మీద జరుగుతాయని ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రియలెస్టేట్‌ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయని తెలిసిందని, కానీ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో ఐటీ సోదాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలు ఏం రాశాయో.. ఏం చూపించాయో ప్రజలింకా మరిచిపోలేదన్నారు. ఇవాళ తెలంగాణలో రేవంత్‌రెడ్డిపై, ఏపీలో పలువురిపై దాడులు జరుగుతున్నప్పుడు ఎల్లోమీడియా ఐటీ పంజా అంటూ గ్రహాంతర వాసులు వచ్చిన మీదపడినట్లుగా ఆర్భాటం చేస్తున్నారన్నారు. ఇవేం మీడియా విలువలు.. ఇదేం నీతి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ సోదాలు జరిగే విషయం అధికారులు అకస్మాత్తుగా దాడి చేసే వరకు ఎవరికీ తెలియవని, కానీ రేవంత్‌రెడ్డి వారం రోజుల ముందే తనపై దాడులు జరుగుతాయని, చంద్రబాబు నాలుగు రోజుల నుంచి దాడులు జరుగుతాయని చెప్పడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారని, ఒక పద్ధతి ప్రకారం.. డ్రామా ఆడుతున్నాడన్నారు. ఈడీ లాంటి సంస్థలో కూడా మనుషులను మ్యానేజ్‌ చేస్తూ వైయస్‌ జగన్ను వేధిస్తున్నారని గతంలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామన్నారు. ఐటీ సంస్థలో కూడా ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు సానుభూతి గెయిన్‌ చేసే ప్రచారాన్ని తెరమీదకు తీసుకొచ్చారన్నారు. 

ఐటీ, సీబీఐ నుంచి ఎవరు వచ్చినా తనపై ఏదో కుట్ర జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబసభ్యులవి వ్యాపారాలు కాదా.. రూ. 12 వందల కోట్లతో దేశంలో సంపన్నుల జాబితాలో నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎలా చేరిందని ప్రశ్నించారు. చంద్రబాబు కేబినెట్‌ మంత్రుల్లో వ్యాపారాలు లేని వారు ఎవరు..? విచారణకు ఎవరైనా వస్తే అది మీపై జరుగుతున్నట్లు అభివర్ణించుకోవడం ఏంటీ చంద్రబాబూ..? అని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లోకి రెండెకరాలతో వచ్చి కోట్ల రపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఎలా పడగలు ఎత్తారని నిలదీశారు. చేతికి వాచీ, వేళ్లకు ఉంగరాలు, మెడలో చైన్, జేబులో డబ్బులు లేవంటే ప్రజలు, దర్యాప్తు సంస్థలు మిమ్మల్ని నమ్మి ఊరుకోవాలా..? 2014 ఎన్నికల ముందు.. తరువాత హెరిటేజ్‌ షేర్లు ఎందుకు పెరిగాయని అనుమానంతో దర్యాప్తు చేస్తే ఎందుకు నొప్పి కలుగుతుందన్నారు. దీనిపై మీడియాను ఉసిగొల్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడడం కోసం మీడియా ముసుగులో ఉన్న అనేక మంది వికృత రూపం చూపిస్తున్నారని వాసిరెడ్డి ధ్వజమెత్తారు. సోయి లేకుండా.. నారాయణ సంస్థల్లో సోదాలు. అని వేస్తే..  చివరకు ఆ మంత్రే వచ్చి సోదాలు లేవని ఖండించే పరిస్థితి నెలకొందన్నారు.  

2014 ఎన్నికల్లో మోడీ, చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఒక మాట చెప్పారని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. చంద్రబాబుతో పవన్‌ రాసుకొని పూసుకొని తిరిగే రోజుల్లో లోకేష్‌ ఒక రహస్యం చెప్పాడని, ఎన్నికలను డబ్బుతో ఎదుర్కోగలం.. ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చు కోసం  ఇప్పటికే రూ. 20 కోట్లు పంపించామని చెప్పారని పవన్‌ వివరించారన్నారు. ఆ రూ. 20 కోట్లు ఎక్కడున్నాయి.? వాటిని ఇవాళ బయటకు తీసుకురావాలి. ఐటీ దాడులు ఆ రూపంలో జరగాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అవినీతి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఎవరు చంద్రబాబు బినామీ, రేవంత్‌ ఇంట్లో దొరికిన వేల కోట్ల ఎవరివో ప్రజలందరికీ తెలుసు. అవినీతి చక్రవర్తులను కుడి, ఎడమలో పెట్టుకొని చంద్రబాబు ఆ మంత్రుల జోలికి రాకుండా.. ఐటీ దాడులు జరగకుండా ముందుగానే కుట్ర సిద్ధాంతం తయారు చేసుకున్నారన్నారు.

నిప్పు.. నిప్పు అని తనని తాను పొగుడుకునే చంద్రబాబు ఐటీ రైడ్స్‌ అంటే ఎందుకు జంకుతున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆదాయం చూపించేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. నరేంద్రమోడీ కుట్ర పూరితంగా దాడులు చేయిస్తున్నారని లీక్‌లు ఇచ్చే చంద్రబాబు తన ఆస్తులపై సోదాలు చేసుకోండి అని మోడీకి ఎందుకు ఓపెన్‌ చాలెంజ్‌ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్ని పాపాలు చేస్తే ఇంత భయం ఉంటుంది చంద్రబాబూ..? చంద్రబాబు, లోకేష్, మంత్రుల నివాసాలపై ఐటీ అధికారులు దాడుల చేయాలని, నాలుగున్నరేళ్ల కాలంలో అనేక అక్రమాస్తులు కూడా బెట్టారన్నారు. అదే విధంగా రూ. 20 కోట్లు ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ దాచారో బయటకు రావాలన్నారు. ఈ దిశగా ఐటీ రైడ్స్‌ జరగాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గతంలో అలిపిరి సంఘటనను సింపథిగా చూపించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఐటీ సోదాలను కూడా తనకు అనుకూలంగా మల్చుకోవాలని చూస్తున్నాడని, కానీ చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజానీకం లేదన్నారు. 
Back to Top