ప్రజల కష్టాలు పట్టించుకోని దద్దమ్మలు

నెల్లూరుః వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితులపై శాసనసభ్యులు, ఎంపీలు ఎవరితోనూ సమీక్ష జరపకపోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నాడని ప్రసన్నకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉండి పార్టీలకతీతంగా మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాల్సిన చంద్రబాబు...టీడీపీ నాయకులను వెంట వేసుకొని తిరుగుతూ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు.  

గత పదిరోజులుగా భారీ వర్షాలతో సర్వస్వం కోల్పోయి ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి...ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు తమకు  సహకరించాలంటూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అమరావతి శంకుస్థాపనకు వందలాది కోట్లు దుబారా చేసేందుకు,  పవన్ కల్యాణ్ కు హెలికాప్టర్ సమకూర్చేందుకు నిధులు వెచ్చించిన చంద్రబాబుకు ప్రజల బాధలు మాత్రం పట్టడం లేదని దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన అవగాహన లేని ఓదద్దమ్మను చంద్రబాబు మంత్రిని చేశాడని నారాయణపై విరుచుకుపడ్డారు. 
Back to Top