నాలుగో రోజుకు చేరిన ఎంపీల ఆమ‌ర‌ణ దీక్ష‌

- క్షీణించిన వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం
- ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌
- రాష్ట్ర‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న ఆందోళ‌న‌లు
 
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాలుగోరోజుకు చేరింది. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైయ‌స్ అవినాశ్ రెడ్డిలు ఆమ‌ర‌ణ దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. వీరి దీక్ష‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పలు పార్టీల నేతలు దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, విద్యార్థులు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నెల 6వ తేదీ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, మిథున్‌రెడ్డి, వైయ‌స్ అవినాష్‌రెడ్డిలు ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్ట‌గా వీరిలో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో పోలీసులు బల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  అయితే ఢిల్లీలో ఇవాళ‌ ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల దీక్షాస్థలి వద్ద మరోసారి టెంట్లు కూలిపోయాయి. ఎంపీలు దీక్ష చేపట్టిన రోజు సైతం ఢిల్లీలో భారీగా వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఏపీ భవన్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారు.

వైవీ సుబ్బారెడ్డికి అస్వ‌స్థ‌త‌
ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయితే ఆయ‌న దీక్ష విర‌మించేందుకు ఒప్పుకోవ‌డంలేదు. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా ఆయ‌న‌ దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తుగా మొద‌టి రోజు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వ‌హించారు. రెండో రోజు నుంచి అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రిలే నిరాహార‌దీక్ష‌లు ప్రారంభించారు. మూడో రోజు దీక్ష‌ల‌తో పాటు వంటా వార్పు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇవాళ కూడా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. ఎంపీల దీక్ష‌కు వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ మ‌ద్ద‌తు తెలిపారు. నిన్న ఢిల్లీ వెళ్లిన విజ‌య‌మ్మ ఎంపీల‌కు సంఘీభావం తెలిపారు. అలాగే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌ల‌ను ఆమె ప‌రామ‌ర్శించారు. అలాగే సీపీఎం, సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శులు సీతారం ఏచూరి, రాజా, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీల దీక్ష‌కు మద్ద‌తు తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top