వైయస్‌ జగన్‌తోనే ఉక్కు పరిశ్రమ సాధ్యం

చంద్రబాబు పాపాలను దేవుడు క్షమించడు
ధర్మపోరాట సభకు టీటీడీ బస్సుల్లో మాంసం, లిక్కర్‌ తరలింపు
బాబు హయాంలోనే వెంకటేశ్వరస్వామి ఆభరణాలు మాయం
తెలుగుదేశం అవినీతి హిమాలయాల ఎత్తుకు పాకింది
వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ చేయిస్తాం
టీడీపీకి అడుగులకు మడుగులు ఒత్తితే సహించేది లేదు
ఎంతవరకైనా ఒంటరిగానే పోరాటం చేస్తాం
వైయస్‌ఆర్‌ జిల్లా: కడపలో ఉక్కు పరిశ్రమ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్ట పరిచేందుకు 13 జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేతలతో విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిలు సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ కమిటీలు పూర్తి చేసుకుంటూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు సంసిద్ధమవుతున్నామన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కడపలో సమావేశమయ్యామని, రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించుకుంటామని చెప్పారు. పార్టీ 21 అనుబంధ సంఘాలను కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి.. సమన్వయకర్తల విజయానికి ఏ విధంగా కృషి చేయాలనే విషయాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.  

రాయలసీమకు ఉక్క పరిశ్రమ నిర్మాణంపై చంద్రబాబు దోబూచులాడుతున్నాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కొంతకాలం బతికి ఉంటే కడపకు ఉక్కు పరిశ్రమ కల సహకారం అయ్యేదన్నారు. దురదృష్టవశాత్తు వైయస్‌ఆర్‌ మరణించడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎత్తులు జిత్తులు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు కొత్త ప్రకటనలు చేస్తున్నాడని, వేల సంఖ్యలో చెప్పే అబద్ధాల్లో ఇదొకటన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించారా..? ఉత్తుత్తి హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, వైయస్‌ఆర్‌ జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. 

చంద్రబాబు అధికార దుర్వినియోగం హిమాలయాల ఎత్తులోకి చేరిందని విజయసాయిరెడ్డి అన్నారు. ఓ సర్వే సంస్థ అవినీతిలో ప్రథమ స్థానంలో ఉందని తేల్చిందన్నారు. ప్రొద్దుటూరులో ధర్మపోరాట సభ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులను వాడారని, వాటిల్లో మాంసాహారాలు, లిక్కర్‌ ట్రాన్స్‌పోర్టు చేశారని మండిపడ్డారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పాపం చంద్రబాబు చేశారన్నారు. భగవంతుడు చంద్రబాబు పాపాలన్నీ చూస్తున్నాడని, ఇలాంటి పాపులను కఠినంగా శిక్షిస్తారన్నారు. స్వామివారి ఆభరణాలు మాయం చేశారని మాట్లాడితే తనపై పరువునష్టం దావా వేశారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ మీద ఆరోపణలు చేస్తే దేవస్థానం ఖజానా నుంచి కోర్టు ఫీజు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. దేవుడికి పరువు నష్టం జరగలేదని, దేవుడి డబ్బులు నష్టం చేశారన్నారు. దేవుడి ఆభరణాలు మాయమయ్యాయని ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. ప్రతి అధర్మ చర్య, అవినీతి, అక్రమాలపై ప్రతి ఒక్కదానిపై వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుందన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా ట్విట్టర్‌లో ట్వీట్‌లు పెడుతున్నానని, అవన్నీ తూచా తప్పకుండా నెరవేర్చుతామన్నారు. 


అధికారులు తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని, చంద్రబాబు అధికారం తాత్కాలికం మాత్రమేనని గుర్తెరగాలని సూచించారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, అధికారులు టీడీపీ అడుగులకు మడుగులు ఒత్తితే వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మన్రేగా ప్రాజెక్టు విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి నామినేషన్‌ పద్ధతిలో  తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా అధికారులు చేస్తున్నారన్నారు. కార్మికుల విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, మెటిరియల్‌ విషయంలో అవినీతి జరగుతుందన్నారు. కరువు విషయంలో ఆంధ్రరాష్ట్రంలో ఉన్న 660 మండలాల్లో సగానికి పైగా మండలాల్లో కరువు ఉంది. కరువుకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది. కరువు నివారణ ఉపాయాలు ఏం చేశారు. కరువు బాధితులను ఏ విధంగా ఆదుకున్నారనే ప్రశ్న వస్తే ప్రభుత్వం విస్మరించిందని చెప్పుకోవచ్చన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుండి ఉద్యమాన్ని నడిపారన్నారు. బీజేపీతో జతకట్టి నాలుగు సంవత్సరాలు కాపురం చేసి విపరీతమైన అవినీతికి పాల్పడిన యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు పోరాడుతున్నట్లు ఇప్పుడు బిల్డప్‌లు ఇస్తున్నారన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తి, స్వార్థపరుడు అంతకంటే దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతున్నామన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవరితో జతకట్టదని, అవసరమైతే ఎంతవరకైనా ఒంటరిగానే పోరాడుతామన్నారు. చంద్రబాబులా స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేసే జతకట్టే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ వ్యతిరేకి అని, ఏనాడూ బీసీలకు సముచిత స్థానం కల్పించలేదన్నారు. బీసీ అంటే బాబుగారి క్యాస్ట్‌ అని ఆయన క్యాస్ట్‌కు సంబంధించిన వారినే చంద్రబాబు బీసీలుగా పరిగణిస్తాడన్నారు. పార్లమెంట్‌లో బీసీలకు సంబంధించి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్‌ కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ కోరిందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.  
Back to Top