వైయ‌స్‌ జగన్‌ వల్లే హోదా సజీవంగా ఉంది

- ప్రజల రుణం తీర్చుకునేందుకే ఆమరణ నిరాహార దీక్ష
ఢిల్లీ :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాటాల ఫ‌లితంగా ప్ర‌త్యేక హోదా అంశం స‌జీవంగా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు రాజీనామా అస్త్రాలను సంధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ అన్నిరకాలుగా అభివృద్ధి చెందిందని, 60 శాతం ఆదాయం అక్కడ నుంచే వచ్చే సమయంలో రాష్ట్రాన్ని విడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తామని చెప్పారని, కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపి, ప్లానింగ్‌ కమిషన్‌కు పంపారని అన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన బాబు హోదాను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చుంటే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. హోదాను చంద్రబాబు పట్టించుకోకపోయినా, వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాటం ద్వారా ఆ డిమాండ్‌ను సజీవంగా ఉంచారని తెలియచేశారు. ఇందుకోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్టడంతో పాటు, హోదా సాధనకు ఎంపీలతో రాజీనామా చేయిస్తామని చెప్పారని తెలిపారు. 

చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది
చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది అని ఎంపీ మేక‌పాటి విమ‌ర్శించారు. తాము అవిశ్వాసం పెడతామని అనగానే మద్దతు ఇచ్చిన చంద్రబాబు రాత్రికి రాత్రే యూటర్న్‌ తీసుకున్నారని మేకపాటి మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానానికి అన్నిపార్టీల మద్దతు కూడగడితే.. ఆ క్రెడిట్‌ తమదేనని అనుకూల మీడియాతో చెప్పించుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.  బీజేపీతో ఎప్పుడు కలవబోమని చెప్పిన బాబు టీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌ పార్టీలతో కలిసి పోటీచేశారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి ఒక్కరే 33 ఎంపీ సీట్లు గెలిపించారని అన్నారు. వైయ‌స్‌ఆర్‌ వల్లే యూపీఏ-1, 2 ప్రభుత్వాలు నిలబడ్డాయిని తెలిపారు. ఆయన మరణానంతరం ఏపీకి చాలా కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఓదార్పుయాత్ర చేపట్టొద్దంటూ సోనియా గాంధీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ఆయన మీడియా సమక్షంలో గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాని, సీఎం చం‍ద్రబాబు చేసిన ద్రోహానికి నిరసనగా ప్రజల రుణం తీర్చుకునేందుకే ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం తాము చేపట్టిన ఆమరణ దీక్షను పెద్దమనసుతో దీవించాలని మేకపాటి ప్రజలను కోరారు.



Back to Top