40 ఏళ్ల చరిత్రలో మాటతప్పిన సీఎం చంద్రబాబే!


– 2014 ఎన్నికల్లో 640 హామీలు ఇచ్చిన చంద్రబాబు
– ఒక్క హామీ కూడా అమలు చేయని సీఎంగా చంద్రబాబు రికార్డు
– పోలవరం ఆవశ్యతకను వైయస్‌ఆర్‌ ఆనాడే గుర్తించారు
– వైయస్‌ఆర్‌ మరణం తరువాత పోలవరానికి ఆటంకాలు
– 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మాటలు ఏమయ్యాయి
– పోలవరం ఎందుకు ఆలస్యమవుతుందో ప్రజలకు చెప్పాలి
విజయవాడ: నలభై ఏళ్ల చరిత్రలో మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు లేరని, ఒక్క చంద్రబాబు మాత్రమే ఆ రికార్డు సృష్టించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఎద్దేవా చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎందుకు అలస్యమవుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 640 హామీలు ఇచ్చారన్నారు. అందులో ఒక్క హామీ కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. పోలవరం ఆవస్యకతను ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి గుర్తించారన్నారు. అసెంబ్లీలో దేవినేని ఉమా మాట్లాడుతూ..జగన్‌ మోహన్‌ రెడ్డి గారు రాసుకోండి..పులివెందులకు పోలవరం నుంచి నీరిస్తామన్నారు. ఏ మైంది మీ హామీ అని నిలదీశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న టీడీపీ నేతల మాటలు ఏమయ్యాయని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్రలో మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు లేరని, ఒక్క చంద్రబాబు మాత్రమే మాట తప్పారన్నారు. గోదావరి ఆయకట్టు స్థితి ప్రమాదకరంగా ఉందన్నారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం నిర్మాణంపై చాలా అనుమానాలు ఉన్నాయని, వైయస్‌ఆర్‌ మరణంతో పోలవరానికి అనేక ఆటంకాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత పాలనలో ఖర్చు పెట్టిన రూ.500 కోట్లు ఇవ్వమని కేంద్రం చెప్పినా..చంద్రబాబు ఎందుకు అంగీకరించారన్నారు. ఇందులో ఉన్న లబ్ధి ఏంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయమని రైతు సంఘాలు కోరితే వెబ్‌సైట్‌లో ఉందని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. 2013 భూసేకరణచట్టం అమలుకు రాకముందే 73 వేల ఎకరాల బూములు సేకరించారన్నారు. ఇంకా 84 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. నిర్వాసితుల పునరావాసానికి కూడా నిధులు అవసరమన్నారు. టీడీపీ ప్రభుత్వం భూసేకరణలో అవకతవకలకు పాల్పడిందన్నారు.  ట్రైబల్‌ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని భూములను నాన్‌ ట్రైబల్‌ పేరుతో నమోదు చేసి పరిహారం అందించారన్నారు. ఇలాంటి సంఘటనలపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో సేకరించిన 500 ఎకరాల భూమిని మళ్లీ సేకరించామని టీడీపీ నేతలు దాదాపు కోట్లాది రూపాయలు కాజేసిందన్నారు. భూ బదలాయింపు నిషేద చట్టానికి తూట్లు పొడిచారన్నారు. బూట్టాయిపాలెం మండలంలో కొబ్బరి తోటలు ఉన్నట్లు చెప్పి నిధులు స్వాహా చేశారన్నారు. 300 వెదురు బొంగులు తొలగించి, 4 ఎకరాల్లో వెదురు బొంగులు తొలగించినట్లు టీడీపీ నేత భార్య పేరుతో పోలవరం నిధులు దోచుకున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం విచారణకు సిద్ధం కావాలని కోరారు. 

 
Back to Top