శ్రీశైలం నీటి విడుదలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహాధర్నా..!

వైఎస్సార్ జిల్లాః మైదుకూరులో వైఎస్సార్సీపీ నేతలు మహాధర్నా, ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రభుత్వం నీటిని తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం లేకుండానే నీటిని వదలడం పట్ల పార్టీ నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నీటిని అడ్డుకునేందుకు ఉద్యమిస్తున్నారు.

రఘురాంరెడ్డి(మైదుకూరు ఎమ్మెల్యే)
చంద్రబాబు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి మండిపడ్డారు. రైతాంగం సంక్షోభంలో ఉంది. వరుస కరువుతో రాయలసీమ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  రాయలసీమ ప్రజలకు నీళ్ళివ్వకుండా ఉన్ననీటిని కృష్ణాకు తరలిస్తున్నారని విమర్శించారు. నీటి విడుదలను వైస్సార్సీపీ అడ్డుకుంటుందని తేల్చిచెప్పారు.

అవినాష్ రెడ్డి( కడప ఎంపి)
పట్టీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీటిని తీసుకెళ్తామన్న నమ్మకమున్నప్పుడు శ్రీశైలం నుంచి నీటిని ఎందుకు విడుదల చేస్తున్నారని కడప ఎంపి అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమలోని హంద్రీనీవా,తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్ట్ లకు అన్యాయం చేస్తూ డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తున్నారని  ఎంపీ తూర్పారబట్టారు.  శ్రీశైలం రిజర్వాయలో 854 అడుగుల నీటిమట్టం అమలు చేయాలని జీవోలో ఉన్నా ప్రభుత్వం నిబంధనలు కాలరాస్తోందని కడప ఎంపి అవినాశ్ రెడ్డి  ఆరోపించారు. ఒట్టిమాటలు కట్టిపెట్టి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

రవీంద్రనాథ్ రెడ్డి( కమలాపురం ఎమ్మెల్యే)
పంటల సంగతేమోగానీ చంద్రబాబు పుణ్యమాని రాయలసీమకు కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, కరవు కవలలుగా మారడంతో రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి రూ. కోట్ల మింగేశారని రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం  దుర్మార్గమైన చర్యలను ఎండగట్టేందుకే ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలిపారు. 
Back to Top