బ్రాహ్మణులను గౌరవించడం నేర్చుకో బాబూ

జీఓ 76 అమలు చేయకుండా కుట్రలు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రాజకీయ రంగు పులమొద్దు
రమణ దీక్షితులు, ఐవైఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకున్నారో చెప్పాలి
అర్చకులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది
విజయవాడ: బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తూ, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రాజకీయ రంగు పులమడానికి చూస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని, రైతులను నుంచి విద్యార్థుల దాకా అందరినీ నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. అర్చకుల సమస్యలను పట్టించుకోకుండా అన్యాయం జరుగుతుందని ప్రశ్నించిన వారిని విధుల నుంచి తప్పిస్తున్నాడన్నారు. ఆంధ్రరాష్ట్రంలో బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయంపై కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రమణ దీక్షితులు, ఐవైఆర్‌ కృష్ణారావు విషయంలో చంద్రబాబు వైఖరి బ్రాహ్మణులంటే చులకన అని తేలిపోయిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాడని మండిపడ్డారు. అనేక విధాలుగా బ్రాహ్మణులను ఇబ్బందులు పెడుతున్నాడన్నారు. బ్రాహ్మణులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా కళ్లు తెరవాలని, దేవుళ్లతో సమానంగా భావించే వారిని గౌరవించే సంప్రదాయం నేర్చుకోవాలని సూచించారు. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోన రఘుపతి డిమాండ్‌ చేశారు. 

డాక్టర్‌ తిప్పేస్వామి హైకోర్టులో కేసు గెలిస్తే తక్షణమే పిలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన చంద్రబాబు కాలయాపన చేసి సుప్రీం కోర్టు వరకు వెళ్లారని, సుప్రీం కోర్టు అక్షింతలు వేస్తే గానీ చంద్రబాబుకు బుద్ధిరాలేదన్నారు. హైకోర్టు తీర్పును గౌరవించి వంశ పారంపర్యంగా వచ్చే ఆచారాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 33వ సవరణ చేసి 76వ జీఓ తీసుకువచ్చారన్నారు. జీఓ నంబర్‌ 76లో అభ్యంతరాలు ఉన్నాయంటూ చంద్రబాబు దాన్ని తొక్కిపెట్టాడన్నారు. దాని అమలు కోసం అర్చకులు ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నారన్నారు. దేవాదాయ శాఖ కూడా అవసరాల కోసం వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకులను రిటైర్డ్‌మెంట్‌ లేకుండా వారి శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవ చేసుకునేలా చూడాలన్నారు. బ్రాహ్మణులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని కోన రఘుపతి భరోసా ఇచ్చారు. ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. జరుగుతున్న అన్యాయాలపై నిలదీయడం, పోరాడే తత్వాన్ని నేర్చుకుందామని, అర్చుకులకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు.  
Back to Top