చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టింది

నాలుగున్నరేళ్ల పాలనలో రైతుల గురించి ఆలోచించిందే లేదు
నోటీసులు ఇస్తే దాన్ని పబ్లిసిటీకి వాడుకుంటున్న ఏకైక వ్యక్తి
కరువు మండలాలను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలి
ఆరు నెలలకు ఒకసారి శివాజీతో ఆపరేషన్‌ గరుడ, పెరుగు వడ
దమ్ముంటే మహారాష్ట్ర మంత్రి భార్యను టీటీడీ నుంచి తొలగించాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోర్టు నోటీసులు ఇచ్చినా పబ్లిసిటీ.. పోలవరంలో వంద కోట్ల స్కాం జరిగిదంటే దాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుటుంబయాత్ర పబ్లిసిటీ చేసుకుంటున్నాడని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఏ భూములు ఎవరికి పంచాలి.. ఎవరికీ కేటాయించాలనే విషయాలు తప్ప ఇప్పటికీ కరువు పరిస్థితులపై చర్చే జరగలేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 406 మిలీమీటర్ల రెయిన్‌ఫాల్స్‌ ఉండాల్సిన పరిస్థితికి, –62కు పడిపోయిందంటే ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు 46 వేల క్యూసెక్యులకు పెంచి నిర్మిస్తుంటే దేవినేని ఉమా ధర్నా చేశాడని గుర్తు చేశారు. ఇతను రాయలసీమకు మంచి చేస్తానని చెబుతున్నాడన్నారు. వర్షాపాతం గురించి వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు మాట్లాడినా సమాధానం లేదన్నారు. 

వ్యవసాయం, అనుబంధ రంగాలను కలుపుకొని మంచి వృద్ధిరేటు సాధించామని, దేశం కంటే మనమే ముందున్నామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నా వల్లే రెండంకెల రేటు వచ్చిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వివరాలన్నీ పరిశీలిస్తే ఎంత వెనకబడి ఉన్నామో అర్థం అవుతుందన్నారు. వరి కర్ణాటకలో 3.3 లక్షల ఎకరాలు, తెలంగాణలో 2.38 ఎకరాల సాగు పెరిగితే.. ఏపీలో సాదరణ సాగు 23 ఎకరాలు మాత్రమే పెరిగిందన్నారు. 23 ఎకరాలకు ఏరకంగా దేశంలో మొదటిస్థానం సాధిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పప్పు ధాన్యాల్లో దేశంలో 11 రాష్ట్రాల్లో సాగు పెరిగితే ఏపీ తగ్గుముఖం, చిరుధాన్యాల్లో 6 రాష్ట్రాల్లో సాగు పెంపు, ఏపీ తగ్గుముఖం, నూనెగింజలు, చెరుకు, పత్తి ఇలా అన్నింటిలో ఏపీ వెనుకబడి పోయిందన్నారు. 

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైందని గడికోట అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో 2008–09లో ఖరీఫ్‌లో 43.86, రబీలో 37.26 లక్షల ఎకరాలు అంటే దాదాపు సంవత్సరానికి రూ. 71.12 లక్షల ఎకరాల్లో సాగు జరిగేదన్నారు. తరువాత కిరణ్‌ ప్రభుత్వంలో కూడా 43.05 లక్షల ఎకరాలకు తగ్గుముఖం పడుతూ వచ్చిందని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో 59 లక్షల ఎకరాల సాగు పడిపోయిందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. పైకి మాత్రం వ్యవసాయంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటున్నాడన్నారు. దేశంలో రైతుల కుటుంబాల ఆదాయంలో ఏపీ 28వ స్థానంలో ఉందని నాబార్డు రిపోర్టు ఇచ్చిందని గడికోట చెప్పారు. గ్రామీణ కుటుంబాల ఆదాయంలో ఆఖరిస్థానంలో ఉందన్నారు. అప్పుల్లో రెండో స్థానంలో ఉందని నాబార్డు రిపోర్టులో తేల్చిందని చెప్పారు. 

ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగ చేసిన చంద్రబాబు సేంద్రియ వ్యవసాయంపై మాట్లాడేందుకు వెళ్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లా రైతుల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో వ్యవసాయం గురించి మాట్లాడుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కరువు పరిస్థితుల గురించి ఆలోచించకుండా సినీ నటుడు శివాజీతో ఆపరేషన్‌ గరుడు అని.. మరో ఆరు నెలల తరువాత ఆపరేషన్‌ పెరుగువడ అనే కార్యక్రమాలు చేయిస్తూ తన పచ్చమీడియాల్లో డిబెట్‌లో పెట్టిస్తున్నాడన్నారు. సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు లాండ్‌ ఆర్డర్‌కు ఆటంకం కలిగించినందుకు కేసు పెట్టి 23 సార్లు నోటీసులు ఇస్తే దాన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడన్నారు. చంద్రబాబు తమపై అక్రమంగా పెట్టించిన కేసులతో వైయస్‌ఆర్‌ సీపీ నేతలకు వారానికి రెండు నోటీసులు వస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్యకు టీటీడీ బోర్డులో మెంబర్‌ని చేసిన చంద్రబాబు దమ్ముంటే ఆమెను తొలగించాలన్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నాడన్నారు. దేశంలో చంద్రబాబు కంటే పబ్లిసిటీ పిచ్చోడు ఇంకొకరు ఉండరన్నారు. బాబ్లీ ప్రాజెక్టు గురించి చంద్రబాబు పోరాటం చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు కనీసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరయినా తెలుసా అని ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి జరిగిందని చెబితే కుటుంబయాత్రల పేరుతో విషయాన్ని పక్కదోవపట్టిస్తున్నాడని మండిపడ్డారు. 
 
Back to Top