విశాఖపట్నం: సంస్థాగతంగా వైఎస్సార్‌సీపీ బలోపేతానికి పాడేరులో సోమవారం నిర్వహించి తొలి నియోజకవర్గ స్థాయి సదస్సు గిరిజన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పాడేరు అసెంబ్లీ సెగ్మెంటులోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్యకార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు.
తమ గుండెల్లో కొలువైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు నిద్రపోమని కార్యకర్తలు ప్రతినబూనారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు. మరొక పక్క పార్టీ అగ్రనేతలు కూడా అదే రీతిలో స్పందిస్తూ గిరిజన హక్కులపరిరక్షణ కోసం పార్టీ అండగా నిలుస్తుందనిచెప్పడంతో వారిలో కొండంత భరోసా ఏర్పడింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ సర్కార్ వైఫల్యంపై పోరుబాట పట్టేందుకు కార్యకర్తలకు అవగాహన కల్పించడంతో పాటు పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతానికి రాష్ర్ట వ్యాప్తంగా తలపెట్టిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల తొలి అవగాహన సదస్సుకు ఏజెన్సీలోని పాడేరు వేదికైంది.
ఈ సమావేశానికి పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకష్ణరంగారావులతో పాటు ఉత్తరాంధ్ర పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ ముఖ్యనేతలు తరలి రావడంతో వారి మాటలు వినేందుకు గిరిజనం తండోపతండాలుగా తరలి వచ్చింది. పాడేరులో ఎటు చూసినా జనమే. సభావేదికైన పాత సినిమా హాలు ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది.తొలుత అగ్రనేతలు పాడేరు ముఖధ్వారంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా తరలి వచ్చారు.పార్టీ కార్యకర్తలు, గిరిజనులు కురిపించిన పూల వర్షంలోవారు తడిసి ముద్దయ్యారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ బైకు ర్యాలీతో నేతలకు ఘన స్వాగతం పలికారు.
ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఏకబిగిన సాగినప్పటికీ సభాప్రాంగణంలో ఏ ఒక్కరూ కదలకుండా నాయకుల ప్రసంగాలను ఎంతో శ్రద్ధతో విన్నారు. వైఎస్సార్..వైఎస్ జగన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు నాయుడ్ని విమర్శించినప్పుడల్లా అదే రీతిలో స్పందించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎన్నికైన తర్వాత తొలి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కావడంతో ఆమె కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఒక్క పాడేరే కాదు..పాడేరుకు దారి తీసే రహదారులన్నీ నాయకుల ఫ్లెక్సీ, వైఎస్సార్‌సీపీ తోరణాలతో నిండిపోయాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడిన తీరును సభలో పాల్గొన్న అగ్రనేతలంతా ప్రస్తావిస్తూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అరకు పార్లమెంటరీనియోజకవర్గంలోని ఏడు అసెంబీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను 25వేల నుంచి 35వేలపైచిలుకు మెజార్టీతో గెలిపించిన మీకు పార్టీ రుణపడి ఉంటుంద న్నారు. గిరిజనులకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని..వారి హక్కుల పరిరక్షణ కోసం పార్టీ రాష్ర్ట నాయకత్వమంతా రోడ్డెక్కి పోరుబాటపడుతుందని.. అవసరమైతే కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పడంతో గిరిజనుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
గిరిజనుల మనోభిష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు సాగిస్తే ఊరుకో బోమని హామీ ఇచ్చింది. గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఘన విజయం చేకూర్చిన గిరిజనం భవిష్యత్‌లో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తామని స్థానిక నాయ కులంతా తేల్చిచెప్పారు. జగన న్నను సీఎం చేసుకునేంత వరకు ఏ ఒక్కరూ విశ్రమించవద్దని పార్టీ నేతలు పిలుపు నివ్వగానే..తప్పకుండా 2019లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసే వరకు ఇదే స్ఫూర్తిగా పనిచేస్తామని గిరిజన నేతలు హామీ ఇచ్చారు.
మరొక పక్క అప్పటి వరకు ఉక్కపోతగా ఎండ ఠారెత్తించినప్పటికీ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆకాశమంతా మేఘావ్రతం కాగా..చిరుజల్లులతో సభాప్రాంగణం తడిసిముద్దయింది. మొత్మమ్మీద వైఎస్సార్ సీపీ తొలి విస్తత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం ఉరకలెత్తింది. ఇదే రీతిలో మిగిలిన నియోజక వర్గాల్లో కూడా ఈసదస్సులు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు.