<strong>ఇష్టారాజ్యంగా ప్రభుత్వ జీవోలు..</strong><strong>రాష్ట్రాన్ని తండ్రికొడుకులు అడ్డంగా దోచుకుంటున్నారు..</strong>విజయవాడః రాష్ట్రంలో భూ సంతర్పణ చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవడబ్బ సొమ్ము అని చంద్రబాబు, దేవినేని ఉమాలు ఇరిగేషన్ స్థలాన్ని ధారదత్తం చేస్తారని విమర్శించారు.. జీవోలను వారికి అనుగుణంగా ఇష్టారాజ్యంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. జీవో 340 ద్వారా ఇరిగేషన్‌కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కృష్ణా జిల్లా కార్యాలయంగా దోచుకోవడాన్ని తప్పుబట్టారు. అమరావతిలో ఖాళీ స్థలం కనబడితే చాలు దోచుకోవడానికి తండ్రికొడుకులు రంగం సిద్ధం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అంటే ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండి జవాబుదారీగా ఒక ట్రస్టీగా ఉండాలన్నాని, కాని చంద్రబాబు మాత్రం భూ బకాసురుడుగా టీడీపీ నేతలకు,సానుభూతిపరులకు భూములు పంచి వారికి లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసే ప్రతి జీవోలో చంద్రబాబు స్వార్థ రాజకీయాలు తేటతెల్లం అవుతున్నాయన్నారు. టీడీపీ నాయకులకు, సానుభూతిపరులకు, పార్టీలోకి పెద్దలకు లబ్ధిచేకూరే విధంగా జీవోలు విడుదల చేస్తున్నారని తూర్పరబట్టారు. టీడీపీకి చెందినవారికే మాత్రమే వర్తించేలా చంద్రబాబు పరిపాలన సాగుతుందన్నారు. ప్రతినెలా జరుగుతున్న కేబినెట్ సమావేశాల్లో ప్రజల సంక్షేమానికి సంబంధించిన చర్చ జరగడంలేదని, కేవలం రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకోవాలి అనే అంశాలపై చర్చ జరుగుతుందని ఆరోపించారు. కేబినెట్ సమావేశాల్లో భూ పంపిణీపై మాత్రమే కసరత్తు జరుగుతుందన్నారు. అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని లోకేష్ ఛాలెంజ్‌లు విసరడం హస్యస్పదమన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు,లోకేష్‌లు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ చేయించుకుని ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని గుర్తుచేశారు. ప్రతి వ్యవహరాల్లోనూ స్టేలు తెచ్చుకునే చంద్రబాబు,లోకేష్‌లకు విచారణ చేయించుకునే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. సీఎం రమేష్, సుజనాచౌదరిలపై ఐటిదాడులు జరిగితే రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతుందన్నట్లు చంద్రబాబు ప్రవర్తన వుందన్నారు. సీఎం రమేష్, సుజనాచౌదరిలు చంద్రబాబు నాయుడు బినామీలనే సంగతి రాష్టమంతట తెలుసన్నారు. ఈ నాలుగేన్నరేళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసేందేమిలేదని, రాష్ట్ర్రాన్ని అప్పులకూపంలోకి నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఆరునెలల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు బండారం అంతా బయటపడుతుందన్నారు.<br/>