కాగ్‌ రిపోర్టుపై బాబు ఎందుకు నోరిప్పడం లేదు

  • అవినీతిని ఒప్పుకొని సమాధానం చెప్పడం లేదా?
  • అనుభవం లేని వీఎస్‌ రమేష్‌బాబు సీఈగా నియమించారు
  • దీని వెనుక ఆంతర్యమేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • కమీషన్ల కోసం ప్రతీ సోమవారం పోలవరానికి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్‌
విజయవాడ: కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ కాగ్‌ రిపోర్టుపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైలవరం కోఆర్డినేటర్‌ వసంత కృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు. పోలవరంలో రూ. 1853 కోట్లు, పట్టిసీమలో రూ. 380 కోట్లు, ప్రకాశం బ్యారేజీలో రూ. 32 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ వెల్లడిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వసంత కృష్ణ ప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనవసర విషయాలకు మైకులు పట్టుకొని కెమెరాల ముందుకు వచ్చే చంద్రబాబు అవినీతి గురించి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఈనాడులో వచ్చినా ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్టుల అవినీతిపై మాట్లాడితే.. సమాయభావ ప్రభావమో లేక ఇంకేమైన కారణమో ఆ భాగం ప్రసారం చేయలేదన్నారు. 

పదే పదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై అనవసర విమర్శలు చేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహానేత వైయస్‌ఆర్‌ జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, పోలవరం కుడి, ఎడమ కాల్వలు 80 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు. ఆ కాల్వల నుంచి నీరు రావని ఎద్దేవ చేసిన చంద్రబాబు వాటి గుండానే పట్టిసీమకు నీరు ఇచ్చారన్నారు. 

పోలవరం ప్రాజెక్టు సీఈగా అనుభవం లేని వీఎస్‌ రమేష్‌బాబును నియమించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని చంద్రబాబును వసంత కృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వ్యక్తి వారం రోజుల్లో రిటైర్డ్‌ అవుతున్నాడని తెలిసి మరీ.. పోలవరం సీఈగా నియమించి రెండు సంవత్సరాల ఉద్యోగ కలం పొడిగించారన్నారు. రమేష్‌బాబుకు ఏమైనా అనుభవం ఉందా..? చిన్న ప్రాజెక్టు అయినా కట్టాడా..? ఆయన పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్టు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. గతంలో తన నిర్మాణ సంస్థ వసంత ఎస్టేట్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేసిన రమేష్‌బాబు ఐదు అంతస్తుల భవనం కంటే అంతకు మించి నిర్మాణాలు చేపట్టిన అనుభవం లేదన్నారు. కృష్ణానది ఈఈగా పనిచేసినప్పుడు చంద్రబాబు, రమేష్‌బాబు మధ్య బంధం ఏర్పడిందని, ఆ అధికారి సహకారంతో అక్రమ ఇసుక దందాలు చేశారని, అప్పడేర్పడిన బంధంతో పోలవరం సీఈగా నియమించారన్నారు. ప్రతీ సోమవారం పోలవరం వెళ్తున్నానని చెప్పే చంద్రబాబు అక్కడ పనులు చూసి తనకు రావాల్సిన కమీషన్ల కోసం వెళ్తున్నాడన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 1853 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ వెల్లడించిందన్నారు. పక్క రాష్ట్రంలో సాగునీటి మంత్రి హరీష్‌రావు చిత్తశుద్ధితో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. మీ చిత్తశుద్ధి ఎక్కడుంది బాబూ.. కార్యకర్తలను పోలవరానికి విహారయాత్రలు తిప్పడమేనా అని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ప్రచార ఆర్భాటం తప్ప.. ప్రజా శ్రేయస్సు తెలియదన్నారు. 
 
Back to Top