పవన్‌కు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా?

ప్రశ్నించేందుకు పార్టీ అని చంద్రబాబుకు నిద్వంద మద్దతు
అనుసరిస్తున్న విధానాలపై పవన్‌కు క్లారిటీ ఉందా?
హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత పవన్‌పై లేదా?
టీడీపీ గెలుపు కోసం జనసేన పనిచేస్తుంది
ఒంటి చేత్తో వైయస్‌ జగన్‌ హోదా ఉద్యమాన్ని నడిపారు
హైదరాబాద్‌: ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పవన్‌ అంతుపట్టకుండా, ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, అనుసరిస్తున్న విధానంపై ఆయనకైనా క్లారిటీ ఉందా అని నిలదీశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్‌ కల్యాణ్‌ కూడా పీఆర్‌పీ తరుఫున ప్రచారంలో పాల్గొన్నారని, ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీని బట్టలూడదీసి పంపించాలనే భాష కూడా వాడాడని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. ఆ తరువాత చిరంజీవి చంద్రబాబు దగ్గరకు రావడానికి ఇష్టపడక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించేందుకు పార్టీ అంటూ జనసేన పెట్టి చంద్రబాబు మద్దతుగా నిలిచాడన్నారు. అవగాహన లేకుండా రోజుకో వైఖరి అవలంబిస్తున్నాడన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. 

జనసేన పుట్టిన తరువాత సొంతంగా అభ్యర్థులను పెట్టి పోటీకి దిగాలి. లేదా ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటే సీట్ల పంపిణీ అయినా జరిగి ఉండాలి. కానీ పవన్‌ అనుసరించిన విధానం... సొంతంగా అభ్యర్థులను పెట్టలేదు. టీడీపీ విధానాలకు ఆకర్షితులై నిద్వందంగా మద్దతు ఇచ్చారు. ఎప్పుడూ ఆ ప్రచార కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా అంశాలకు, వాగ్దానాలకు లోబడే మద్దతు ఇచ్చారు. తరువాత జరిగిన పరిణామాలు నాలుగున్నరేళ్లు చూస్తున్నాం. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో చూస్తే ఒక పక్క చంద్రబాబు, మరోపక్క ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, మధ్యలో వెంకయ్యనాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. దానిలో చేసిన ఉపన్యాసాలు పరిశీలిస్తే రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో జరిగిన చర్చకు అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు అన్నారు. చంద్రబాబు 15 ఏళ్లు హోదా కావాలని కోరారు. దానికి మోడీ కూడా ఆమోదం తెలియజేశారు. పవన్‌ కల్యాణ్‌ ఆ సభలో ఉంటే పోరాడి హోదా సాధించాల్సిన బాధ్యత పవన్‌పై కూడా ఉంది. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఒంటి చేత్తో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక హోదా కోసం అనేక సభలు, సమావేశాలు, నిరాహార దీక్షలు చేసినా పవన్‌ ఏనాడూ హోదా గురించి మాట్లాడలేదు. యువభేరీలు జరుగుతుంటే చంద్రబాబు విద్యార్థులను హెచ్చరించారు. పీడీయాక్ట్‌ పెడతామని యువతను హెచ్చరించి తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపించారు. చంద్రబాబు వైఖరిపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు. చంద్రబాబు, పవన్‌ మధ్య ఉన్న అనుబంధం అంత బలమైంది. అందుకే కనీసం ప్రశ్నించలేని పరిస్థితికి వెళ్లాడు. 

అమరావతి భూముల సేకరణ విధానం రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది. 19 గ్రామాల్లో భూసేకరణ చేస్తుంటే బేతపూడి అనే గ్రామంలో మల్లెపూల తోట సాగు రైతులు 365 రోజులు పంట సాగు చేసుకునే భూములు ఇవ్వమని ఆందోళన చేశారు. అక్కడకు చేరుకొని జేసీబీలు, బుల్డోజర్లతో భూములు అక్రమంగా దున్నుతున్న విధానాన్ని చూసిన పవన్‌ ప్రశ్నిస్తామని ఆ రైతులకు వాగ్దానం ఇచ్చారు. మా భూములు దున్నేస్తుంటే మిన్నకుండా ఎలా ఉంటారని అడిగితే.. పవన్‌ వచ్చి అడ్డుకుంటానని వాగ్దానం చేసి చంద్రబాబు దగ్గరకు వెళ్లి నేరుగా హైదరాబాద్‌ వచ్చి భూ సేకరణ మంచిది అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

రాష్ట్ర పరిపాలన మొదటి రోజు చంద్రబాబు కలెక్టర్ల సమావేశం పెట్టారు. పది ఏళ్ల నుంచి టీడీపీ అధికారంలో లేదు. పనుల కోసం మీ దగ్గరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే కాదనకుండా చేయండి అని కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ విధానాన్ని పవన్‌ తప్పుబట్టారా..? ఇది కలెక్టర్ల స్థాయి నుంచి కింది వరకు పాకింది. సర్పంచ్‌ను పక్కకునెట్టి జన్మభూమి కమిటీలు వేసి పాలన చేస్తుంటే ప్రశ్నించావా..? అక్రమాలపై ఏనాడైనా మాట్లాడావా..? ఇసుక దగ్గర నుంచి నీరు–చెట్టులో మట్టి అమ్మకాలు, బెల్టుషాపులు, ప్రాజెక్టుల అంచెనాలు పెంచి దోచుకుంటున్నా, పోలవరంపై కాగ్‌ ఇచ్చిన రిపోర్టుపై, అమరావతి భూసేకరణ, విశాఖ భారీ భూకుంభకోణంపై ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా..? 

చంద్రబాబుతో స్నేహబంధం సజావుగా ఉండాలనే ఉద్దేశంతో పవన్‌ రాజకీయం చేస్తున్నాడు. ఆఖరికి బాబు అవినీతి పరాకాష్టకు చేరింది. లింగమనేని కృష్ణానది ఒడ్డున కట్టించిన అక్రమ గెస్ట్‌హౌస్‌ను కూల్చివేయాలని గుంటూరు కలెక్టర్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. మీకు తెలుసా పవన్‌..? కానీ అదే లింగమనేని యాజమాన్యం ముఖ్యమంత్రి నివాసానికి ఇస్తే ఇదంతా పేపర్లలో కూడై కూస్తే ఏనాడైనా ప్రశ్నించావా..? ప్రతి విషయంలో టీడీపీ గెలవడానికి ప్రోత్సహించావు కాబట్టి చంద్రబాబు అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు.  

తాజా వీడియోలు

Back to Top