<br/><br/>కర్నూలు: రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్ఆర్‌సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి హెచ్చరించారు. వీబీఆర్ ఆయకట్టు పరిధిలోని రబీ పంటలకు నీరు ఇవ్వాలని కోరుతూ, వీబీఆర్ నుంచి నీటి విడుదల నిలుపుదల చేయాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం భారీ ధర్నా కార్యక్రమం తలపెట్టినట్లు పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వీబీఆర్‌లో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉన్నా ఆయకట్టుకు ఇవ్వమని చెప్పడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల మాటలు నమ్మి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 నుంచి రూ.20 వేలు ఖర్చు చేసి వరి మడులు సాగు చేశారన్నారు. మరో పది రోజుల్లో నీరందకపోతే నారుమడులకు ఎండిపోతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాటమే శరణ్యమన్నారు. వీబీఆర్ లైనింగ్ పనులు అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారని, ఆ పనులు చేపట్టేందుకు నీరు ఇవ్వడం లేదన్నారు. లైనింగ్ పనులు ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో చేసుకోవచ్చు అని, రైతుల పొట్ట కొట్టడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్యే చేతకాని తనం వల్లే రైతులకు నీరు అందడం లేదన్నారు. సాగునీటి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అని హెచ్చరించారు.